సెల్ఫీ అనగానేమి?
సెల్ఫీ అనగా సెల్ ఫోన్లో వుండే కెమేరాతో ఇతరుల సహాయం అర్ధించకుండా తనకు తాను ఫొటో తీసుకోవడం ముఖం అటుతిప్పో, ఇటుతిప్పో లేదా కదలకుండా అలాగే పెట్టో. ఈ సెల్ఫీ ఫోటోలను ఫేసుబుక్కు, ట్విట్టర్ వంటి సోషల్ నెట్ వర్కుల ద్వారా పంచుకుంటూ, ప్రశంసలనందుకుంటూ స్నేహాలను పెంచుకోవడమే సెల్ఫీ తో కుల్ఫీ. సెల్ఫీ అంటే పేరుకి తనఫొటో యే అయినా, చేతిని దూ..రంగా చాచి లెన్స్ ముందుకి..ఎంతమందినైనా నిలబెట్టి ఫోటో తీసుకున్నా కూడా ఆ కుల్ఫీ ని సెల్ఫీ యే అనొచ్చు.
ఈ కుల్ఫీ ఐడియా నిజానికి పాతకాలం నాటిదే. ఒకప్పుడు రాజులు రాణులు తమ స్వీయ చిత్రాలను చిత్రకారునిచేత గీయించుకుండేవారు, లేదా తమచిత్రాన్ని తామే గీసుకుండేవారు. అందుకేగా వాళ్ళెలావుండేవారో మనకి తెలిసింది!!! ఆ తర్వాత నెగటివ్ లు కడిగి ప్రింట్లు వేసే ఫొటోలు, డిజిటల్ కెమేరా ఫొటోలు వచ్చాయి. ఇప్పుడీ స్మార్ట్ ఫోన్లు, ఫ్రంట్ కెమేరాల పుణ్యమా అంటూ యువత సెల్ఫీల మోజులో పడింది.
ప్రపంచంలో మొట్టమొదటి సెల్ఫీ 175 సంవత్సరాల క్రితమే తీశారు. అమెరికాలోని ఫిలడెల్సియాలో ఫోటోగ్రాఫర్ రాబర్ట్ కార్నెలియన్ 1839 సంవత్సరంలోనే తన సెల్ఫీ తీసుకున్నాడు. రాబర్ట్ కెమెరాను సెట్ చేసుకొని దాని ముందుకు వచ్చి 5నిమిషాల పాటు కదలకుండా నిలబడి ఫోటో తీసుకున్నాడు. ఆ ఫోటో వెనుక ‘ఫస్ట్ లైట్ పిక్చర్ ఎవర్, 1839 అని కూడా రాసుకున్నాడు.
నెగటివ్ తో కూడిన కెమేరాలు మూలన పడి చాన్నాళ్ళయ్యింది. ఇక డిజిటల్. నిజాయితీ గా చెప్పాలంటే డిజిటల్ కూడా ఎవరు వాడుతున్నారు? ఏదో ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు, ఫిల్మ్ మేకర్లు తప్ప. సెల్ఫీ పిక్చర్లని తీసుకుని అలా పెట్టుకోవడంతో సరిపోదు, పూర్వం ఆల్బమ్ములలో అంటించి పెట్టినట్లు లేదా కంప్యూటర్లో ఒక ఫైల్ ఫోల్డర్ లో దాచినట్లు. వాటిని ఫేస్ బుక్ లేదా ఇన్స్ టా గ్రాం లేదా ట్విట్టర్ లాంటి సోషల్ నెట్ వర్క్ లకు జోడించాలి. అందుకే ఇది అంతర్జాల దృగ్విషయం (Internet phenomena). ఏం.. ఆ సోషల్ వెబ్ సైట్ల పాలసీల ప్రకారం.. ఏ ప్రొఫైల్ పిక్చర్ గానో ఒక పిక్చర్ పెడితే చాలదా? పొద్దస్తమానం సెల్ఫీలెందుకు? ప్రొదున్న లేవగానే లేచానూ.. అనిచెప్పడానికి ఒక పిక్చరు, నిద్రపోతున్నానూ చెప్పడానికి మరో పిక్చరు ఇలా తాను చేస్తున్న ప్రతి పని ప్రపంచానికి ఎలుగెత్తి చాటడమే ఇంటర్నెట్ ఫినామినా, . దీనికి పూర్తి సహాయ సహకారాలందిస్తున్నది సెల్ఫీ. దీనివల్ల లాభాలేమైనా ఉన్నాయా? ఎందుకు లేవూ?? ప్రపంచమంతా తన పైనే ధ్యాస ని పెంచుకుంటూ అనుక్షణం తన గురించి ఆలోచిస్తూ ఉండాలనే నేటి తరం యొక్క మేటి కోరిక. అంటే అదేదో ఇన్ సెక్యూరిటీ అనో, తన పై తనకు విశ్వాసం లేకపోవడమనో లేదా ప్రతిదానికి ఇతరులనుండి అంగీకారం కావాలనో కాదు గానీ, తాను ఎంత అద్భుతమైన మనిషో.. తాను చేసే ప్రతిపనిలో ఒక అద్భుతం ఎలా దాగివుందో ప్రపంచానికి చాటి అబ్బురపరచడం, అంతే. ఇంకేమి లేదు. అదీ .. ఫేస్ లో !!!!!
మరి వాళ్ళు మన గురించే తప్పకుండా ఆలోచిస్తున్నారని (are you sure?) తెలిసేదెలా? ఆ పిక్చర్లు వెబ్ సైట్లలో పోస్ట్ చెయ్యగానే ఎంత ఫాస్ట్ గా మరియు ఎన్ని ఎక్కువ లైకులువస్తాయన్న దాన్ని బట్టి మన సెల్ఫీ యొక్క వేల్యూని అంచనా వేసుకోవచ్చు. మళ్ళీ ఆ పోస్ట్ ను ఒక్క వెబ్ సైట్లో కాదు.. ఓపికానుసారం ఎన్ని వెబ్ సైట్లను మెయింటెయిన్ చేస్తే అన్ని వెబ్ సైట్లలోనూ పెట్టి అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు.
ఒకవేళ లైకులు, కామెంట్లు తక్కువైపోతున్న పక్ష్యం లో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? ముఖ్యంగా తీసుకోవలసిన జాగ్రత్త ఏవిటంటే.. సిట్యువేషన్ తో పాటు ముఖం లో ఎక్స్ ప్రెషన్ ని కూడా మారుస్తూ సెల్ఫీ లో బంధించడం. లేకపొతే లైకులు తగ్గే ప్రమాదం వుంది. ఈ ప్రమాదం రాకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా నవ్వుతూ లేదా నవ్విస్తూ ముఖకవళికలు మారుస్తూ చూసుకోవాలి. ఏదైనా విచిత్రవేషం వేసి సెల్ఫీ తీసుకుని తానెంత స్పెషలో చెప్పొచ్చు, కనబడిన వారందరితో శక్త్యానుసారం పిక్చర్లు తీసుకుని తాను ఎంత ప్యాపులరో చెప్పొచ్చు, ఏదో ఒక స్టుపిడ్ ఫేస్ పెట్టి తాను చాలా ఫన్నీ, హ్యాపీ అని నిరూపించుకోవ్వొచ్చు. ఆ తర్వాత కావాలంటే రెండు గంటలసేపు ఏడవ్వొచ్చు with own problems.
ఎవరైనా సెల్ఫీ పిక్చర్ పెట్టారంటే..వాళ్ళగురించి వాళ్ళు అందంగా ఉంటారనే చెప్పడానికి అని కాదు, అదే సెల్ఫీలతో వ్యంగ్య మైన ముఖ కవళికలను కూడా బంధించడం ఇప్పుడు ఒక ఫేషన్. ఎప్పుడూ నవ్వుతూ, నవ్వించే పిక్చర్లు ఇక బోర్ కొట్టిందంటే ట్రెండ్ మార్చాల్సిందేగా మరి! భయ భ్రాంతులతో కూడిన లేదా ఆకస్మిక ఆశ్చర్యం లేకా అనాకర్షణీయమైన పిక్చర్లు చెలామణిలో కి తెచ్చి మళ్ళీ లైకుల శాతాన్ని పెంచుకుంటారు. ఇలాంటి వ్యంగ్యాపూర్వకమైన చిత్రాలు గూగుల్ నిండా బొచ్చెడు. వీటి ప్రధమ కర్తవ్యం కేవలం ఏదో ఒక క్రొత్తదనంతో ఒక విచిత్రాన్ని సృషించి జనజీవన స్రవంతిలో ఒక కలకలాన్ని రేపాలనే చిన్న తృష్ణ తప్ప వేరేమీ కనబడదు. May be it’s a new form of socialism. క్రొత్తసామ్యవాద పద్దతి !!!
సెల్ఫీలతో యజమానులను చూసి చూసి వారి పెంపుడు జంతువులు కూడా సెల్ఫీలకు అలవాటు పడిపోతున్నాయి. వాటిని యానిమల్ సెల్ఫీస్ అంటున్నారు. యజమానులను అనుకరిస్తూ సెల్ఫీ పిక్చర్లు తీసుకుంటూ.. వాళ్ళు యానిమల్స్ అని మర్చిపోయి మనుష్యులే అనుకుంటున్నారేమో!
ఈ అద్భుత సాధనం వల్ల కూర్చున్న చోటనే సోషల్ నెట్ వర్కింగ్ పెరగుతున్నది. దానితో పాటుగా కొన్ని అవాంచనీయ మార్పులు కూడ మానవ జీవితం లో చోటు చేసుకునే అవకాశముందట. సెల్ఫీ పిక్చర్లను తీసుకోవడం ఎక్స్ చేంజ్ లు చేసుకోవడం వల్ల ఒక స్థాయిలొ శరీరాకర్షణ (narccism) లకు లోనవ్వడం, స్వీయశోషణ (self-absorption), అటెన్షన్ లకు ప్రాకులాడడం వంటి సమస్యలు ఎదురవుతాయని డాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. వీటి ప్రభావం పెద్దలమీద కన్నా పిల్లలమీద ఎక్కువ చెడు ప్రభావాలని చూపిస్తున్నదిట. వారు మానసిక పరిణతిని పోగొట్టుకుని చిన్న వయసువల్ల సాంఘిక ఒత్తిడులను తట్టుకోలేకపోవడము, సెల్ఫ్ కాన్ ఫిడెన్స్ ను పోగొట్టుకుని ఇతరుల అభిప్రాయాల మీద ఆధారపడడం లాంటి ప్రమాద పరిస్థితిలో పడిపోయే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఏదైనా లిమిట్ లోవుంటేనే అందం కదా!!!!
No comments:
Post a Comment