గౌతమి

గౌతమి

Friday, July 31, 2015

గురుపౌర్ణమి విశిష్టత

ఆషాఢమాసం దక్షిణాయణ వర్షరుతువు తిధి పౌర్ణమి ని "గురు పౌర్ణమి" గా వ్యవహరిస్తారు,  ఆ రోజున అందరూ వారి వారి ఆధ్యాత్మిక గురువులను గౌరవించి పూజించడం ఒక ఆనవాయితీ. సాధారణం గా ఆధ్యాత్మిక గురువులను గౌరవించే రోజు ఈ “గురుసౌర్ణమి”.  స్కూల్ కి వెళ్ళి గురువు దగ్గిర నేర్చుకున్న విద్య మంచి, చెడుల విచక్షణని నేర్పి బ్రతుకు సాధనకు ఉపయోగపడుతుంది. కాని ఆధ్యాత్మిక గురువులు సంస్కారాన్ని, విజ్ఞతని, నేర్వబడిన విద్యా పరమార్ధాన్ని, జగతినంతా విస్తరించుకొని వున్న ఆ పరమాత్ముని లీలల ద్వారా బోధించే తత్వవేత్తలు. అందువల్ల బ్రతుకు బండిని నడిపించుకోడానికి అవసరమైన విద్యను నేర్పే గురువు ఎంత అవసరమో, విజ్ఞానాన్ని వికసింప జేయడానికి ఆధ్యాత్మిక గురువు కూడా అంతే అవసరం. ఇది కేవలం మానుస్య గణానికే కాదు, దేవ మరియు రాక్షస గణాలలో కూడా గురువు యొక్క ప్రాముఖ్యత కనిపిస్తున్నట్లు మన పురాణాలు, భాగవతాలు చెప్తున్నాయి. దీనికి ఒక ముచ్చటైన ఉదాహరణ- వినాయకుడు ప్రమధగణాధిపత్యాన్ని పొందేటప్పుడు తన తమ్ముడు కుమారస్వామి తో పోటీకి దిగుతాడు. పోటీ ప్రకారం కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి అతివేగం గా వెళ్ళి అన్ని పుణ్య నధుల్లో మునిగి వచ్చేస్తుంటాడు కాని మూషిక వాహనుడైన వినాయకుడు మాత్రం మెల్లగా నదీ స్నానాలు పూర్తి చేస్తూ, కుమార స్వామి వేగాన్ని అందుకోలేని పరిస్థితి లోవుంటాడు. అప్పుడు దారి చూపమని తల్లిదండ్రులని వేడుకొంటే తండ్రి శివుడు అధ్యాత్మిక గురువై జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు...తమలోనే అన్ని పుణ్యనదులు, బ్రహ్మాండ కోటి జీవరాశులు నిండి ఉన్నప్పుడు మరెక్కడికో ఎందుకు వెళ్ళడం? తమ చుట్టూ ప్రదక్షిణలు చేసి పోటీ గెలవమని. వినాయకుడు నివ్వెరపోయి వారి చుట్టూనే ప్రదక్షిణలు గావించడం మొదలుపెట్టాడు. కుమారస్వామి కన్నా ముందు పుణ్య నదీ స్నానాలు ఆచరించేసి వినాయకుడు గణాధిపత్యాన్ని పొందాడు. ఇలా పురాణాలు తిరగేస్తూబోతే ఎన్నో కధలు కనబడతాయి అధ్యాత్మిక గురువు అంటే ఏమిటో తెలుసుకోవడానికి.



ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అనీ అలాగే వేదవ్యాసుని పుట్టిన రోజు గా కూడా పరిగణిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం వరాహ పురాణం లో చెప్పినట్లు గా విష్ణే “వ్యాసుడు” రూపం లో ప్రతి యుగం లో అవతరించి ధర్మ సూత్రాలను వెల్లడిస్తూ ధర్మం అదుపుతప్పకుండా నడిపిస్తూ వుంటాడు. అలాగే ద్వాపరం లో సాక్షాత్తు ఆ విష్ణే శ్రీ కృష్ణ అవతారం లో గీతా ధర్మాల్ని బోధించాడు. ద్వాపరాంతానికే ధర్మం కుంటడం మొదలుపెట్టింది. రాబోయే కలియుగం లో మరింత ధర్మ, జ్ఞాన, ఆచార భ్రష్టత్వాలకు లోనై ప్రజలు బ్రతుకుతారని గీతా ధర్మాలతో కృష్ణుడు, అలాగే వేద వ్యాసుడు కూడా జ్ఞాన బోధకుపక్రమించాడు. అందుకే వేదవ్యాసుడు ఆది గురువయ్యాడు. వేద వ్యాసుణ్ణి కూడా విష్ణవతారం గానే భావిస్తారు. వేద వ్యాసుడు మహా భారతాన్ని రచించిందే కాకుండా, అందులో తన పాత్రని కూడా చూపించుకుంటాడు. మహాభారతం  క్రీ.పూ. 3139 లో జరిగినది. దీనిని బట్టి వేద వ్యాసుడు ఈ కాలానికి చెందిన వాడని తెలుస్తున్నది.  కాని అంతకు మునుపెన్నడో వేదాలనేవి పుట్టినప్పుడు ఈయన ఏ విధం గా వేద వ్యాసుడయ్యాడు అనే ప్రశ్న రాక మానదు.

మహాభారత కాలానికి ముందునుండీ సరస్వతీ నది అనే మహా నది ఉత్తర భారతమంతా ప్రవహించేదట. ఆ నదీ సమీపాన ఎంతో మంది ఋషులు నివాసముంటూ వారు సముపార్జించిన విజ్ఞానాన్ని, సాధనలతో తెలుసుకున్న విశ్వ విజ్ఞాన్నీ, దైవరహస్యాలను శిష్యులకు పంచుతుండేవారు. మహాభారత సమయానికి కరువుకాటకాలొచ్చి సరస్వతీ నది 14 సంవత్సరాల పాటు ఎండిపోయినదిట. దానితో అక్కడినుండి నివాసాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందించిన  అపార విజ్ఞానము అక్కడితోనే మాయమవుతూ వచ్చింది. ఆ సమయం లో 14 ఏళ్ళ తర్వాత వేద వ్వాసుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ మహా ఋషులు చెప్పి అక్కడే వదిలేసిన దైవ రహస్యాల్ని, జగత్తులో విస్తరించివున్నప్రాకృతిక రహస్యాల్ని,  దేవుని ఉనికిని తెలియపరిచే తత్వ బోధనలని పరిశోధించి, వాటిని సేకరించి ఆ సమాచారాన్ని వేదాల రూపం లో విభజించి జాబితా చేశాడు. ఆ వేదాలే ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణవేదాలు. సేకరించాక వీటి విభజన చేసిన రోజే ఈ గురు పౌర్ణమి రోజు అని కూడా చెప్పుకుంటారు. అందుకే ఈయనకు వేద వ్యాసుడని పేరు. నిజానికి అది అతని బిరుదు. ఈతని అసలు పేరు కృష్ణదైపాయనుడు.




ఈ విశ్వమంతా ఒక పెద్ద పరిశోధనాలయం గా భావిస్తే ఈ వేదాలని వ్యసించిన (విభజించిన) వేద వ్యాసుడే కాదు సాధనల ద్వారా విశ్వాన్ని, ప్రకృతిని పరిశోధించి రహస్యాల్ని తెలుసుకొని అపారమైన విజ్ఞానాన్ని అందించిన ఆనాటి ఋషులు కూడా పరిశోధకులే. అలాగే మెటీరియల్ సైన్స్ ని శోధించి లాస్ ఆఫ్ ఫిజిక్స్ ని కనుగొన్న ఐనిస్టీన్, ప్లేంక్ మొదలైన వారు, అలాగే ఇతర సైన్సులలోని వారు కూడా అందరూ పరిశోధకులే. వీరందరూ జగతిలోని ఏదో ఒక రహస్యాన్ని చేధించిన వారే. మరి వీరు చేధించిన వాటినన్నిటినీ సృష్టించినది ఎవరూ అంటే ఆ "దేవుడు" - కనిపించని మరోశక్తి, ఒక సెంట్రల్ పవర్ అని తీర్మానించక తప్పదు. ఈ సెంట్రల్ పవర్ హౌస్ ని అర్ధం చేసుకొని దేవునికి దగ్గిరవ్వడానికే ఆధ్యాత్మిక గురువు అవసరం. 

8 comments:

  1. > ఈతని అసలు పేరు కృష్ణదైపాయనుడు.
    అది కూడా వేదవ్యాసులవారి అసలు పేరు కాదండీ, కృష్ణంగా (కరు చీకటితో నల్లగా) ఉన్న ద్వీపంలో జన్నించారు కాబట్టి ఆయనను కృష్ణద్వైపాయనులు అని పిలుస్తారు.

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ- థాంక్స్ అండి. మూడవ పేరాగ్రాఫ్ లో ఆఖరి లైన్ లో వ్రాశాను పేరు - " సేకరించాక వీటి విభజన చేసిన రోజే ఈ గురు పౌర్ణమి రోజు అని కూడా చెప్పుకుంటారు. అందుకే ఈయనకు వేద వ్యాసుడని పేరు. నిజానికి అది అతని బిరుదు. ఈతని అసలు పేరు కృష్ణదైపాయనుడు.".
      .
      మరి ఈయన అసలు పేరేమిటి?

      Delete
    2. శ్యామలీయం గారూ- థాంక్స్ అండి. మూడవ పేరాగ్రాఫ్ లో ఆఖరి లైన్ లో వ్రాశాను పేరు - " సేకరించాక వీటి విభజన చేసిన రోజే ఈ గురు పౌర్ణమి రోజు అని కూడా చెప్పుకుంటారు. అందుకే ఈయనకు వేద వ్యాసుడని పేరు. నిజానికి అది అతని బిరుదు. ఈతని అసలు పేరు కృష్ణదైపాయనుడు.".
      .
      మరి ఈయన అసలు పేరేమిటి?

      Delete
    3. వేద విభజన చేసిన రోజే గురు పౌర్ణమి రోజు అనటంలో ఔచిత్యం కనిపించదు. ఎందుకంటే వేదవిభజన అన్నది ఒక్కరోజులో చేసేపని కాదు.

      మన ఆర్షవాంగ్మయంలో అనేకులకు పేర్లు తెలియవు. సాక్షాత్తూ వేదవ్యాసులవారి నిజనామధేయమూ తెలియదు. ఋషులు తమ భౌతికస్వరూపాలకు కీర్తిప్రతిష్ఠలు కావాలని కోరుకున్నవారు కాదు కాబట్టి వారు సాధారణంగా తమ నిజనామధేయాలను పేర్కొనటం చేయలేదు. మనకు తెలిసిన ఋషులపేర్లలో అధికం వారి ప్రసిధ్ధనామాలే. వాల్మీకి అన్నది కూదా వల్మీకం(పుట్ట)లో నుండి జన్మించాడు కాబట్టి వాల్మీకి అన్న రూఢనామం అంతే. ఆయన ప్రచేతసుడనే ఋషివంశం వాడు కాబట్టి ప్రాచెతసుడు అని కూడా పిలుస్తారు -అసలు పేరు ఎక్కడా తెలియదు.

      Delete
  2. < " మన ఆర్షవాంగ్మయంలో అనేకులకు పేర్లు తెలియవు. "

    శ్యామలరావు గారు, మీ వ్యాఖ్య లోని పై వాక్యంలో "అనేకులకు" కరెక్టా లేక "అనేకుల" అని ఉండాలా?

    ReplyDelete
    Replies
    1. పొరపాటే. "అనేకుల" అని ఉండాలి. సంధిగ్థత ఉంది నేను అనేకులకు అనటం వలన - దురర్థం కూడా రావచ్చును. నా ఉద్దేశం " మన ఆర్షవాంగ్మయంలో అనేకుల అసలు పేర్లు మనకు తెలియవు. " అని చెప్పటమే.

      Delete
  3. చాలా మంచి సమాచారం అందించారు గౌతమీగారు మన హిందూ సంప్రదాయాలు గురుంచి @ https://basettybhaskar.blogspot.in/

    ReplyDelete