మనకన్నా మనం ఆయనకే
అవసరం. ఎందుకంటే నారుపోశాక నీరు పోయాలి కదా! బీజదశలో వున్నప్పుడు అదిమొలకెత్తడానికి
అనువైన పరిస్థితులు చాలినంత ఉష్ణోగ్రత, కావలసినంత నీరు, పెరుగుదలకు అవసరమైన భూమినుండి
ఖనిజలవణాలు కావాలి. ఇవన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతిలోనే ఎలాగూ లభ్యమవుతుంది. అయినా
ఆ బీజం ఏ వాతావరణ వైపరీత్యానికో లోనయి అనుకున్న టైం కి మొలకెత్తలేకపోవచ్చు. మొలకెత్తినా
మొక్క దశనుండి వృక్షదశలోకి అడిగుపెట్టేలోపుల మనుష్యులవల్లో, జంతువుల వల్లో అపాయానికి
గురయ్యి ఏదో ఒక దశలో అదిరాలిపోవచ్చు. మరి దేవుని సృష్టిలో బీజం మొలకెత్తడానికి కావలసినవన్నీ
ఉచితంగా దొరికినప్పుడు, అదే సృష్టిలో అది పెరిగి పెద్దవ్వడానికి అవాంతరాలు కూడా ఎందుకు
వున్నాయి? ఇదే ప్రకృతిధర్మమా?
.
ఇదే ప్రకృతి ధర్మమయితే,
ఇదే ధర్మం మానవజీవితాల్లో కూడా ఇలాగే ప్రస్పుటమవుతుంది. మనిషికి చిన్నతనం లో తానెటువంటి
దశలో పెరుగుతున్నాడు, పెరిగాక ఏ దిశలో ప్రయాణించబోతున్నాడు, ఆ దిశ తాను కోరుకుంటున్నాడా
లేక ఎవరైనా తనకి నిర్ణయిస్తున్నాడా? అది నచ్చని పక్షం లో అది మార్చుకోగలిగే శక్తి,
యుక్తి తనకున్నాయా? ఉన్నా వాటిని ఉపయోగించుకొనే పరిస్థితిలో తాను ఉంటాడా? ఇలా ప్రశ్నలు
వేసుకుంటే ఎన్నో!!!
.
ప్రశ్నలు వేసుకున్నా
మానవునికి అన్నీ తెలియని సమాధానాలే. అయినా మానవుడు దేనికీ భయపడకుండా, భయపడినా వేరే
మార్గం లేకుండా ముందుకు వెళ్తూనే వుంటాడు. ఎక్కడా ఆగడు, అతనికోసం కాలం కూడా ఆగదు. మరి
ఈ దిశని చూపించేదెవరు?
.
కొన్ని సమయాల్లో
మానుషరూపేణా, కొన్ని సమయాల్లో తానే స్వయం గా వచ్చి దగ్గిరుండి నిర్ణయించే బాబాగారే.
ఆయన స్వయం గా వచ్చినా, వేరే ఎవరినైనా పంపినా అది ఆ వ్యక్తికి అర్ధమయ్యేలాగే చేస్తారు.
అందుకే “బాబా గారు ఒక అనుభవం”. ఆయనకు మనుష్యులయినా, జంతువులయినా, మొక్కలయినా ఒక్కటే.
సమదృష్టి, సమానమైన భాధ్యత కలిగివుంటారు. ప్రకృతిధర్మాలకి లొంగవలసిన ఆవశ్యకత, అవష్థ
ఆ ప్రకృతిలోని ప్రతి రేణువుకీ వుంది. జీవిత సమరంలోని వైవిధ్యాలన్నిటికీ లోనయి పోరాడి
నిలవాల్సిన అవసరం మనిషికి వున్నా, లేకపోయినా నిలపాల్సిన అవసరం దేవునికివుంది, లేకపోతే
సృష్టే లేదు. దాన్ని నడపడం కోసమే ఆయనకి మనం అవసరం. ఆయన అవసరాలకి కట్టుబడివుండాల్సిన
అవసరం మనది. ఇలా మానవునిమీద దేవుడు, దేవుని మీద మానవుడు అధారపడి వుండాల్సిందే. కాబట్టి
పాలమునిగినా, నీటమునిగినా అంతా నీదే భారం అని ఆయన మీద వదిలేయ్యడమే సమంజసం. అటువంటి
మన:స్థితితో వున్న ఏ భక్తునికైనా తానే పరిగెత్తుకొని వచ్చి చెయ్యందించడం బాబాగారి ఆనవాయితి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.
సాయిసచ్చరితము
25 వ అధ్య యనం లో చెప్పినట్లు
తాను ధామూ కు ఎప్పటికప్పుడు వెన్నంటి వుండి తాను వ్యాపారంలో నష్టపోకుండా సలహాలిచ్చి
కాపాడాడు. సంతానలేమితో బాధపడుచున్న ధామూ కు, తన దైవశక్తితో సంతానవంతుడిని చేశారు, హేమం
త్ పంత్ నకు ప్రేరణ కలిగించి తన లీలల్ని పుస్తకరూపంలో
వ్రాయించి భావితరాలకోసం పొందుపరిచేరు, తాను తనువు చాలించినా కూడా ఆత్మరూపంలో వుండి
పలుకుతానని మాటయిచ్చారు, అలాగే ఎంతోమందికి లీలలు చూపిస్తూనే వున్నారు. ధు:ఖాలనుండి,
అపాయాలనుండి రక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రారబ్దాలనుండివ్వెలికితీసుకొచ్చి ఒక
మంచి ముగింపును కూడా ప్రసాదిస్తున్నారు.
ఇవన్నీ మనకన్నా ఆయనకే అవసరం, ఎందుకంటే నారు పోశాక నీరుపొయ్యాలి, కంచె కట్టాలి, కాపాడాలి..
దాన్ని వృక్షాన్ని చెయ్యాలి. అలాగే మానవునికి కూడా కంచె కట్టాలి, ఉపద్రవాలనుండి కాపాడాలి,
అతనిని స్థిరపరచాలి. దీనంతటికీ మానవుడు ఆయనకు సహకరించాలి. ఆయన చేసే సహాయాన్ని తీసుకొనగలిగే
పరిస్థితిలో మానవుడు తన ఇంద్రియాలని, ఆత్మను శుద్దమయిన రీతిలో వుంచుకొని బాబాగారికి
అంకితం చెయ్యాలి. అంతేగాని ఏమాత్రం కూడా బాబాగారి దారిలోకి వెళ్ళకుండా నాకేమి చెయ్యలేదని
తిరిగి ఆయన్నే నిందించడం గాలిలో దీపం పెట్టడం లాంటిదే. చేతులారా జీవితాన్ని పెనుతుఫానులు
చేసుకొని, అందులో కొట్టుకుపోతున్నప్పుడయినా ఆయన లేడు అని మూర్ఖం గా ఆలోచించకుండా దారి
లో ఎక్కడోదగ్గిర కలుస్తారని భారం వేస్తే తప్పకుండా వచ్చే తీరుతారు, ఆయనకది తప్పని పరిస్థితి!!