ఆగస్ట్ 12, 2016
ప్రతి సంవత్సరం అలవాటయిన షోడ శోపచార పూజ... ఎంత అలవాటున్నా దానికి పట్టే టైము దానికి పట్టేస్తుంది, టైం లేదుకదా అని ఎంత కుదించాలనుకున్నా పెద్దగా కుదరదు... ఎందుకంటే అసలు వ్రత విధానం సాధారణం గా క్లుప్తంగానే ఉంటుంది, పైగా తెచ్చుకునే వస్తువులు కూడా సింపుల్ వే. ఏముంటాయండీ మహా అయితే ఒక పదీ, పన్నెండు వస్తువులు.
1. పండ్లు
2. పూలు
3. ఆకు,వక్క
4. పంచామృతం
5. రవిక (కుదిరితే చీర కూడా)
6. గంధం
7. అక్షితలు
8. తోరాలు
9. నైవేద్యం
10. అగరొత్తులు
11. కొబ్బరి కాయలు
12. హారతి కర్పూరం
కానీ ఇంటి శుభ్రం, వంటి శుభ్రం, పూజా సామాగ్రి తోమడాలు, కలశం, బొట్లు పెట్టడం, నైవేద్యాల తయారీ, తోరాలు చెయ్యడం ... వీటికి టైం పడుతుంది. మన పెద్దలు మనకిలాగే నేర్పారు మరి. కానీ ఇల్లు, వొళ్ళు, పూజా సామాగ్రి శుభ్రాల్లో అప్ టు డేట్ గా వుంటే సగానికి పైగా పూజకోసం రెడీ అయినట్లే. దీనివల్ల పన్లను కొంచెం కుదించుకోవచ్చు. ఇక మిగిలేది కేవలం లక్ష్మీ పూజే.
ఇవాళ నా పరిస్థితి అయితే ఇంకా విచిత్రం. గత మూడు వారాలనుండి ఎడతెరిపిలేకుండా వర్క్ బిజీలో ఉన్న నేను సాయంత్రం 4.30 వరకూ తెలియదు శ్రావణ శుక్రవారం చెయ్యగలనని. తరువాతి శుక్రవారమే కుదరొచ్చులే అనుకున్నాను.
మూడు వారాలనుండీ ఎడతెరిపిలేకుండా చేస్తున్న వర్క్ కి, కత్తి లాంటి రిజల్ట్ రావడమే కాకుండా ... పెండింగులో ఉన్న మరికొన్ని పరిష్కరింపబడడమే కాకుండా ... ప్రొద్దున్న ఒక మంచి వార్త (వేరే యూనివర్సిటీ నుండి అహ్వానం- ఒక చిన్న సైజు "అంతర్జాతీయ కవి సమ్మేళనం లో వాళ్ళ యూనివర్సిటీ స్టూడెంట్ల కోసం పాల్గొనమని"- అదీ అమెరికా లో ... unbelievable !!!).
సాయంత్రం మరో మంచి వార్త (ఒక రీసెర్చ్ పేపర్ జర్నల్ కి యాక్సెప్ట్ అయ్యింది (హోరా హోరీ పోరాటాలు జరిగాయి రివ్యూయర్లతో)). ఆ పేపర్ కి మెయిన్ వర్క్ చేసి దాని రూపానికొక మూలాధారాన్ని కల్పించాను.
ఇలా మంచి వార్తలు ముసరడంతో ... ఎక్కడ్లేని ఉత్సాహంతో చెలరేగింపు వచ్చేసింది. ఉన్నపళంగా నా డెస్క్ టాప్ మీదకి ఆవిడ వచ్చి కూర్చున్నారు.
ఇహ చల్... ఇక్కడ చేసింది చాల్లే అని ఇంటికి తరిమారు, ఫొటో చేతిలో పెట్టిమరీ !!! ఇహ కలశం, ఆవాహనం అదీ ఇదీ ...అని చెప్పే పనేముంది? ఏకంగా తానే వచ్చేస్తే. అంతే ఇంటికొచ్చేసరికి మా అమ్మాయి కూడా ...చక్కగా తలంటుపోసుకొనుంది, కనీసం ఒక్కసారికూడా నేను అరవలేదు, పంటికున్న బ్రేసెస్ నొప్పి అని అసలేమీ తినలేదు, ఆమెకది ఒక ఉపవాసంలా అయిపోయింది. అరిచే పని లేకపోవడం వల్ల నేను చేసుకొనే పన్లు ఇంకా తేలికయిపోయింది, చీకటి పడే లోపుల ఇలా పంచసంఖ్యోపచారం పూర్త్యిపోయింది,
మా అమ్మాయికూడా నాతో కలిసి అష్టోత్తరం పూర్తిచేసేసింది. కరెక్ట్ గా ఒక గంట... ఆవిడ తనకు కేటాయించేసుకుంది. తర్వాత మా అమ్మాయి పళ్ళనొప్పంటూనే తీపట్లు, పళ్ళు తినేసింది, హాయిగా ఉంది. భలే విచిత్రం.
ఈ సంధర్భంలో ఒక పురాణ కధ గుర్తొచ్చింది. దూర్వాస మహామునికి ఇంద్రుని ఆతిధ్యం నచ్చి ఒక విలువైన హారాన్ని ఇంద్రునికిచ్చాడట. ఆ ఇంద్రుడు దాన్ని తీసుకెళ్ళి ఐరావతానికి అలంకరించాడుట. ఆ ఐరావతం దాన్ని కాళ్ళ క్రింద వేసి, త్రొక్కి ముక్కలు చేసిందిట. అది చూసి మన దూర్వాసులు కోపించి ఇంద్రుడ్ని శపించాడుట, ఏమనీ? నీకున్న సర్వ సౌభాగ్యాల్నీ, రాజ్యాన్ని పోగుట్టుకో అని. అలాగే అన్నీపోయాయి. ఆ తర్వాత ఏం చెయ్యాలో తెలియక విష్ణువునాశ్రయించాడుట. విష్ణు "సర్వ సంపదలనూ ఇవ్వగలిగేది లక్ష్మే. కాబట్టి ఒక జ్యోతిని వెలిగించి, అది ఆవిడ స్వరూపంగా భావించి భక్తొశ్రద్ధలతో ప్రార్ధించి చూడు" అని అన్నాడుట. పాపం ఇండ్రుడు అలాగే చేశాడుట. అంతే దేవి ప్రసన్నురాలై పోగొట్టుకున్నవన్నీ ఇచ్చి ఇంద్రుడిని మళ్ళీ నిలబెట్టిందిట.
అంతేకాదు తాను మోక్షం, విద్య, విజయం, సంతానం, సౌభాగ్యం, సంపద మొదలైన "న్యాయపరమైనవి " "భక్తిశ్రద్ధల" తో ఏమడిగినా ఇవ్వడానికే "వరలక్ష్మి" నై ఉన్నానని కూడా చెప్పిందిట.
ఇంద్రుని కధనుండి, నా కధనుండి అర్ధమయిందేమిటంటే- అనుకోని విధంగా ఇరకాటంలో పడినప్పుడు సింపుల్ గా పూజచేసినా కూడా దేవీ దేవుళ్ళు ఏం ఫీల్ అవ్వరు, పైగా సహకరిస్తారు. అదీ దైవలక్షణం !!!
నాలాగా, ఇంద్రుడిలాగే కాకుండా మరేవిధంగా అయినా ముఖ్యంగా భక్తి శ్రద్ధలతో పూజచేసుకున్నా కూడా మీ అందరికీ ఆ వరలక్ష్మీ దేవి శుభాశీస్సులు !!!