.
గురువును గురువుగా ఆరాధించలేరు, దేవుణ్ణి దేవునిగానూ పూజించలేరు.
.
సాయివిగ్రహాలు ఉన్నస్థానాలని 'సాయిమందిరం' అంటారు. సాయిదేవాలయం అనరు. అది ఒక మెడిటేషన్ సెంటర్ లాగ ప్రశాంతంగా ఉండాలి. ఆయన ఏమి బోధించాడో అది మాత్రమే అక్కడ పాటించాలి. గురువు వేరు, దేవుడు వేరు. జ్ఞానాన్ని బోధించి, దేవుని మార్గాన్ని సూచించి ఆ మార్గంవైపు నడిపించేవాడు గురువు. అది సాయిబాబా. అంతేగానీ, అప్పటికప్పుడు కోరికలను తీర్చే యంత్రాంగం కాదు అతను.
.
అయినా గృహస్థాశ్రమాన్ని స్వీకరించిన వాళ్ళకి సంసారం ఒక చదరంగం అని తెలియదా? మన పావుల్ని మనమో, లేకపోతే ఎవరి చేతుల్లో మన పావుల్ని పెట్టుకుంటామో వాళ్ళో కదుపుతారు కదా... మరి వాటి పర్యవసనాలను మనమే అనుభవించాలి కదా? ఆ బాధ్యత తీసుకోకుండా బాబానో, దేవుడ్నో వెంటనే ఉపశమనాన్ని కలిగించమని నిర్భందించి బాధిస్తే ఎలా? కోరికలు తీర్చమని ఒహటే ఓ...మని హైబ్రిడ్ మంత్రాలు చదవుతారు. గురువుకీ, దేవుడికీ కన్ ఫ్యూజ్ అవుతారు.
.
బాబా కాళ్ళ దగ్గిర మిగితా దేవుళ్ళ ని పెట్టి పూజిస్తున్నారుట. వాగ్యుద్ధాలో విన్నాను టీ.వీ షోస్ లో. అయినా ఎవరినయినా ఎవరి కాళ్ళదగ్గిరయినా ఎందుకు పెట్టడం? అదేం వేలం వెర్రి? వేరు వేరు పాత్రల్లో గానీ, వేరు వేరు పీఠాలపై గానీ, సిం హాసనాలపై గానీ ఎలా ఎరేంజ్ చేసుకుంటే అలా పెట్టుకోవచ్చు కదా? మనుషులు రకరకాల పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా బాబామందిరాలకు వెళ్తుంటారు, అది అవసరమా? శారీరక పరిస్థితి బాగోలేనప్పుడు మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. అలాంటప్పుడు మందిరానికి వెళ్ళి ఏమి సాధిద్దామని? ఇంకేమన్నా అంటే సచ్చరితలో ఆయన అవన్నీ పట్టించుకోలేదు చావు జరిగిన ఇంటికి వెళ్ళాడు, పురుడుపోసుకున్న వాళ్ళింటికి వెళ్ళాడు... ఏ మైలలు అతను పాటించలేదు ... అని వాదిస్తారు. మనుష్యులమధ్య బ్రతికేటప్పుడు ఎవరికి కష్టమన్నా మనం పరిగెట్టడం లేదా? అలా అతనూ చేసువుంటారు. కుష్టురోగులను అతను ముట్టుకున్నాడు ఎందుకంటే అతనువైద్యుడు గనుక. డాక్టర్లు, నర్సులు ముట్టుకోవడంలేదా రోగుల్ని?
.
కొన్ని ఆత్మలకు సిద్ధత్వాలుంటాయి. దైవత్వానికి కనెక్ట్ అయి ఉంటాయి. అట్టి వారికి జీవితంలో ఏదో ఒక దశలో ఐహికపరమైన వాటినుండి ఆత్మ దూరమయి (బ్రతికి ఉన్నప్పటికీ) దైవమార్గం వైపే వాళ్ళ చిత్తం నడుస్తుంటుంది. శరీరంపై, ప్రాపంచికపు సుఖాలపై నుండి వ్యామోహాన్ని మెల్ల మెల్లగా కోల్పోతారు. ఇది దానికది జరగాల్సిందే తప్పా ... బలవంతంగా ఆత్మ స్థాయిని పెంచేసుకోవాలంటే పెంచుకోవడం జరుగదు. అలా జరగాలంటే సాధన చాలా అవసరం. దానికి గురువు సహాయం ఇంకా అవసరం. ఇన్ని మెట్లు దాటితే అప్పుడు ఆ ఆత్మకు, ఆ స్థితి వస్తుంది (సాధన ద్వారా). అంతేగాని ఎలా బడితే అలా మందిరాలకు పోయి, బాబా విగ్రహాలను ముట్టేసుకొని ... మేము శరీరాలమీద వ్యామోహం వదిలేసుకున్నాం, అందుచేత మా ఆత్మలు బాబాలో కలిసిపోయినట్లే అందుకే ఎలా ఉన్నా ఈ చర్యలకు పాల్పడతాం ... ఇవన్నీ బాబాకు తప్పుకాదు అని పనులు చేస్తూ... మరికొంతమందికి అదే నేర్పి, వాళ్ళనీ చెడగొట్టి ... హిందూ సాంప్రదాయాల్ని మంటగలపడం తప్పు. అదే అలవాటును దేవాలయాల్లో కూడా పాటించేస్తున్నారు.
.
ఇలా ప్రజల మూర్ఖత్వానికి బాబా మందిరాలు గురయి వాగ్వివాదాల్లో పడడం ఏం బాగోలేదు. ఆఖరికి ఆయన పుట్టుక, మతం ఏది అనే విషయాలు చర్చనీయాంశమయినాయి. ఆయన ఉన్నరోజుల్లో కులం, మతం చూసుకోకుండా అందరినీ ఆదరించారు. అదెందుకు చెయ్యరు ప్రజలు? ఆయన చెప్పినవి తప్పా అన్నీ చేస్తారు. ఆయన సచ్చరితలోని ఆయన లీలల ద్వారా సత్యాన్ని గ్రహించి నిరాడంబర రీతిలో జీవితాన్ని గడపమన్నారు. ఆ సచ్చరితలో పేర్కొన్న ఆయన లీలన్ని 9 నాణాల్లో లక్ష్మీబాయి షిండేకి ఇచ్చారు, అదే ఆమెకి ఆయన చేసిన గురోపదేశం.
.
1. సత్ సాధువుల సాంగత్యము
2. భగవంతుని కధలు వినడం
3. గురుపాదసేవ
4. నిరహంకారం
5. నిరంతర దైవ ప్రార్ధన
6. మంచి ప్రవర్తన
7. సమానభావం
8. సహనం, తద్వారా సంతృప్తి
9. శ్రద్ధ, నమ్మకం
.
ఇదే ఆయన ఉపదేశం ఎవరికయినా. ఇందులో ఏ ఒక్కటీ పూర్తిగా ఎవరూ పాటించరు, కనీసం ఒక్కదానిపైన అయినా సాధన కూడా చెయ్యరు. ఎవరు నమ్ముకున్న మార్గాన్ని వాళ్ళు ఆచరించేస్తూ సులువుగా బాబాకు ఏ పట్టింపూ లేదు, ఎలా బతికేస్తున్నా ఆయన అక్కున చేర్చేసుకుంటాడు, . అంటే ఎలా? ఎందుకలా? ఏం మనమేమయినా చుట్టాలమా ఆయనకు?
.
పైన 9 లక్షణాలను అతను సూచించారు, అవన్నీ చెయ్యగలిగితేనే తన మార్గంలో ఉన్నట్లని ఘంటా పదంగా నొక్కి చెప్పారాయన. Does this mean He was flexible? ఆయనే గనుక flexible గా ఉన్నట్లయితే మనలాగే ఎలాబడితే అలా బ్రతికేసి నాలుగు కబుర్లు చెప్పేసి వెళ్ళిపోయేవారు. ఆ 9 లక్షణాలను జాగ్రతగా తాను పాటించి అందరికీ ఆదర్శప్రాయమవ్వడం ఆషామాషీ కాదు. బాబాగారు చేసి చూపించారు. అదే ఆయన ప్రామాణికం. ఆయన చేసిన కర్మము లేదా ఆచరణ ఆయన ప్రామాణికము. ఇందులో ఎక్కడ ఉంది తానే భగవంతుడినీ అని. కాకపోతే కొన్ని భగవంతుని లీలలు కనబరచారు, అది ఆయన సిద్ధత్వము, ఆయన ఆత్మకున్న శక్తి, అది దైవత్వాన్ని కలిగిఉంది.