గౌతమి

గౌతమి

Thursday, April 5, 2018

మానవధర్మాలను విత్తనాలుగా నాటి ...



బాబా దగ్గిర ఎప్పుడూ తోడూ-నీడగా ఒక ఇటుక తన వెంబడే వుండేది. అది ఒక భక్తునియొక్క చేతిలో విరిగిపోగా బాబా గారు నొచ్చుకుంటూ అనిన మాటలివి. "ఇది నా తోడూ నీడ ఈరోజువరకు. దీనివల్లే నేను నన్ను అన్ని ఆత్మలతోనూ అనుసంధానమయివున్నాను, ఇది ఇప్పుడు ముక్కలయిపోయింది". నాటి రోజునుండి ఆయన ఏదో ఒక సంధర్భంలో తన నిష్కృమణ (ఈ లోకం నుండి) గురించి చెబుతూనే వున్నారు భక్తులకు అర్ధం కాని రీతిలో. తన సన్నాహాలను చేసుకుంటూనే వున్నారు, భక్తులకు విధులను అప్పజెప్పుతూ, అభయాలను వొసంగుతూ వున్నారు. గబ గబా తాను అనుకున్న పనులను సూచనలిస్తూ చేయించారు. బాబాగారు ఒక అనుభవం నమ్మినవారికి.
.
తన ఆత్మను ప్రతి ఆత్మలోనూ అనుసంధానం చెయ్యగలగడం దైవాంశ సంభూతం. ఒక పుణ్యమానవాత్మమకు దైవాంశాలు లభ్యమవ్వడం యోగులకు, గురువులకు మాత్రమే జరిగే వ్యవహారం. బాబాగారు బాల బ్రహ్మచారి గా సన్యాసించారు. భిక్షాటన ద్వారా జీవించడం సన్యాస ధర్మం. కానీ ఈ సన్యాసి ఏ కొండాలోకో కోనల్లోకో లేక ఏ అద్భుతమైన దేవాలయాల్లోకో పోయి తపస్సు చేసుకుంటూ మహిమలు చూపలేదు. ప్రతి ఇంటితోనూ తాను సంబంధం పెట్టుకున్నాడు, మనుష్యుల అజ్ఞానాన్ని పారద్రోలి, వారి మనస్సులను పరమాత్మ వైపుకు తన ద్వారా మళ్ళించడం తన కర్త్వ్యం గా చేసుకున్నాడు. బీదా, బిక్కిని ఆదరించాడు. వారికి భోజనం పెడుతూ వారిలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేశాడు. దానికి తానే ఒక సేవకుడయిపోయాడు. తన ఆత్మను ఎల్లప్పుడూ భగ్వన్నామ స్మరణలో ఉంచుతూ ఇంద్రియాలపై స్పష్ఠతను ఏర్పరచుకొని వాటిని అదుపులోవుంచుకున్నాడు. ఇది కేవలం బాహ్యానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా అంతర్ముఖులైన వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే పని, కష్ఠమయిన పని. అది యోగ్యులయిన యోగులకే సాధ్యం. అది దైవ సంకల్పం. ఆ దేవుడు ఇచ్చేవరం.
.
ప్రతి ఆత్మతోనూ అనుసంధానం మయి ... వాటి అవసరాలను తెలుసుకొని అవి తీరుస్తూ ప్రజలకు కనిపించాడు తద్వారా ప్రతి ఆత్మ ఏకాత్మా అని అందులో పరమాత్మ గలడని చూపించాడు, అంతే కాకుండా ప్రతి ఆత్మ (అనగా మనిషి) మరో ఆత్మను (జంతువులతో సహా) ఎలా ఎందుకు భూతదయ కలిగివుండాలో తను పాటించి అందరికీ చూపించి, మానవధర్మాలను విత్తనాలుగా నాటి, దానికి నీళ్ళుపోసి చెట్లను చేసి ఆ కొమ్మల నీడలో బ్రతకమని తన సగుణ రూపాన్ని చాలించాడు. నిర్గుణ రూపంలో వుండి ఇంకా కాసుకుంటానని మాటిచ్చాడు. ఇవన్నీ పరమాత్మ లీలలు. తన లీలలను పండించుకోవడానికి ఆయన ఎన్నో అవతారాలను సృష్టిస్తాడు, మనకు కనువిప్పు చేస్తాడు. అటువంటి అద్భుతమైన దైవ సృష్ఠి సద్గురు షిరిడీ సాయిబాబా.



Sunday, February 25, 2018

ఓ యజమాని...(కధ)

ఓ యజమానున్నాడు. వాడికో గాడిదుంది. ఆ గాడిదకి ఆడు కావాలి. గాడిద ఫ్లాష్ బ్యాక్ లో అందరి బట్టల మూటలూ మోసి, మోసి అలసిపోయింది, అలసిపోయినా ఎవరూ సరిగ్గా తిండి పెట్టేవారు కాదు, చాకలిరేవుదగ్గిర ఎదైనా దొరికితే తిన్నదీ,లేకుంటే యజమానులు పారేసే గంజినీళ్ళు తప్పా. ఆ గాడిద తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. కట్టెలెకొట్టేవాడిని కలిసింది, వాడు కట్టెలమోపు దీని పై పెట్టి ఇంటికి మొయ్యమన్నాడు. మోసింది. వాడికిది సుఖమనిపించింది. సరే ఈ గాడిదని నేను ఉంచేసుకుంటే కట్టెలుమొయ్యడానికి పనికొస్తుందీ అని ఉంచేసుకున్నడు. గాడిదకి సంతోషమే. టైం కి వున్నచోటకే తిండీ, ఎక్కడా పనిచెయ్యక్కర్లా, అప్పుడప్పుడే కదా కట్టెలు మోసేదీ అని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఇంటిపట్టునే వుండడంవల్ల గాడిదకు చిన్న చిన్న పనులు చెప్పేవాడు, అవి చేసేసి, తినేసి కూర్చొనేది.
.
ఇంతలో యజమానికి ఒక లాటరీ టికెట్టు తగిలింది. ధనికుడయ్యాడు, గాడిద వడ్డాణం చేయిస్తాడేమో అని అడిగింది. డబ్బుల్లేవు అన్నాడు. చినబుచ్చుకున్నది. ఇంతలో డబ్బులుపెట్టి ఒక పంచ కళ్యాణిని ఇంటికి తెచ్చాడు. పంచకళ్యాణి అందంగా, మిల మిలా మెరిసిపోతోంది. దానికొచ్చే పని రేసుల్లో గెలవడం. ఆ పంచకళ్యాణి ద్వారా తాను ఇంకా ధనికుడవాలని యజమానిగారి ఆశ. తన పెంపుడు గాడిదకున్న ఆశాపాశాలు యజమానిగారికీ ఉన్నవి.
.
పంచకళ్యాణికి పెట్టే పెట్టుబడి, ఫుడ్డు, చూసే విధానము, దానికోసమని ప్రత్యేకంగా కట్టించిన శాల అబ్బో ... అంతా ఒక రేంజు. గాడిదకు బాధేసింది. యజమానిని అడిగింది. నాకూ అలాగే ఎందుకు చూడవు? పైగా దానితో నన్ను సమానంగా చూడాలి కదా? ... అని అన్నది. అన్నగారు ఎప్పుడూ కలల్లో నోట్లకట్టల్లోనే విహరించడం వల్ల..."పంచ కళ్యాణి తీసుకొచ్చేడబ్బు నాకు పంచప్రాణాలు, నీవల్లేమొస్తుందీ నాకు బూడిద" అన్నాడు. దానితో కోపమొచ్చేసింది గాడిదకు. అలిగింది. పంచకళ్యాణంటే కోపం, అసూయను పెంచుకున్నది. యజమానంటాడు "అది తీసుక్కొచ్చే డబ్బుతో మనిద్దరం హాయిగావుంటున్నాము కదా, ఇప్పడయితే నువ్వు ఆ కట్టెల్ని కూడా మొయ్యడం లేదు. ఏంటి బాధ???"
"అయితే మాత్రం నాకు గుర్తింపురావడం లేదు. అందరూ పంచకళ్యాణినే ఆదరిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, పేపర్లలో వేస్తున్నారు, నువ్వు కూడా దాన్ని బాగా చూస్తున్నావు. ఇప్పటినుండీ, నాకు పెట్టే తిండి దానికి పెట్టు. అవసరం లేకపోయినా కట్తెలు మోయించు, ఆ రేసులకు నేను వెళ్తాను, డబ్బు సంపాదిస్తాను, వడ్డాణం చేయించుకుంటాను".
.
"అలా కుదరదు, అది తిన్నే గుగ్గిళ్ళు నువ్వు తిని అరిగించుకోలేవు, నువ్వు తాగే కుడితి అది తాగదు. నీ జాతి వేరు". అయినా సరే గాడిద ఒప్పుకోదు. రేసులకు బయలుదేరింది గాడిద. కట్టెలు మోపు పైన పెట్టుకొని పంచకళ్యాణి హాయిగా డెక్కలు శబ్ధంచేసుకుంటూ ఒక వెకేషన్ లా అడవంతా తిరుగుతోంది. యజమాని గాడిదను రేసుల్లోకి దింపాడు. అందారూ దిగ్బ్రాంతికి లోనయ్యారు, కొంతమంది ఆ దృశ్యం చూసి, ముఖం తిరిగి అక్కడికక్కడే పడిపోయారు. మీడియా రిపోర్టర్లు వచ్చేశారు. గాడిదకు ఫొటోలు తియ్యడం, దాన్ని చూపిస్తూ రిపోర్టర్లు హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళం భాషల్లో ఊదరగొట్టేస్తున్నారు, టి.ఆర్.పి. లను పెంచుకుంటున్నారు. గాడిదకు ఆ భాషలు అర్ధం కాలేదు, ఏం చెప్తున్నారో తెలియలేదు. అంతా మెచ్చుకుంటున్నారనే అనుకున్నది, ఎందుకంటే పంచకళ్యాణి రేసులో గెలిచినాక ఇలాగే దానిగురించి టీ.వీ.ల్లో వచ్చేది. తనకూ అలానే జరుగుతున్నదని భావించి నిలబడీ, కూర్చొనీ మరిన్ని ఫొజులు ఇచ్చింది. కానీ వాళ్ళు గాడిదను తీసికొచ్చిన తన యజమాని గురించి తీవ్రం గా స్పందిస్తున్నారనీ, పంచకళ్యాణిని మాయం చేసినందుకు యానిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు, వన్యమృగ సం రక్షకులు, కోట్ల రూపాయల రేసుల్లో పాల్గొనే గుర్రపు జాతి అతి విశిష్ఠతమైనదనీ, వాటిమాయం వెనుక రాజకీయ, తీవ్రవాద, విదేశీ కుట్ర
వుందనీ... వాటన్నిటికీ తన యజమాని ఒక ఏజెంటనీ అక్కడికక్కడే తీర్మానించింది మీడియా.
.
దానికి బెంబేలయిపోయి పోలీస్, అటవీ మొదలైన శాఖలన్నీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. ఏనాడూ ఇలాంటి ఆలోచనే రాని తీవ్రవాదుల్లో కలకలం రేగి, ఇదేదో రాజకీయ కుట్ర..వెంటనే ఈ గాడిద గాడి ఏజెంటెవరో మనముందు హాజరు కావలె అని గన్స్ లోడ్ చేశారు. వీడియోలు రిలీజ్ చెయ్యడం మొరలెట్టారు, దానితో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ బ్యూరో అంతా అప్రమత్తమయ్యింది. శెలవుల మీదవున్న ఆఫీస్ర్లందరినీ డ్యూటీలో జాయినవ్వమని orders ను పంపారు. గాడిదలో ఏ బాంబో కూడా పెట్టి వుంటారని అనుమానించి గాడిదను అదుపులోకి తీసుకున్నారు. దాన్ని స్కాన్ చేసి, ఏది తేలినా, తేలక్పోయినా గాడిదను చంపేయమన్నారు. అప్పుడర్ధమయ్యింది గాడిదకు! తీవ్రవాదపు బెదిరింపులను అదుపులోకి తేవడానికి, ప్రజల్లోని భయభ్రాంతులను తొలగించడానికి మీడియావాళ్ళ టీ.ఆర్.పీ. రేట్లను అదుపులోకి తేవడానికి శాంతిభద్రతలకోసం విచారణకూడా పెద్దగా జరపకుండా ఏజెంట్ (గాడిద ఓనర్) పై షూట్  ఎట్  సైట్ ఆర్డర్స్ ని ఝారీ చేసింది.
.
నీతి: తనకు గాడిద ఎంత ముఖ్యమైనా గాడిద అడిగేవన్నీ చెయ్యరాదు.

Sunday, February 18, 2018

"ఎందుకిలా చేస్తున్నావ్?" - నా కవిత

పంచభూతాల అనురాగ సం'యోగం'తో ప్రకృతి ఎంత రమణీయంగా వుంటుంది? రాగధ్వేషాలకు అతీతమైనది. నిజానికి ఏ ప్రేమకూ అంతుచిక్కనిది. నిర్వికార, నిరహంకార, నిర్గుణం. అందుకే అందం. ఈ అందం జనన మరణాలకు అతీతం, నిశ్చలం. మహా పర్వతాలయినా, మహా సముద్రాలయినా కాల గర్భంలో కలిసిపోతాయి కానీ వాటి తేజస్సుని విడిచి. మహా జలపాతాలయినా కాలంతో పాటు అంతరిస్తాయి కాని వాటి సెలయేళ్ళకు దారులు వేసి. ఎంత మహా ఎడారులయినా ఒయాసిస్సులను సృష్టిస్తాయి మనిషి మనుగడకేసి. ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నాయి ఇవన్నీ? 
.
ఈ అనంతమైన ప్రకృతి తన మనుగడను సాధించుకోవడమే తనను తానుగా మళ్ళీ మళ్ళీ సృష్ఠించుకోవడం. పునర్జన్మనిచ్చుకోవడం. ప్రకృతికి రాగధ్వేషాలు లేవు, కాబట్టి నిర్వికారం, సమానవ్యాప్తి పట్టణాలకయినా, అడవులకయినా కాబట్టి నిరహంకారం, దేనికీ లొంగదు, నిర్గుణం. అయినా దీనికీ పునర్జన్ముంది. ఇట్టి పంచభూతాలకు మానవ శరీరకుహరమూ ఆలవాలమే. మరి అంతటి రమణీయత మనిషిలోనూ వుండాల్సిందే కదా? వుంటే ఏ రూపంలో వుండాలి? మరి మనిషి ప్రకృతిలా నిర్వికార, నిరహంకార, నిర్గుణుడు కాడు కదా? వెలుగుతున్న సూర్యుడ్ని అమాంతం కబళించే చీకటిని పారద్రోలే చంద్రుని కాంతిలా, మనిషిలోని అంధకారాన్ని చీల్చుకొంటూ నడక ప్రయాణం ఆగకుండా ఎక్కడో దూరాన వున్న దివిటీని వెలిగిస్తే వచ్చే కాంతి రూపంలో వుంటుంది. ఆ కాంతి పేరే "ప్రేమ". వీడికి ఈ పేరు అర్ధమవుతుంది, కానీ దాన్ని చేరడానికే వీడికి దారి తెలియదు.
.



Saturday, February 10, 2018

శివతత్వం-ప్రేమమయం


శివరాత్రి ఉపవాస, జాగరణా దీక్షాపరులకు-12 తేదీన న రాత్రి 10 తర్వాత త్రయోదశి విచ్చేసి, 13 న రాత్రి 12 వరకు. ఆపై చతుర్దశి-14 వ తేదీ అంతా వుండును రాత్రి 2.16 వరకు- దీక్ష విరమించుటకు. 
.
కొంతమంది చతుర్దశి దాటకుండా దీక్ష విరమించాలంటారు, మరి కొంతమంది చతుర్ధశి కూడా పూర్తయ్యాకే దీక్ష విరమించాలంటారు. ఎవరికి నచ్చిన విధంగా వారు 13.14 తేదీలు లేదా 13 వ తేదీ చేసుకొని తరించండి. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొనండి.
.
అది అక్కడికి కట్ చేస్తే... ఆనాటి (కాలేజ్ డేస్) నా జాగరణ రహస్యం- ప్రత్యేకంగా జాగరణకు మన సమరసింహం బాలకృష్ణ సినిమాలను ఎంచుకొనేవాళ్ళము. ఎందుకంటే ఆయన డాన్సులు, డైలాగులు బ్రెయిన్ సిగ్నల్స్ ని బ్లాక్ చేసి కంటిరెప్పల్ని ఆపేసి కంటిచూపుని నిలబెట్టేవి. దానితో జాగరణ అత్యద్భుతంగా పూర్తయ్యేది. ఈ సంవత్సరం ఏం చేస్తానో చూడాలి.
.
సరే ... దాన్నక్కడికి కట్ చేస్తే- శివుని ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదు. ఆ సదాశివుని కృపవుండడంవల్ల మాత్రమే నేను వ్రాయగలిగిన ఒక ఆర్టికల్ "శివతత్వం-ప్రేమమయం" _2018 శివరాత్రి సంధర్భంగా-
.
తప్పక చదువగలరు. తప్పులుంటే మన్నించగలరు. మీ అందరకూ శివరాత్రి శుభాకాంక్షలు.






Wednesday, February 7, 2018

నా కవిత మాలిక అంతర్జాల పత్రికలో- ||ప్రేమికులరోజు||


ఫిబ్రవరి సంచిక_2018


                               

 February 14, Valentine's day special
                             

Friday, January 5, 2018

సంకష్ఠహర చతుర్ధి


సంకష్ఠహర చతుర్ధి అంటే సంక్లిష్ఠాలను హరించే చతుర్ధి అని అర్ధం. విఘ్నాలను, సంక్లిష్ఠాలను తొలగించే దైవం శ్రీ మహాగణపతి. చతుర్థి అనగా నాలగవరోజు ఆ మహాగణపతి రోజు. ఇది హిందువులకు ఎంతో ముఖ్యమైన రోజు. ఇది ప్రతినెలా జరుపుకొనే గణపతిపూజ. జనవరి 2018 లో శుక్రవారం 5వ తేదీన వచ్చ్నది, మరలా ఫిబ్రవరి 3వ తేదీన ఈ పూజ జరుపుకొనవచ్చు. అలా ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధి సంకస్ఠహర చతుర్ధి. తమిళనాడులో దీనిని సంకటహర చతుర్ధి అంటారు. ఇటువంటి చతుర్ధి మంగళవారనాడు పడినప్పుడు అంగారకి చతుర్ధి అంటారు. ఈ చతుర్ధి ని భారతదేశంలో నలుమూలలా చేసుకుంటారు, ముఖ్యంగా మహారాష్ట్రలో ఘనంగా జరుపుకుంటారు.
.
పూజావిధానం:
***********
చతుర్ధిరోజున రోజంతా ఉపవాసముండాలి. ప్రొద్దున్నే లేచి లార్డ్ గణేశాకు నిత్యపూజ గావించుకోవాలి. ఉపవాసముండాలి, సాయంత్రం నైవేద్యాలతో, స్తోత్రపఠనాలతో పోఅజపూర్తి చేసుకోవాలి. సాయంత్రం చంద్రుని చూసి, ఆయనకు కూడా పూజా నైవేద్యాలు సమర్పించి, ఆ తర్వాత గణపతిని ధూప, దీప, నైవేద్యాలతో, అష్ఠోత్తర, సంకష్ఠహరస్థోత్రాలతో స్తుతించాలి. కొంతమంది పూర్తి ఉపవాసము కాకుండా ఒక్కపూట ఉపవశిస్తారు, శాఖాహారం మాత్రమే భుజిస్తారు. అది కూడా గణేష  పూజ అయిపోయాక మాత్రమే ఆహారం తీసుకోవాలి. గణపతి మోదకప్రియుడు గనుక తప్పకుండా మోదకాలను సమర్పించాలి. ఆపై ఆయనకిష్ఠమైన పళ్ళు, కాయలను సమర్పించుకోవచ్చు. పూజలో దూర్వాన్ని వాడాలి.
.
ఈ పూజయొక్క విశిష్ఠత ఏమనగా- శివుడు ఈరోజునే గణపతిని గణాధిపతిని చేశారు. గణపతికి మరోపేరు సంకష్ఠి. ఈపూజ చేసుకొన్నవారికి స్వేచ్చ, ఆరోగ్యం, సంపద, అదృష్ఠం కలుగును. ఈ పూజను శ్రీకృష్ణుడు యుధిష్టరునికి కూడా సూచించెను. దీని గురించి సంపూర్ణంగా భవిష్యపురాణం, నరసింహ పురాణాల్లో కూడా వ్రాయబడివున్నది.
.
క్రింది గణపతులు అమెరికాలో హూస్టన్ నగరంలో విలసిల్లుతున్న మీనాక్షీ టెంపుల్ లోని మహాగణపతి హోమశాల లోని విగ్రహ చిత్రాలు.