గౌతమి

గౌతమి

Thursday, April 5, 2018

మానవధర్మాలను విత్తనాలుగా నాటి ...



బాబా దగ్గిర ఎప్పుడూ తోడూ-నీడగా ఒక ఇటుక తన వెంబడే వుండేది. అది ఒక భక్తునియొక్క చేతిలో విరిగిపోగా బాబా గారు నొచ్చుకుంటూ అనిన మాటలివి. "ఇది నా తోడూ నీడ ఈరోజువరకు. దీనివల్లే నేను నన్ను అన్ని ఆత్మలతోనూ అనుసంధానమయివున్నాను, ఇది ఇప్పుడు ముక్కలయిపోయింది". నాటి రోజునుండి ఆయన ఏదో ఒక సంధర్భంలో తన నిష్కృమణ (ఈ లోకం నుండి) గురించి చెబుతూనే వున్నారు భక్తులకు అర్ధం కాని రీతిలో. తన సన్నాహాలను చేసుకుంటూనే వున్నారు, భక్తులకు విధులను అప్పజెప్పుతూ, అభయాలను వొసంగుతూ వున్నారు. గబ గబా తాను అనుకున్న పనులను సూచనలిస్తూ చేయించారు. బాబాగారు ఒక అనుభవం నమ్మినవారికి.
.
తన ఆత్మను ప్రతి ఆత్మలోనూ అనుసంధానం చెయ్యగలగడం దైవాంశ సంభూతం. ఒక పుణ్యమానవాత్మమకు దైవాంశాలు లభ్యమవ్వడం యోగులకు, గురువులకు మాత్రమే జరిగే వ్యవహారం. బాబాగారు బాల బ్రహ్మచారి గా సన్యాసించారు. భిక్షాటన ద్వారా జీవించడం సన్యాస ధర్మం. కానీ ఈ సన్యాసి ఏ కొండాలోకో కోనల్లోకో లేక ఏ అద్భుతమైన దేవాలయాల్లోకో పోయి తపస్సు చేసుకుంటూ మహిమలు చూపలేదు. ప్రతి ఇంటితోనూ తాను సంబంధం పెట్టుకున్నాడు, మనుష్యుల అజ్ఞానాన్ని పారద్రోలి, వారి మనస్సులను పరమాత్మ వైపుకు తన ద్వారా మళ్ళించడం తన కర్త్వ్యం గా చేసుకున్నాడు. బీదా, బిక్కిని ఆదరించాడు. వారికి భోజనం పెడుతూ వారిలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేశాడు. దానికి తానే ఒక సేవకుడయిపోయాడు. తన ఆత్మను ఎల్లప్పుడూ భగ్వన్నామ స్మరణలో ఉంచుతూ ఇంద్రియాలపై స్పష్ఠతను ఏర్పరచుకొని వాటిని అదుపులోవుంచుకున్నాడు. ఇది కేవలం బాహ్యానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా అంతర్ముఖులైన వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే పని, కష్ఠమయిన పని. అది యోగ్యులయిన యోగులకే సాధ్యం. అది దైవ సంకల్పం. ఆ దేవుడు ఇచ్చేవరం.
.
ప్రతి ఆత్మతోనూ అనుసంధానం మయి ... వాటి అవసరాలను తెలుసుకొని అవి తీరుస్తూ ప్రజలకు కనిపించాడు తద్వారా ప్రతి ఆత్మ ఏకాత్మా అని అందులో పరమాత్మ గలడని చూపించాడు, అంతే కాకుండా ప్రతి ఆత్మ (అనగా మనిషి) మరో ఆత్మను (జంతువులతో సహా) ఎలా ఎందుకు భూతదయ కలిగివుండాలో తను పాటించి అందరికీ చూపించి, మానవధర్మాలను విత్తనాలుగా నాటి, దానికి నీళ్ళుపోసి చెట్లను చేసి ఆ కొమ్మల నీడలో బ్రతకమని తన సగుణ రూపాన్ని చాలించాడు. నిర్గుణ రూపంలో వుండి ఇంకా కాసుకుంటానని మాటిచ్చాడు. ఇవన్నీ పరమాత్మ లీలలు. తన లీలలను పండించుకోవడానికి ఆయన ఎన్నో అవతారాలను సృష్టిస్తాడు, మనకు కనువిప్పు చేస్తాడు. అటువంటి అద్భుతమైన దైవ సృష్ఠి సద్గురు షిరిడీ సాయిబాబా.