గౌతమి

గౌతమి

Thursday, November 12, 2015

షిరిడీ నివాసి సాయిబాబా ఎందుకు అవసరం మనకు?


మనకన్నా మనం ఆయనకే అవసరం. ఎందుకంటే నారుపోశాక నీరు పోయాలి కదా! బీజదశలో వున్నప్పుడు అదిమొలకెత్తడానికి అనువైన పరిస్థితులు చాలినంత ఉష్ణోగ్రత, కావలసినంత నీరు, పెరుగుదలకు అవసరమైన భూమినుండి ఖనిజలవణాలు కావాలి. ఇవన్నీ దేవుడు సృష్టించిన ప్రకృతిలోనే ఎలాగూ లభ్యమవుతుంది. అయినా ఆ బీజం ఏ వాతావరణ వైపరీత్యానికో లోనయి అనుకున్న టైం కి మొలకెత్తలేకపోవచ్చు. మొలకెత్తినా మొక్క దశనుండి వృక్షదశలోకి అడిగుపెట్టేలోపుల మనుష్యులవల్లో, జంతువుల వల్లో అపాయానికి గురయ్యి ఏదో ఒక దశలో అదిరాలిపోవచ్చు. మరి దేవుని సృష్టిలో బీజం మొలకెత్తడానికి కావలసినవన్నీ ఉచితంగా దొరికినప్పుడు, అదే సృష్టిలో అది పెరిగి పెద్దవ్వడానికి అవాంతరాలు కూడా ఎందుకు వున్నాయి? ఇదే ప్రకృతిధర్మమా?
.
ఇదే ప్రకృతి ధర్మమయితే, ఇదే ధర్మం మానవజీవితాల్లో కూడా ఇలాగే ప్రస్పుటమవుతుంది. మనిషికి చిన్నతనం లో తానెటువంటి దశలో పెరుగుతున్నాడు, పెరిగాక ఏ దిశలో ప్రయాణించబోతున్నాడు, ఆ దిశ తాను కోరుకుంటున్నాడా లేక ఎవరైనా తనకి నిర్ణయిస్తున్నాడా? అది నచ్చని పక్షం లో అది మార్చుకోగలిగే శక్తి, యుక్తి తనకున్నాయా? ఉన్నా వాటిని ఉపయోగించుకొనే పరిస్థితిలో తాను ఉంటాడా? ఇలా ప్రశ్నలు వేసుకుంటే ఎన్నో!!!
.
ప్రశ్నలు వేసుకున్నా మానవునికి అన్నీ తెలియని సమాధానాలే. అయినా మానవుడు దేనికీ భయపడకుండా, భయపడినా వేరే మార్గం లేకుండా ముందుకు వెళ్తూనే వుంటాడు. ఎక్కడా ఆగడు, అతనికోసం కాలం కూడా ఆగదు. మరి ఈ దిశని చూపించేదెవరు?
.
కొన్ని సమయాల్లో మానుషరూపేణా, కొన్ని సమయాల్లో తానే స్వయం గా వచ్చి దగ్గిరుండి నిర్ణయించే బాబాగారే. ఆయన స్వయం గా వచ్చినా, వేరే ఎవరినైనా పంపినా అది ఆ వ్యక్తికి అర్ధమయ్యేలాగే చేస్తారు. అందుకే “బాబా గారు ఒక అనుభవం”. ఆయనకు మనుష్యులయినా, జంతువులయినా, మొక్కలయినా ఒక్కటే. సమదృష్టి, సమానమైన భాధ్యత కలిగివుంటారు. ప్రకృతిధర్మాలకి లొంగవలసిన ఆవశ్యకత, అవష్థ ఆ ప్రకృతిలోని ప్రతి రేణువుకీ వుంది. జీవిత సమరంలోని వైవిధ్యాలన్నిటికీ లోనయి పోరాడి నిలవాల్సిన అవసరం మనిషికి వున్నా, లేకపోయినా నిలపాల్సిన అవసరం దేవునికివుంది, లేకపోతే సృష్టే లేదు. దాన్ని నడపడం కోసమే ఆయనకి మనం అవసరం. ఆయన అవసరాలకి కట్టుబడివుండాల్సిన అవసరం మనది. ఇలా మానవునిమీద దేవుడు, దేవుని మీద మానవుడు అధారపడి వుండాల్సిందే. కాబట్టి పాలమునిగినా, నీటమునిగినా అంతా నీదే భారం అని ఆయన మీద వదిలేయ్యడమే సమంజసం. అటువంటి మన:స్థితితో వున్న ఏ భక్తునికైనా తానే పరిగెత్తుకొని వచ్చి చెయ్యందించడం బాబాగారి ఆనవాయితి అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.


సాయిసచ్చరితము 25 వ అధ్య యనం లో చెప్పినట్లు తాను ధామూ కు ఎప్పటికప్పుడు వెన్నంటి వుండి తాను వ్యాపారంలో నష్టపోకుండా సలహాలిచ్చి కాపాడాడు. సంతానలేమితో బాధపడుచున్న ధామూ కు, తన దైవశక్తితో సంతానవంతుడిని చేశారు, హేమం త్ పంత్ నకు ప్రేరణ కలిగించి తన లీలల్ని పుస్తకరూపంలో వ్రాయించి భావితరాలకోసం పొందుపరిచేరు, తాను తనువు చాలించినా కూడా ఆత్మరూపంలో వుండి పలుకుతానని మాటయిచ్చారు, అలాగే ఎంతోమందికి లీలలు చూపిస్తూనే వున్నారు. ధు:ఖాలనుండి, అపాయాలనుండి రక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రారబ్దాలనుండివ్వెలికితీసుకొచ్చి ఒక మంచి ముగింపును కూడా ప్రసాదిస్తున్నారు. ఇవన్నీ మనకన్నా ఆయనకే అవసరం, ఎందుకంటే నారు పోశాక నీరుపొయ్యాలి, కంచె కట్టాలి, కాపాడాలి.. దాన్ని వృక్షాన్ని చెయ్యాలి. అలాగే మానవునికి కూడా కంచె కట్టాలి, ఉపద్రవాలనుండి కాపాడాలి, అతనిని స్థిరపరచాలి. దీనంతటికీ మానవుడు ఆయనకు సహకరించాలి. ఆయన చేసే సహాయాన్ని తీసుకొనగలిగే పరిస్థితిలో మానవుడు తన ఇంద్రియాలని, ఆత్మను శుద్దమయిన రీతిలో వుంచుకొని బాబాగారికి అంకితం చెయ్యాలి. అంతేగాని ఏమాత్రం కూడా బాబాగారి దారిలోకి వెళ్ళకుండా నాకేమి చెయ్యలేదని తిరిగి ఆయన్నే నిందించడం గాలిలో దీపం పెట్టడం లాంటిదే. చేతులారా జీవితాన్ని పెనుతుఫానులు చేసుకొని, అందులో కొట్టుకుపోతున్నప్పుడయినా ఆయన లేడు అని మూర్ఖం గా ఆలోచించకుండా దారి లో ఎక్కడోదగ్గిర కలుస్తారని భారం వేస్తే తప్పకుండా వచ్చే తీరుతారు, యనకది తప్పని పరిస్థితి!!


Saturday, August 22, 2015

కర్మ ఎవరిది????


ప్రతి మనిషి లో మంచి, చెడు వుంటుందంటారు. అంటే ఆ చెడు ఎటువంటి చెడు అయి వుండాలి? లోక కళ్యాణార్ధమయినదా? లోక కంఠకమైనదా?
.
అవసరాన్ని బట్టి మంచివాళ్ళే చెడ్డవాళ్ళుగా మారతారని చెప్తారు. అది ఎటువంటి చెడ్డతనమై వుండాలి? అది ధర్మ సంస్థాపనార్ధమై వుండాలా? లేక అధర్మ సంస్థాపన జరిగినప్పటికీ అది ఆపద్ధర్మం గానే భావించేసి, చెడు కి చెయ్యెత్తి జై కొట్టేయాలా?
.
కొంతమంది చెడు లో మంచిని వెతకాలంటారు. అది చెడు లేదా ఆ మనిషి చెడ్డ మనిషి అని ముందుగానే నిర్ణయం జరిగినప్పుడు, అందులో/వాళ్ళలో మంచి ఎలా కనబడుతుంది? అది కేవలం వాళ్ళలో దేన్నో ఆశిస్తూ చుట్టూ తిరిగే స్వార్ధ చింతన కాదూ??? ఆ స్వార్ధాన్ని, ఆ చెడు కూడా గుర్తించేసి కిసుక్కున నవ్వదు? ఆ చెడు, ఈ స్వార్ధాన్ని కాలి కింద చెప్పుచేసేసుకొని కోటలు కట్టుకొని బ్రతికెయ్యదు?????
.
స్వార్ధం తో అధర్మాన్ని పెట్టి పోషిస్తే చివరికి ఆ అధర్మమే భక్షిస్తుంది. 
.
లోకకళ్యాణర్ధమయినది నిస్వార్ధం, లోక కంఠకమైనదాంట్లో స్వార్ధ చింతన దాగివుంటుంది. స్వార్ధ చింతనతో రగిలిపోతూ వుండేవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళమనుకొని వీళ్ళకి పాలు పోసి పెంచే తెలివైన పామరులు... తప్పక లోక కంఠకానికే దారి తీస్తారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వల్ల, వాళ్ళు పాలు పోసి పెంచే దుష్టపాముల వల్ల చెడు ని విస్తరిస్తారు. 
.
మరి ఒక మంచి వాడి వల్ల అనుకోకుండా చెడు జరిగి, అవసరాన్ని బట్టి ఒక మంచివాడు చెడ్డవాడిగా మారి వాడూ చెడు చేసి, చెడులో మంచిని వెతుకుతున్నానని చెప్పి మసి పూసి మారేడు కాయ చేసే స్వార్ధపరుడి వల్లా చెడు జరిగి... మరి ఈ మూడు రకాల చెడు పోషకుల పోషణలో పెరిగి వట వృక్షాలయిపోయిన అసలు సిసలైన నిఖార్సయిన చెడ్డవాళ్ళు (పుట్టుకతో) రాజ్యాలేలుతుంటే మరి మంచికి తలదాచుకోవడానికైనా చోటు దొరుకుతుందా???
.
మంచిని రక్షించేదెలా? ఎవరైనా వున్నారా? లేక అధర్మానికి తనకు తానుగా స్వభక్షణ జరిగినప్పుడే మంచి రక్షించ బడినట్లు అని అనుకోవాలా?? 
.
ఎంత విచిత్రం? దీన్నే కర్మ అంటారా? ఎవరికర్మ? పాపి చేత బాధింప బడే మంచిదా? పాపిగా పుట్టి పాపిగానే బ్రతికి చివరివరకూ కనీసం మారడానికి కూడా ప్రయత్నించకుండా ఒకవేళ మారాలన్నా ఏ స్వార్ధపు హస్తాలలోనే బంధీ అయిపోయి అలాగే బ్రతికే పాపిదా?
.
కర్మ ముగ్గురిది. 
.

* స్వార్ధ చింతనతో పాపి పంచన చేరిన స్వార్ధిది.
.
*చివరి వరకూ పాపి గానే ముగిసిపోయే పాపిది.
.
*మంచిని బాధిస్తూ, వేధిస్తూ పాపం మూటగట్టుకొనే పాపిది.

.
కాని, పాపి చేత బాధింపబడే మంచిది మాత్రం కర్మ కాదు. ఎందుకంటే మంచి పుట్టిందే పాపుల కర్మలు కాల్పించడానికి !!!
.
ముక్కుపచ్చలారని రామలక్ష్మణుల్ని యజ్ఞయాగాలను ఆపుతూ, ఎప్పుడూ దైవ ధ్యానం లో వుండే మునులను పట్టి పీడించే రాక్షస, భూత, ప్రేత, పిశాచాల్ని తుదముట్టించడానికి విశ్వామిత్రుడు అడవులకు తీసుకు వెళ్తాడు. 

.

మరి, ఎప్పుడు దైవధ్యానం లో వుండే మునులకు రాక్షస, భూతాల వల్ల నీచనికృష్టమైన చావులు రావడం ఏమిటీ? మునులు అనుకొనివుండచ్చు, ఎప్పుడూ యాగాలు చేసుకొనే మాకు ఈ "కర్మ" ఏమిటీ అని!

.
రాక్షస, భూత ప్రేతాల కర్మ కాలింది కాబట్టే మునుల జోలికొచ్చేరు. పాపాల కోటా పెంచుకున్నారు. ఒక్కసారి పాపాల పంట పండ గానే... రాముడొచ్చేశాడు, లయం చేశేశాడు!! ఈ లయం కార్యం లో మంచివాళ్ళు సమిధలు కాక తప్పదు.

Sunday, August 2, 2015

My first poetry in manatelugutimes on father's day June 21st, 2015- అమ్మఅనిర్వచనీయం – నాన్నఅసాధ్యం.


http://www.manatelugutimes.com/archives/1535



అమ్మ నవమాసాలూ మోసి జీవం పోస్తే
తన ప్రాణాన్నిపంచ ప్రాణాలుగా చేసి
ఆ జీవానికి ఒక రూపు నిచ్చేది నాన్న..

జోలపాడి గోరు ముద్దలు తినిపించేది అమ్మైతే
నడక రాక ముందే తనవ్రేళ్ళని ఊతగా ఇచ్చి
పాదాలను పరుగులెత్తించే శక్తి నాన్న…

నల్లబొట్టుపెట్టి అందరి దిష్టి తీసేసి అమ్మ మురిస్తే
భుజాల పైకెత్తుకొని ప్రపంచాన్నంతా పరిచయంచేసేది నాన్న..
ఏ రాత్రికైనా నిద్రలేచి ఆటలాడుతుంటే తాను నిద్రమాని
వెంటనుండి తనప్రాణాన్నిపంచప్రాణాలు చేసి కాపాడేది నాన్న..

బడికెళ్ళక ముందు అమ్మచేతి పాఠాలు
పలకచేతబట్టి బళ్ళోకి నాన్నతోటిఉరుకులు
ఓనమాలుదిద్దించడానికే...మంచిబడికావాలని
ఊరంతాగాలించి ఆలోచించి అడుగులేయించే మార్గదర్శి నాన్న..

పనివత్తిడి ఎంతవున్నాఆపదలోవున్నానంటే
ఒక్క నిముషం ఆరామించని కంటిపాపతోకనిపెట్టుకుండేది నాన్న…
తన ఆరవ ప్రాణం ఆటపాటల్లో గెలిచి మెడలో పతకాలు వేసుకునే తరుణానికి
అలుపెరగని ఆశతో ఎదురు చూసే దేవుడిచ్చిన బంగారుపతకం నాన్న…

జీవితమనే పూలబాటను వేసి నడుమనొచ్చే ముళ్ళకు
వెరయకుండా ఎలాబ్రతకాలో చూపించే ఆదర్శమూర్తి నాన్న..
కొడుకు తనంతటివాడు కావాలనీ కూతురు తలతన్నేవాడు కాదు
తాడిని తన్నేవాడి ఇంటమెట్టాలని శ్రమించే పరిశ్రమ నాన్న..

జీవిత నౌకాయానం ఎన్ని ఈదురుగాలులకు గురవుతున్నా
అలల మధ్య చిక్కుకొనికొట్టుమిట్టాడినా దైర్యంగా ఒడ్డుజేర్చే దిక్సూచి నాన్న..
కన్నవాళ్ళకోసం తనుకన్నవాళ్ళకోసం తనని నమ్మినవాళ్ళకోసం
క్రొవ్వొత్తిలా కరుగుతూ వెలుగులుచిందే మహనీయుడు నాన్న..
అందుకే అమ్మఅనిర్వచనీయం…. నాన్నఅసాధ్యం !!!

First article in "manatelugutimes" on August 2nd 2015 _ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే !!!


http://www.manatelugutimes.com/archives/1597


స్నేహితుడు లేదా స్నేహితురాలు అంటే మానవులకు సహాయంచేసేవారు అని అర్ధం. ఈ స్నేహితులు అనే పదానికి చాలా పెద్ద విశ్లేషణలున్నాయి.
.
ఆపదలో ఆదుకునేవాళ్ళు స్నేహితులు,
మొదటినుండి జీవితంలో అంటిపెట్టుకుని వుండేవాళ్ళు స్నేహితులు,
మంచి సలహాలతో ముందుకి నడిపించేవాళ్ళు స్నేహితులు.
జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పాలు స్నేహితులు.
.
స్నేహానికి మరికొన్ని లక్షణాలున్నాయి- విశ్వాసం, నిస్వార్ధం, జ్ఞాపకం, నిరహంకారం. 
.
శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు వందయినా తక్కువే అనేది వివేకానందులవారి ఉవాచ. 
.
కష్టకాలంలోనే మిత్రులెవరో తెలుస్తుంది అనేది గాంధీగారి మంత్రం. 
.
నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను మనస్సు దాచుకోకుండా నీ ముందుంచువారే నిజమైన స్నేహితులు అని బెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రస్తావించారు.
. 
మాటలకు మాత్రమే పరిమితమయ్యే మిత్రులు మిత్రులేకారు. చెడ్డ మిత్రులకన్నా అసలు మిత్రులు లేకపోవడమే మంచిదన్నారు మార్టిన్ లూథెర్ కింగ్. 
.
అంతే కాదండోయ్ మిత్రులని బట్టి మనిషిని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు. ఈ సృష్టిలో నా అనేవారు, బంధువులేనా లేనివారుంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. స్నేహం సరియైనదైతే భావం సరియైందవుతుంది, భావం సరిగ్గావుంటే ప్రేరణ సరిగ్గా వుంటుంది, ప్రేరణ సరియైనదయితే కార్యాచరణ సరిగ్గావుంటుంది. కార్యాచరణ సరిగ్గావుంటే విజయం మనదవుతుంది - ఇది నా మాట !
.
 కొంతమంది స్త్రీ, పురుషులు స్నేహం ముసుగు లో సెక్స్ ని ప్రపోజ్ చేస్తారు, ఆ స్నేహాన్ని కలుషితం చేస్తారు. స్నేహం పేరు మీద కలిసి తిరిగేస్తుంటారు, ఏవో కొన్ని బలహీన క్షణాల్లో ఆకర్షితులవుతారు. ఇద్దరిలో ఏ ఒక్కరు ఆకర్షణకు లోనైనా మరికరికి సమస్య అయి కూర్చుంటారు. ఇటువంటి ధోరణులను మార్చుకోవాలి. ఎదుటివారి మనసెరిగి సున్నితం గా ప్రవర్తించగలిగితే ఎదుటివారికి మంచిది, సదరు వ్యక్తులకు మంచిది అంతకన్నా ముఖ్యం గా అప్పటివరకూ సాగిన మంచి స్నేహం కొనసాగుతుంది.  కొంతమంది స్నేహాన్ని ప్రేమ గా మార్చుకుంటారు, పెళ్ళి వరకూ వెళ్తారు అది అనుకోకుండా జరిగితే దానికున్న ప్రత్యేకత వేరు. ఒక భర్తో లేదా భార్యో మంచి స్నేహితులు కాలేకపోవచ్చు, కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భర్త లేదా మంచి భార్య అయ్యే అవకాశాలు తప్పక వున్నాయి. మనసుని అదుపులో పెట్టుకొని స్నేహం చేసే వాళ్ళ విషయం లో ఈ సంఘటనలు కూడా జరిగే అవకాశాలు తక్కువ. అదుపు తప్పి ప్రవర్తించేవాళ్ళకి సెక్స్ ఒక చానల్ వాళ్ళ స్నేహానికి. ఎదుటివారు తిరస్కరించినప్పటికీ కూడా వదలరు. ఎలాగోలా వాళ్ళ మంచితనాన్ని, మొగమాటాల్ని లొంగదీసుకొని సెక్స్ వాంచలను తీర్చుకోవడానికి ముందంజ వేస్తారు. ఇటువంటి వారి చేతిలో స్నేహం సెక్స్ వాంచలు తీర్చే ఆట వస్తువయిపోతుంది.
.
స్నేహితుల పట్ల బుర్రల్లో వచ్చే ప్రమాదకరమైన ఆలోచనలకు, ప్రణాళికలకు వెంటనే స్వస్తి చెప్పాలి. పరిగెడుతున్న కోరికలకు కళ్ళేలు వెయ్యాలి అది ఇరువురి పైనా ఆధారపడి వుంది. ఒకరు బలవంతం చేస్తున్నారుకదా అని మరొకరు లొంగనవసరం లేదు, గట్టిగా నిలబడి బుద్ది చెప్పాలి అది జరగలేని పక్షం లో అటువంటి కాలుష్యం నుండి తప్పుకోవాలి.
.
మంచి పుస్తకాలని చదవడం, మంచిని గ్రహించడం, సామాజికహితమైన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి పనులు చేస్తూ మానసికం గా మంచి అలోచనలను చేస్తూ ఆ మంచిని స్నేహం పేరుతో నలుగురికీ పంచుతూ ఆ స్నేహమనే మొక్కని పెంచుతూ నలుగురికీ నీడ నిచ్చే వృక్షాన్ని చెయ్యాలి.
.
స్నేహాన్ని మీరు రక్షిస్తే స్నేహం మిమ్మల్ని రక్షిస్తుంది !!!

నా ఆర్టికల్ "అమ్మో! స్వైన్ ఫ్లూ వాక్సిన్.."-ఆదివారం విశాలాంధ్ర ఆగష్టు 2, 2015.











Friday, July 31, 2015

గురుపౌర్ణమి విశిష్టత

ఆషాఢమాసం దక్షిణాయణ వర్షరుతువు తిధి పౌర్ణమి ని "గురు పౌర్ణమి" గా వ్యవహరిస్తారు,  ఆ రోజున అందరూ వారి వారి ఆధ్యాత్మిక గురువులను గౌరవించి పూజించడం ఒక ఆనవాయితీ. సాధారణం గా ఆధ్యాత్మిక గురువులను గౌరవించే రోజు ఈ “గురుసౌర్ణమి”.  స్కూల్ కి వెళ్ళి గురువు దగ్గిర నేర్చుకున్న విద్య మంచి, చెడుల విచక్షణని నేర్పి బ్రతుకు సాధనకు ఉపయోగపడుతుంది. కాని ఆధ్యాత్మిక గురువులు సంస్కారాన్ని, విజ్ఞతని, నేర్వబడిన విద్యా పరమార్ధాన్ని, జగతినంతా విస్తరించుకొని వున్న ఆ పరమాత్ముని లీలల ద్వారా బోధించే తత్వవేత్తలు. అందువల్ల బ్రతుకు బండిని నడిపించుకోడానికి అవసరమైన విద్యను నేర్పే గురువు ఎంత అవసరమో, విజ్ఞానాన్ని వికసింప జేయడానికి ఆధ్యాత్మిక గురువు కూడా అంతే అవసరం. ఇది కేవలం మానుస్య గణానికే కాదు, దేవ మరియు రాక్షస గణాలలో కూడా గురువు యొక్క ప్రాముఖ్యత కనిపిస్తున్నట్లు మన పురాణాలు, భాగవతాలు చెప్తున్నాయి. దీనికి ఒక ముచ్చటైన ఉదాహరణ- వినాయకుడు ప్రమధగణాధిపత్యాన్ని పొందేటప్పుడు తన తమ్ముడు కుమారస్వామి తో పోటీకి దిగుతాడు. పోటీ ప్రకారం కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి అతివేగం గా వెళ్ళి అన్ని పుణ్య నధుల్లో మునిగి వచ్చేస్తుంటాడు కాని మూషిక వాహనుడైన వినాయకుడు మాత్రం మెల్లగా నదీ స్నానాలు పూర్తి చేస్తూ, కుమార స్వామి వేగాన్ని అందుకోలేని పరిస్థితి లోవుంటాడు. అప్పుడు దారి చూపమని తల్లిదండ్రులని వేడుకొంటే తండ్రి శివుడు అధ్యాత్మిక గురువై జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు...తమలోనే అన్ని పుణ్యనదులు, బ్రహ్మాండ కోటి జీవరాశులు నిండి ఉన్నప్పుడు మరెక్కడికో ఎందుకు వెళ్ళడం? తమ చుట్టూ ప్రదక్షిణలు చేసి పోటీ గెలవమని. వినాయకుడు నివ్వెరపోయి వారి చుట్టూనే ప్రదక్షిణలు గావించడం మొదలుపెట్టాడు. కుమారస్వామి కన్నా ముందు పుణ్య నదీ స్నానాలు ఆచరించేసి వినాయకుడు గణాధిపత్యాన్ని పొందాడు. ఇలా పురాణాలు తిరగేస్తూబోతే ఎన్నో కధలు కనబడతాయి అధ్యాత్మిక గురువు అంటే ఏమిటో తెలుసుకోవడానికి.



ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అనీ అలాగే వేదవ్యాసుని పుట్టిన రోజు గా కూడా పరిగణిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం వరాహ పురాణం లో చెప్పినట్లు గా విష్ణే “వ్యాసుడు” రూపం లో ప్రతి యుగం లో అవతరించి ధర్మ సూత్రాలను వెల్లడిస్తూ ధర్మం అదుపుతప్పకుండా నడిపిస్తూ వుంటాడు. అలాగే ద్వాపరం లో సాక్షాత్తు ఆ విష్ణే శ్రీ కృష్ణ అవతారం లో గీతా ధర్మాల్ని బోధించాడు. ద్వాపరాంతానికే ధర్మం కుంటడం మొదలుపెట్టింది. రాబోయే కలియుగం లో మరింత ధర్మ, జ్ఞాన, ఆచార భ్రష్టత్వాలకు లోనై ప్రజలు బ్రతుకుతారని గీతా ధర్మాలతో కృష్ణుడు, అలాగే వేద వ్యాసుడు కూడా జ్ఞాన బోధకుపక్రమించాడు. అందుకే వేదవ్యాసుడు ఆది గురువయ్యాడు. వేద వ్యాసుణ్ణి కూడా విష్ణవతారం గానే భావిస్తారు. వేద వ్యాసుడు మహా భారతాన్ని రచించిందే కాకుండా, అందులో తన పాత్రని కూడా చూపించుకుంటాడు. మహాభారతం  క్రీ.పూ. 3139 లో జరిగినది. దీనిని బట్టి వేద వ్యాసుడు ఈ కాలానికి చెందిన వాడని తెలుస్తున్నది.  కాని అంతకు మునుపెన్నడో వేదాలనేవి పుట్టినప్పుడు ఈయన ఏ విధం గా వేద వ్యాసుడయ్యాడు అనే ప్రశ్న రాక మానదు.

మహాభారత కాలానికి ముందునుండీ సరస్వతీ నది అనే మహా నది ఉత్తర భారతమంతా ప్రవహించేదట. ఆ నదీ సమీపాన ఎంతో మంది ఋషులు నివాసముంటూ వారు సముపార్జించిన విజ్ఞానాన్ని, సాధనలతో తెలుసుకున్న విశ్వ విజ్ఞాన్నీ, దైవరహస్యాలను శిష్యులకు పంచుతుండేవారు. మహాభారత సమయానికి కరువుకాటకాలొచ్చి సరస్వతీ నది 14 సంవత్సరాల పాటు ఎండిపోయినదిట. దానితో అక్కడినుండి నివాసాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందించిన  అపార విజ్ఞానము అక్కడితోనే మాయమవుతూ వచ్చింది. ఆ సమయం లో 14 ఏళ్ళ తర్వాత వేద వ్వాసుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ మహా ఋషులు చెప్పి అక్కడే వదిలేసిన దైవ రహస్యాల్ని, జగత్తులో విస్తరించివున్నప్రాకృతిక రహస్యాల్ని,  దేవుని ఉనికిని తెలియపరిచే తత్వ బోధనలని పరిశోధించి, వాటిని సేకరించి ఆ సమాచారాన్ని వేదాల రూపం లో విభజించి జాబితా చేశాడు. ఆ వేదాలే ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణవేదాలు. సేకరించాక వీటి విభజన చేసిన రోజే ఈ గురు పౌర్ణమి రోజు అని కూడా చెప్పుకుంటారు. అందుకే ఈయనకు వేద వ్యాసుడని పేరు. నిజానికి అది అతని బిరుదు. ఈతని అసలు పేరు కృష్ణదైపాయనుడు.




ఈ విశ్వమంతా ఒక పెద్ద పరిశోధనాలయం గా భావిస్తే ఈ వేదాలని వ్యసించిన (విభజించిన) వేద వ్యాసుడే కాదు సాధనల ద్వారా విశ్వాన్ని, ప్రకృతిని పరిశోధించి రహస్యాల్ని తెలుసుకొని అపారమైన విజ్ఞానాన్ని అందించిన ఆనాటి ఋషులు కూడా పరిశోధకులే. అలాగే మెటీరియల్ సైన్స్ ని శోధించి లాస్ ఆఫ్ ఫిజిక్స్ ని కనుగొన్న ఐనిస్టీన్, ప్లేంక్ మొదలైన వారు, అలాగే ఇతర సైన్సులలోని వారు కూడా అందరూ పరిశోధకులే. వీరందరూ జగతిలోని ఏదో ఒక రహస్యాన్ని చేధించిన వారే. మరి వీరు చేధించిన వాటినన్నిటినీ సృష్టించినది ఎవరూ అంటే ఆ "దేవుడు" - కనిపించని మరోశక్తి, ఒక సెంట్రల్ పవర్ అని తీర్మానించక తప్పదు. ఈ సెంట్రల్ పవర్ హౌస్ ని అర్ధం చేసుకొని దేవునికి దగ్గిరవ్వడానికే ఆధ్యాత్మిక గురువు అవసరం. 

Thursday, July 30, 2015

డేంగూ వైరస్ కు దోమ వెన్నుపోటు. రాజమౌళి "ఈగ" లే కాదు- దోమలూ యోధులే!!


మొదటిసారిగా సైంటిస్టులు అడవి దోమల్ని మానవ జబ్బుల్ని అరికట్టడానికి వాడారు. ఇందులో మందుల వాడకం లేకపోవడం వల్ల, దీనిని నేచురల్ ప్రొటెక్షన్ గా పరిగణించవచ్చు.

గత మూడు సంవత్సరాల నుండి, సైంటిస్టుల బృందం దోమల మీద పరిశోధనలు చేస్తూ.. మంచి ఫలితాలను ప్రపంచానికి అందించారు. డేంగూ విష జ్వరాలు డేంగూ వైరస్ వల్ల మనుష్యులకి సోకుతుంది. ఇది దోమ కాట్ల ద్వారా సోకుతుంది. ఆస్ట్రేలియాలో వేలకి వేల మందిని ఈ వైరస్ పొట్టనపెట్టుకుంటుంది, అలాగే ఇతర దేశాలలో కూడా తన తడాఖా ని చూపిస్తున్నది. వాటిల్లో భారత దేశం కూడా లేకపోలేదు. ఈ వైరస్ సోకడానికి కారణాలు రెండు పేరసైట్లు ఒకటి డేంగూ వైరస్ మరియు దానిని వ్యాపింపజేసే దోమ.ఈ పార్ట్నర్ షిప్ ని ని బ్రేక్ చేయ్యడానికి యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ నుండి స్కాట్ ఓనీల్ అనే శాస్త్రవేత్త వీటి మధ్యకి మరో పేరసైట్ ని ప్రవేశింపజేశారు. అది వాల్బెచియా (Wolbachia) అనే బాక్టీరియం. ఈ బాక్టీరియం దోమల్నే కాకుండా ఆర్థోపాడ్ ఫైలం కి చెందిన మరెన్నో కీటకాలకు కూడా ఇన్ ఫెక్ట్ కాగలదు. ఈ బాక్టీరియం చాలా త్వరితం గా కీటకాల్లో వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఇది ఆడ దోమల గ్రుడ్లలో ఈజీగా దాగి, ఎన్నో రీతులద్వారా క్రొత్త హోస్ట్స్ ని చేరి దాని మనుగడని వ్యాపింపజేసుకోవడానికి ప్రయత్నిస్తుందిట. సైటోప్లాస్మిక్ ఇన్ కంపేటబిలిటీ (cytoplasmic incompatibility) ద్వారా మగ కీటకాలను ఈ బాక్టీరియా సోకని ఆడదోమలకు దూరం గా వుంచుతుంది. ఈ బాక్టీరియా సోకిన ఆడదోమలను మాత్రమే మగ కీటకా లకు దగ్గిర చేస్తుంది. దానివల్ల ఈ ఆడదోమలు బాక్టీరియా దాగిన గ్రుడ్లను పెడతాయి. ఒక్కసారి ఈ బాక్టీరియం అడుగు పెట్టిందంటే దాని పాప్యులేషన్ ని చాలా త్వరితం గా పెంచుకుంటూ పోతుంది. శాస్త్రవేత్తలు ఈ బాక్టీరియా లక్షణాన్ని ఉపయోగించి హ్యూమన్ డిసీజెస్ ని అరికట్టడానికి గత 20 యేళ్ళు గా కృషి చేస్తున్నారు.

అసలు ఈ విష జ్వరాలని ఎదుర్కోవడానికి ఒక బాక్టీరియాన్ని వుపయోంచడమేంటి? 

దీనిక్కారణం దీనిని ఎదుర్కోవడానికి వాక్సిన్ లేదు. డేంగూ ప్రాణాంతకమైనది. ఇదిసోకిన మనుష్యులు కొన్ని వారాల పాటు జబ్బుపడిపోతారు. డేంగూ సోకిన వారు అధిక జ్వరం, వొళ్ళు నొప్పులు మరియు అలసటలతో బాధ పడుతుంటారు. గత 50 ఏళ్ళ నుండి ఈ జ్వరాలు మరో 30% ఇంకా ఎక్కువయ్యాయి. WHO ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా, ప్రతి ఏటా 50-100 మిలియన్ల ప్రజలు ఈ విషజ్వరాల పాల్నపడుతు న్నారుట. ఇది దోమల వల్ల వచ్చే వైరల్ డిసీజ్. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ లో ఎండమిక్ స్టేటస్ గా అమెరికా, సౌత్ ఏషియా, వెస్ట్రన్ పసిఫిక్, ఆఫ్రికా మరియు ఈస్ట్రన్ మెడిటెరనేయన్ ప్రాంతాల్లో ముఖ్యం గా అర్బన్, సెమీ అర్బన్ ఏరియాల్లో ఈ వైరస్ సోకుతున్నది. అలాగే ఇండియా లో కూడా ప్రతి ఏటా 20,000 మంది ఈ డేంగూ వల్ల చనిపోతున్నారు. ఈ వైరస్ సోకడానికి ముఖ్య కారణం ఈ దోమలు.  దోమలు. ప్రతిఏటా సమ్మర్ మాన్ సూన్ చివరిరోజుల్లో ఇంకా రోడ్ల మీద, కాలవల్లోనో వర్షపు నీళ్ళు నిలిచిపోతుంటుంది, అవే ఈ దోమలకు బ్రీడింగ్ కి అనువైన కాలము, స్థలము.
భెర్నార్డ్ యూనివర్సిటీ నుండి డోనాల్డ్ షెపార్డ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యం లో అమెరికా, ఇండియా కలిసి చేసిన పరిశోధనల మూలం గా తెలిసిన విషయమేమిటంటే డేంగూ సమస్య అమెరికాలో కన్నా ఇండియా లో ఎక్కువ ఉందిట. ప్రతి ఏటా 5.8 మిలియన్ల ఇండియన్లు దీని పాల్న పడుతున్నారుట. 282 టైంస్ ఎక్కువ కేసులు ఇండియా నుండి నమోదవుతున్నాయిట. ఇండియా లో పబ్లిక్ హెల్త్ చాలెంజెస్ రోజు రోజు కీ పెరిగి పోతున్నాయ్. ఇండియా పోలొయోని పూర్తిగా అరికట్టగలిగింది. ఇండియాలో వాక్సిన్స్ ని కనుక్కోవడానికి తగు పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ ఇంకా ఆశించిన ఫలితాలు కనబడలేదు.

ఈ లోపుల పరిశోధనల్లో తేలినదేమిటంటే Wolbachia బాక్టీరియం సోకిన కీటకాలు.. హ్యూమన్ డిసీజెస్ ని వ్యాపింప జేసే లక్షణాన్ని కోల్పోయాయిట. అందువల్ల శాస్త్రవేత్తలు ఈ లక్షణాన్ని ఆధారం గా చేసుకొని... ఆ బాక్టీరియాన్ని జన్యుపరం గా ఇంజినీరింగ్ చేసి ఈ కీటకాల్లో శాశ్వతం గా వుండిపోయేలాగ చెయ్యడానికి చూస్తున్నారు. దోమలో సోకిన వైరస్సు యొక్క విరులెన్స్ (విషపూరిత వ్యాధిని కలిగించే లక్షణం) కోల్పోయేలా ఈ బాక్టీరియా చేయడం తో దోమకాట్లద్వారా వైరస్సు మనిషికి సోకినా ఇక హాని వుండదు.

మొదటిప్రయత్నం గా డేంగూ వైరస్ కి యాంటీ బాడీ ని బాక్టీరియం లో ప్రవేశ పెట్టారు. ఈ వైరస్సు దోమలకు సోకినప్పుడు దానిని బైండ్ అయ్యే యాంటీబాడీ వుంది కాబట్టి వైరస్ అరికట్టబడుతుందనుకున్నారు. కానీ ఈ స్ట్రాటజీ పని చెయ్యలేదు. ఈ వైరస్సు రకరకాల స్ట్రెయిన్లను ఆల్ రెడీ డెవెలప్ చేసింది, ఒక స్ట్రెయిన్ ఒకసారి కీటకాలకి ఇన్ ఫెక్ట్ అయితే, వాటి లైఫ్ టైం సగానికి తగ్గిపోతున్నదిట. పైగా ఏజెడ్ కీటకాలు మాత్రమే ఈ వైరస్ ని పెంపొందిస్తున్నాయిట.  ఈ ఏజెడ్ దోమల్లో ఈ పర్టిక్యులర్ వైరస్సు డెవెలప్ అవ్వడానికి చాలా వారాలు పడుతుంది కాబట్టి ... ఈ ఏజెడ్ దోమల్ని గనుక నాశనం జేస్తే ఆ పర్టిక్లులర్ స్ట్రెయిన్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ని అరికట్టవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నారు.

ఓనీల్ శాస్త్రవేత్తల టీం, ఏరీ హాఫ్మాన్ టీం శాస్త్రవేత్తల ( యూనివర్సిటీ ఆఫ్ మెల్బార్న్ నుండి) తో కలిసి Aedes aegypti  దోమల్లో ఒక స్ట్రెయిన్ wMel ని ప్రవేశపెట్టారు. ఈ స్ట్రెయిన్ ఈగలని ఇన్ ఫెక్ట్ చేస్తుంది. మిగితా స్ట్రెయిన్లతో పోలిస్తే ఈ స్ట్రెయిన్ ఇంకా బలమైనది మరియు చాలా త్వరితం గా తనని తాను హోస్ట్ లోపల వ్యాప్తిని చేసుకుంటుందిట.  అంత కన్నా ముఖ్యం గా డేంగూ వైరస్ యొక్క మనుగడలో ఇంటర్ ఫియర్ అయ్యి అంతర్గతం గా వైరస్ తో తలపడి, అది వ్యాప్తి కాకుండా అరికడుతుందిట. అది ఇంటర్ ఫియర్ అయ్యే విధానం ఏమిటంటే బాక్టీరియం ఈ వైరస్ హోస్ట్ లోపల ఉత్పత్తి అవ్వడానికి కావలసిన ఫేటీ యాసిడ్లు (fatty acids) మొదలైన మాలుక్యూల్స్ ని వాడేసుకుంటుంది. వైరస్ యొక్క వ్యాప్తికి కావల్సిన మాల్క్యూల్స్ వైరస్ కి అందనివ్వకుండా తన వ్యాప్తికి వాడుకుంటుంది ఈ బాక్టీరియం. ఈ బాక్టీరియం తాను ఇన్ ఫెక్ట్ అయిన ఏ కీటకాలకు ఎటువంటి హాని చెయ్యదు. అలాగే ఒక దోమ నుండి, మరో దోమకు కూడా సునా యాసం గా సోకదు. వాటి మధ్య క్రాస్ జరగాలి.. ప్రాజెనీ ద్వారా బాక్టీరియా ఒక జెనెరేషన్ నుండి మరో జెనెరేషన్ కి సంక్రమిస్తుంది.అందువల్ల ఈ శాస్త్రవేత్తల బృందం దోమల్ని బాక్టీరియల్ స్ట్రెయిన్ తో లోడ్ చేసి...రెసిడెన్సెస్ ఉన్నచోట పొదల్లోకి వాటిని వదిలారు. ఈ యెనాలిసిస్ అంతా ఆ చుట్టు పక్కల నివసించేవారి సహాయ సహకారాలతోనే సాగింది.

ఈ దేశంలో డేంగూ జ్వరాలు చాలా పెద్ద సమస్య అవ్వడం వల్ల... వాటి అంతు చూడాలనే వ్యవస్థ నిర్ణయించుకొని, వీరి పరిశోధనలకు పూర్తి సహయ సహకారాలను అందించారు. ఈ సంవత్సరం (2015) లో జనవరి, ఫిబ్రవరి ల మధ్య ఓనీల్ శాస్రవేత్తల టీం 3,00,000 దోమల్ని వదిలారుట. ప్రతి రెండు వారాలకొకసారి ట్రాప్స్ ద్వారా వాటిని పట్టి ఎగ్స్ ని పరీక్షిస్తున్నారు వాటిలో బాక్టీరియం వున్నదా లేదా అని. అద్భుతమైన విషయమేమిటంటే…. మే నెల కల్లా ఈ బాక్టీరియా ఇన్ ఫెక్ట్ అయిన దోమలు 80-90% పెరిగాయి.  కేవలం 5 నెలల కాలం లో ఈ బాక్టీరియా దోమల పాప్యులేషన్ ద్వారా పూర్తి గా వ్యాప్తిని చెందినది.

ఈ పరిశోధనలు హోస్ట్-పేరసైట్ ఎవల్యూషన్ (host-parasite evolution) కే పరాకాష్ట. ఈ విధం గా చూస్తే కేవలం డేంగూ వైరస్సే కాకుండా దోమల ద్వారా వ్యాప్తి చెందే వెస్ట్ నీల్ వైరస్ అలాగే మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం ని కూడా అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఎవొల్యూషన్ రీత్యా ఒక సమస్య ఎదురవ్వక పోదు. వైరస్సులకు త్వరితం గా పరివర్తన చెందే లక్షణం వుంది. ఒక వైరల్ స్ట్రెయిన్ ని అరికడితే మరో వైరల్ స్ట్రెయిన్ గా జన్యు పరివర్తనలు చెంది మారుతుంది. మరి వెంట వెంటనే అరికట్టే మార్గాలను కనిపెట్టడం చాలా కష్టం. ఈ విషయాన్ని ఓనీల్ గ్రహించక పోలేదు. ఇదంతా ప్రకృతి సహజం. ప్రకృతికి వ్యతిరేకం గా ఎవరూ పని చెయ్యలేరు. అయినా కూడా ఓనీల్ గ్రూప్ గుండె నిబ్బరాన్ని పోగొట్టుకోకుండా... డేంగూ కేసులని కంట్రోల్ చెయ్యడ మే ధ్యేయం గా పెట్టుకొని ఇప్పుడు వియత్నాం దేశం లో దీనిని అరికట్టే ప్రయత్నాన్ని లార్జర్ ట్రయల్  మొదలు పెట్టారు.
అమెరికాలో ఉన్న జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు కూడా దీనిని చాలా ముఖ్యమైన మరియు గ్రౌండ్ బ్రేకింగ్ స్టడీస్ గా వర్ణించారు. ఈ రిపొర్ట్ "నేచర్" అనే సైన్స్ మాగజీను లో మొదటి సారిగా 2011 లో పడింది (Reference:  Walker et al (2011) The wMel wolbachia strain blocks dengue and invades caged Aedes aegypti populations. Nature).


సీరియస్లీ ఇది ఒక డిస్కవరీ. ఇన్ వెన్షన్ కాదు. చూస్తుంటే ఇటువంటి జెనిటిక్ సైన్స్ మానవాళి కి వుపయోగపడే క్రొత్త యానిమల్ స్పీషీస్ సృష్టించగలదనే నమ్మకం ఏర్పడుతున్నది.   

Wednesday, July 29, 2015

HTLV మరియు HIV పరస్పర లైంగిక అంటువ్యాధులు

ఒక దెయ్యం నెలవు వంద దెయ్యాలకు కొలువు అనే నానుడి వుంది. అలాగే వైరస్ కూడా. ఒక వైరస్ వ్యాధి అనేక రుగ్మతలకే కాక మరిన్ని వైరస్ ఇన్ ఫెక్షన్లకు పునాదులు వేస్తాయి ముఖ్యం గా అవి సెక్సువల్ కాంటక్ట్ వల్ల ఇన్ ఫెక్ట్ అయినవి అయితే. అలాంటి జోడు వైరస్సుల గురించి ప్రస్తావించి ప్రజలకు తెలియ పరచడమే ఈ ఆర్టికల్ యొక్క లక్ష్యం.

హెచ్.ఐ.వి (HIV or Human immunodeficiency virus) మరియు హెచ్.టి.ఎల్.వి (HTLV or Human T-lymphotropic viruses) సెక్సువల్ కాంటాక్ట్స్ ద్వారాసంప్రాప్తించే  ఏకకాలిక దీర్గ రోగాలు. మరలా ఒక్కొక్క దానికి టైప్ 1, టైప్ 2 అనే వెరైటీ స్త్రైన్స్ కూడా ఉన్నవి, ఏ స్ట్రైన్ అయినా కూడా క్షణాలలో అంటుకునేదే. రెట్రో వైరల్ గ్రూపుకు చెందిన ఈ రెండు వైరస్సులు ప్రపంచ వ్యాప్తం గా మానవాళిని పట్టి పీడిస్తున్నాయి.

హెచ్.ఐ.వి-1 మరియు హెచ్.ఐ.వి-2 సబ్ టైప్స్ ఎక్కడో అడవుల్లో చింపాంజీల, సూటీమాంగా బే ల మధ్య సంపర్కం జరిగినప్పుడు ఈ వైరస్సులు ఒకదాని నుండి మరొక దానికి ప్రసారమయ్యిందిట.  టైప్-1 చింపాంజీలల నుండి, టైప్-2 మాంగా ల నుండి ప్రసార మయినవి. ఈ రెండు హెచ్.ఐ.వీ లు ప్రపంచం మీదకి విజృంభించే 100 ఏళ్ళకు పైబడింది. కాకపోతే గత 30 ఏళ్ళ నుండే ఎయిడ్స్ రూపం లో హెచ్.ఐ.వి. గురించి, అలాగే మరొక వైరస్సు హెచ్. టి. ఎల్. వి. గురించి కూడా మానవునికి తెలిసినది. ఈ హెచ్.టి.ఎల్.వి. ఇంకా పాతది, వేల సంవత్సరాల క్రితమే ఆఫ్రికా అడవుల్లో ఉద్భవించిది. పిగ్మీ జాతుల వారి ద్వారా ప్రాకింది.

హెచ్.ఐ.వి వైరస్సులు చాలా త్వరితం గా విభజన చెంది, తాము ఇన్ ఫెక్ట్ అయ్యిన హోస్టు కణాలలో విస్తరించి, వాటినే ధ్వంసం చేసేస్తాయి.ఈ వైరస్సు యొక్క ప్రతి డెవలప్మెంటల్ స్టేజ్ కూడా విషపూరితమైనదే, ఇన్ ఫెక్ట్ కాగల సామర్ధ్యం గలిగినదే. ఇది కేవలం లైంగిక పరంగా మరియు రక్త మార్పిడుల వల్ల అంటుకొనేది..

హెచ్.టి.ఎల్.వి కూడా రెండు టైపులు 1 మరియు 2. ఈ రెండూ జెనిటిక్ గా చాలా దగ్గిర పోలికలను కలిగిఉన్నవి. ఒక 60-70 శాతం వరకూ.. వాటి జీన్ సీక్వెన్స్ కూడా మ్యాచ్ అవుతున్నదిట. ఈ వైరస్సులు బొవైన్ లుకేమియా (bovine leukemia) నుండి బయటపడినవి. అందుకే వీటిని బొవైన్ లుకేమియా వైరస్ గ్రూప్ క్రిందా మరియు  ఆన్ కోవిరినే (oncovirinae)  అనే సబ్ ఫ్యామిలీ గా విభజన చేశారు. ఈ వైరస్సు హెచ్.ఐ.వి లాగ కణాల్ని ధ్వంసం చెయ్యవు. కాని ఇన్ ఫెక్టెడ్ కణాల సంఖ్యను పెంచి శరీరం లో విస్తరిస్తుంది. అందుకే దీన్ని లుకేమియా వైరస్ అని అంటారు. పైగా ఇది బొవైన్ లుకేమియా నుండే బయటపడింది కూడా. ప్రిఫరబుల్ గా ఈ వైరస్సు శరీరంలో ని టి-లింఫోసైట్ల (T-lymphocytes) ని అటాక్ చేస్తాయి. అక్కడి నుండి మిగితా కణాలు మోనోసైట్లు (monocytes), బి-లింఫోసైట్లు (B-lymphocytes) కి కూడా ప్రాకుతుంది. ఈ వైరస్ కూడా లైంగిక పరమైనది. అలాగే రక్త మార్పిళ్ళ వల్ల, ఈ రోగం తో వున్న వా ళ్ళు పిల్లలకి పాలిచ్చినా కూడా ఇతరులకు సంక్రమించేస్తుంది. దీని ఇన్ ఫెక్షన్ దీర్ఘ కాలికము, రాకుండానే వుండాలి గాని, వైద్యం తీసుకున్నా కూడా కణాలలో అప్పటికి గుప్తం గా వుండి, అనుకూల పరిస్థితులు రాగానే మళ్ళీ విజృంభిస్తాయి.   అందుకే వీటిని గుప్తరోగాలు అని చెప్పడం జరిగింది.

హెచ్.టి.ఎల్.వి లుకేమియా వైరస్ జపాన్, కరేబియన్, ఆఫ్రికా, అమెరికా మరియు మెలనీసియా దేశాలలో ప్రబలమై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమయిపోయింది.

హెచ్.ఐ.వి వైరస్ వంద యేళ్ళ క్రితం నుండే ఉద్భవిస్తే హెచ్.టి.ఎల్.వి. వేల సంవత్సరాల నాటిది. ఇప్పటి వరకూ ఈ ఇన్ ఫెక్షన్స్ అరికట్టబడలేదు. ఇవి ఇంకా ఇలాగే వుంటూ సబ్ టైప్స్ గా, సబ్ సబ్ టైప్స్ గా పురోగమిస్తున్నాయే తప్ప వీటికి తిరోగమనం మాత్రం లేవు. హెచ్.టి.ఎల్.వి టైప్ 2 మళ్ళీ టైప్ 2ఎ, 2బి మరియు 2సి లు గా రూపాంతరం చెందాయి. ఈ రకాలను వాటి జీన్ సీక్వెన్సెస్ లోని తేడాల వల్ల మాత్రమే విభజించగలిగారు. జీన్ సీక్వెన్సెస్ లలో తేడాలున్నప్పటికీ వాటి విరులెన్స్ లో ఏమైనా తేడా వుందా అని పరిశోధించి చూస్తే ఏమత్రం తేడా కనబడలేదుట. అంటురోగాలని వ్యాప్తి చెయ్యడం లో అన్ని సబ్ టైప్స్ సమానము. హెచ్.టి.ఎల్.వి -2 ఆఫ్రికాలో పుట్టింది ముఖ్యం గా పిగ్మీ జాతి వారిలో. అక్కడినుండి మెల్లగా అమెరికా, బ్రెజిల్ మరియు ఇతరదేశాలలో కూడా వేల సంవత్సరాల క్రితమే ప్రవేశించింది. దీని సబ్ టైప్స్ కూడా అమెరికా, యూరప్ మరియు బ్రెజిల్ దేశాలలో ఎక్కువగా ఆవరించి వున్నాయి. హెచ్.టీ.ఎల్.వి-1 వైరస్ పరిస్థితి కూడా ఇంతే.

హెచ్.టి.ఎల్.వి వైరస్ సోకాక మనిషికి ఎన్నో రకాల జబ్బులు, రుగ్మతలు వంట్లో పుట్టేస్తాయిట ముఖ్యం గా జాయింట్ల వాపులు, కీళ్ళవాతాలు. అవే కాక లింఫోప్రొలిఫిరేటివ్ మాలిగ్నెన్సీస్ (lympho proliferative malignancies) తో కూడా బాధపడుతుంటారు. శరీరమంతా చీడ పట్టేసినట్లే, ఎందుకంటే వైరస్సు ఇమ్య్యూన్ సిస్టం ని అటాక్ చేస్తుంది, మెల్ల మెల్ల గా శరీరం లోని అన్ని సిస్టములని తన చేతిలోకి తీసుకుంటుంది. ఇది స్లో పాయిజన్ జబ్బు కాబట్టి.. ఎటువంటి రోగ లక్షణాలని బయటపెట్టదు తన పనులు పూర్తయ్యేవరకు. రోగ లక్షణాలు తెలియకపోవడం వల్ల రోగం ఉందని కూడా రోగికి తెలియదు. దీనికి అనుకూల పరిస్థితులు పూర్తిగా ఏర్పడి, జబ్బు ముదిరి అడ్వాన్సుడు స్టేజ్ లో బయట పడేసరికి ఎంతో కాలం పడుతుంది. అంతవరకూ రోగులు క్యారియర్స్ గా వుంటూ వాళ్ళతో సంభోగించిన వాళ్ళకి వైరస్సును అంటిస్తుంటారు. ఈ రోగులకు టి-సెల్ లుకేమియా/లింఫోమా (T-cell leukemia/lymphoma) కూడా వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఎముకలపై లీషన్స్ (lesions) వచ్చేస్తాయి. కాలేయము, స్ప్లీను ఎన్ లార్జ్ అయిపోతాయి. గ్యాస్ట్రిక్, కిడ్నీ ట్రబుల్స్ మరియు చర్మ వ్యాధులు కూడా ప్రాప్తిస్తాయి.

ఇలా ఇమ్యూన్ సిస్టం పూర్తిగా దెబ్బతిన్నాక హెచ్. ఐ.వి వైరస్సు ని ఆటోమేటిక్ గా ఈ హెచ్.టి.ఎల్.వి యే ఆహ్వానిస్తుంది. అదెలాగో చూద్దాం.

ఈ రెండింటిదీ ఒక బ్యూటిఫుల్ అసోసియేషన్, ప్రకృతి రహస్యం. హెచ్.టీ.ఎల్.వి ఇమ్యూన్ కణాలను (CD4+ లాంటి టి -సెల్స్) ఇన్ ఫెక్ట్ చేసి ఆపై ఇన్ ఫెక్టెడ్ కణాలను ప్రొలిఫరేట్ చేసి అధిక సంఖ్యలో పెంచి కణాల యాక్టివ్ కాంపౌండ్స్ (ప్రొటీన్స్, సైటోకైన్స్, కీమోకైన్స్) ని నార్మల్ నుండి అబ్నార్మల్ స్థితికి తెచ్చిపెడుతుంది. ఈ ఇన్ ఫెక్షన్ వల్ల టి-కణాల లోని యాక్టివ్ కాంపౌండ్స్ ఇతర వైరస్సులని నిరోధించే లక్షణాలను కోల్పోయి వాటిని ఆహ్వానించే స్థితిలోకి మారిపోతాయి. అబ్ నార్మల్ టి-సెల్స్ పై చిత్రం లో చూపబడిన విధం గా... వాటి పై వున్న స్పెసిఫిక్ రిసెప్టర్ ప్రొటీన్స్ ద్వారా హెచ్.ఐ.వి. ని ఆకట్టుకొని లేదా ఫ్యూజ్ అయ్యి, శరీరం లోకి ఆహ్వానిస్తుంది. అంటే హెచ్.ఐ.వి. ని ఫ్యూజ్ చేసే స్పెసిఫిక్ ప్రొటీన్స్ ని నిరోధించే సిగ్నల్స్ ని ఇన్ ఫెక్టెడ్ కణాలు పూర్తి గా కోల్పోతాయన్న మాట. ఈ లోపుల హైచ్.ఐ. వి కి వున్న ముఖ్య లక్షణం తాను ఇంఫెక్ట్ చేసిన హోస్ట్ కణాలని ధ్వంసం చేసేయడం. హెచ్.టి.ఎల్.వి ఇన్ ఫెక్షన్ ని ఎక్కువచేసి కణాలని అబ్నార్మల్ గా మార్చి హైహ్.ఐ.వి.కి ప్లాట్ ఫారం ను ఏర్పాటు చేస్తే హెచ్.ఐ.వి. ఒక్కసారి కణం లోకి చొచ్చుకొని పోయిన వెంటనే.. విభజన చెందుతూ ఆ కణాన్ని ధ్వంసం చేసి..పక్క కణాలను అటాక్ చేసుకుంటూ దాని మనుగడను సాధించుకుంటుంది. అసలు హోస్ట్ కణాన్నే ధ్వంసం చేసేస్తే.. తనకు ఏ చిన్న నిరోధకత కూడా హోస్ట్ కణం నుండి వుండదు కదా, అదీ హెచ్.ఐ.వి. తెలివి!! 

గత 30 ఏళ్ళనుండి మాత్రమే ఈ వైరస్సుల వునికి ని తెలుసుకొని పరిశోధనలు జరిపితే ఇప్పటికి వీటి మధ్య అసోసియేషన్ గురించి బయటపడింది. కాని డ్రగ్స్ మాత్రం లేవు ఆపడానికి. నిరంతర పరిశోధనలను జరుపుతూనే వున్నారు. ఇదిలా వుంటుండగా, ఈ ఇన్ ఫెక్షన్లతోనే కుదేలయిపోయిన శరీరాలకి హెపటైటిస్ సి (Hepatitis C) కూడా అటాక్ అవుతున్నదని కేసులు బయటకొచ్చాయి. ఈ కేసులను డయగ్నాసిస్ చాలా కేర్ ఫుల్ గా చెయ్యాలి. ఒకటి కన్నా ఎక్కువ వైరస్సులు అటాక్ అయివుండడం వల్ల వచ్చే టైటర్ వాల్యూస్ కూడా చాలా కన్ ఫ్యూజింగ్ గా  వుంటాయి.  



Monday, April 20, 2015

హైపోథైరాయిడిజం రక్తప్రసరణ వ్యవస్థ, గర్భాశయ సమస్యలకు ఎలా దారితీస్తుంది? Part-2

Part- 2 

అక్టోబర్ 25, 2014 న ఈ టాపిక్ ను మా సైన్స్ కబుర్లు అంతర్జాల రేడియో ప్రోగ్రాం "తెలుగు తరంగా" లో కూలంకషంగా శ్రోతలతో చర్చించాము.

హైపోథైరాయిడిజం అనేది ఒక శారీరక రుగ్మత. థైరాయిడ్ గ్రంధి యొక్క యాక్టివిటీ చాలా తక్కువగా ఉండి, అది ఉత్పత్తి చేయవలసిన అతిముఖ్యమైన హార్మోన్లనూత్పత్తి చేయకపోవడం వల్ల ఈ రుగ్మతకు దారితీస్తుంది.


దీని లక్షణాలేమిటి?

1. శరీరం లో జరిగే అన్ని రసాయన చర్యలు అదుపుతప్పుతాయి.
2. ఒబీసిటీ, కీళ్ళనొప్పులు, గర్భం రాకపోవడం, గుండె జబ్బులు లాంటివి వస్తాయి.

ఈ గ్రంఢి మెడకు ముందర భాగలో అయివుంటుంది. ఇది రెండు ముఖ్యమైన హార్మోన్లు T3 (tri iodothyronine) మరియు  T4 ( thyroxine) లను ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు హామోన్ల యొక్క ప్రభావం అన్ని మెటబాలిక్ యాక్టివిటీస్ అంటే క్రొవ్వు పదార్ధాలని విచ్చిన్నం చెయ్యడం. కార్బోహైడ్రేట్స్ ని విచ్చిన్నం చెయ్యడం, శ్రీర ఎష్ణోగ్రతని బ్యాలెన్స్ చెయ్యడం, హుండే చప్పుడిని రెగ్యులేట్ చెయ్యడం, శరీరం లో అనేక ప్రోటీన్ల తయారీ లో వుంటుంది.

హైపోథైరాయిడిజం ఎందుకు వస్తుంది? దానికి గల కారణాలేమిటి?

మొదటికారణం ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల- ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ లో ఇమ్యూన్ సిస్టం తన బాడీ టిష్యూస్ కి వ్యతిరేకం గా యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తుంది. అలాగే థైరాయిడ్ గ్రంధి కి కూడ వ్యతిరేకం గా యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయి.అప్పుడీ టి3 మరియు టి4 హార్మోన్లు ఉత్పత్తి అవ్వవు. ఏ కొద్దో గొప్పో బ్యాలెన్స్ అయిన్నా కూడా జీవక్రియలను ముందుకు నడిపించలేవు.

రెండవ కారణం కంజెనైటల్ డిసీజెస్ వల్ల. పుడుతూనే థైరాయిడ్ గ్లాండ్ లో లోపము తో పుడతారు.
మూడవ కారణం పిట్యూటరీ డిసార్డర్- అసలీ థైరాయిడ్ గ్లాండ్ టి3 మరియు టి4 ని ఉత్పత్తి చెయ్యాలంటే, ముందు థైరాయిడ్ గ్లాండ్ యాక్టివ్ గా ఉండాలి కదా. దీన్ని యాక్టివ్ గా ఉంచే హార్మోను థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (TSH). ఇది మెదడు లోని పిట్యూటరీ గ్లాండ్ నుండి స్రవిస్తుంది. ఈ పిట్యూటరీ డిసార్డర్ గనుక వుంటే హార్మొన్ ఉత్పత్తి కాదు, థైరాయిడ్ గ్లాండ్ కూడా పని చెయ్యదు.

నాల్గవ కారణం గర్భధారణ: స్త్రీలు గర్భం ధరించింప్పుడు లోపల పిండం తయారీలో ఎక్కువ రసాయన చర్యలు జరుగుతుంటాయి. వాటి గురించి థైరాయిడ్ గ్లాండ్ విపరీతంగా టి3 మరియు టి4 ని ఉత్పత్తి చెస్తుంది. మరి ఏదైనా మోతాదును మించి తయారయినప్పుడు శరీరం లో ఆటోమేటిక్ గా డిఫెన్సివ్ మెకానిజములు మొదలవుతాయి. అధిక మోతాదుల్లో ఉత్పత్తి అవుతున్నT3 మరియు T4 లకు ఇమ్యూం సిస్టం యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేసి, ఆ హార్మోన్లను అరికట్టేస్తుంది. అయినా థైరాయిడ్ గ్రంధి దాని పని అది చేసుకుంటూనే వుంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత  థైరాయిడ్ గ్రంధి నార్మల్ కండిషన్ లోకి వచేసి.. తగు మోతాగులోనే ఉత్పత్తి అవ్వాలి. అలా తగు మోఅతాదుకు వచ్చినా కూడా ఇమ్యూన్ సిస్టం మాత్రం అటాక్ చెయ్యడం మానదు. ఎక్కువ పాళ్ళల్లో అటాక్ చెయ్యడం వల్ల, ఆల్ రెడీ తక్కువ మోతాదుకు వచ్చేసిన థైరాయిడ్ పూర్తిగా బ్లాక్ అయిపోతుంది. అది హైపోథైరాయిడిజం గా పరిణమిస్తుంది. దీనినే పోస్ట్పార్టం హైపోథైరాయిడిజం అని అంటారు. దీన్ని గనుక ట్రీట్ చెయ్యకుండా వదిలేస్తే అబార్షన్లు లేదా ప్రీ మెట్యూర్ డెలివరీ లాంటివి జరుగుతాయి.

ఐదవకారణం ఐయోడీన్ లోపము- ఐయోడీన్ అనేది ఒక ట్రేస్ మినరల్. ఇది ముఖ్యం గా సీ ఫుడ్స్ లోనూ, సీ వీడ్స్ లోనూ, ఐయోడిన్ ఎకువ వున్న భూమిలోనూ అలాగే ఐయొడైజ్డ్ ఉప్పులోనూ దొరుకుతుంది. ఐయోడీన్ థైరాయిడ్ ని యాక్టివేట్ చెయ్యడం లో ఉపయోగపడుతుంది. కొన్ని ప్రాంతాలలో భూముల్లో ఐయోడీన్ ఉండదు. అటువంటప్పుడు ఐయోడీన్ వున్న టేబుల్ సాల్ట్ ని భోజన తయారీలో ఉపయోగుంచుకోవాలి.

ఈ హైపోథైరాయిడిజం ఏ వయసువారికి వస్తుంది??

ఇన్ ఫాంట్స్: ఇన్ ఫాంట్స్ లో కూడా హైపోథైరాయిడిజం వస్తుంది. దీనివల్ల వాళ్ళకి పచ్చకామెర్లు రావడం జరుగుతుంది. ఎర్ర రక్త కణ్ణాలు బ్రేక్ అయిపోవడం వల్ల, ఆ అవ్శేషాలు సిస్టం నుండి సరిగ్గా ఫ్లష్ అవుట్ కాదు. దాని నుండి విడుదలయ్యే బైల్ రుబిన్ లివర్ లో మెటాబొలైజ్ కాదు. అది రక్తం లోనే పసుపు పచ్చిని పిగ్మెంట్ గా ఉండిపోవడం వల్ల పచ్చకామెర్లకు దారితీస్తుంది. హైపోథైరాయిడిజం వల్ల అంతేకాకుండా పిల్ల లు కూడా పొడి దగ్గుకి గురి అవుతారు.ముఖం కూడా బాగా వాచిపోతుంది.

పిల్లలు, టీన్సు: వీళ్ళల్లో పెరుగుదల తక్కువగా కనిపిస్తుంది. పొట్టిగా వుంటారు. పెర్మనెంట్ టీత్ రావడం ఆలస్యమవుతుంది. వాళ్ళు ఫుబెర్టీ కి రావడం కూడా ఆల్శ్యం అవుతుంది. మానసిక పెరుగుదల కూడా వుండదు.    

ఈ హైపోథైరాయిడిజం రక్తప్రసరణ వ్యవస్థ, గర్భాశయ సమస్యలకు ఎలా దారితీస్తుంది?
దీనికి ఒక కేస్ స్టడీ ని షోలో డిస్కస్ చేశాము.

మహారాష్ట్ర లోని పూనె సిటీలో ప్రసిద్దిచెందిన హాస్పిటల్స్ లో జహంగీర్ హాస్పిటల్ ఒకటి. ఇది గైనిక్ తో పాటు మరెన్నో స్పెషాలిటీస్ ఉన్న హాస్పిటల్. మనం పరిశీలించబోయే కేస్ స్టడీ ఇక్కడిదే. ఈ పేషంటుకి దగ్గిర దగ్గిర 23 ఏళ్ళు ఉంటుంది. ఈమె మొదటిసారి గా ఎనిమిదేళ్ళ క్రితం బహిష్టులో అధిక రక్తస్రావంతో బాధపడుతూ గైనకాలజిస్ట్ (స్త్రీ వైద్యనిపుణులు) ని కలిసింది. మధ్య మధ్యలో తెరిపిచ్చినా, మళ్ళీ మొదలై నెల అంతా రక్తస్రావంతో బాధపడుతూ ఉండేది.  గర్భనిరోధక మాత్రలని వాడమని రాసిచ్చారు. ఈ మాత్రల వల్ల రక్తస్రావం తగ్గేది, కాని దాని పర్యవసానం దానికి ఉండేది. మాత్రలలోని ఈస్ట్రోజెన్, ప్రొజెస్టీరోన్ హార్మోనులు ఒక ప్రక్క రక్త స్రావాన్ని ఆపినా, మరో ప్రక్క అండం విడుదలని కూడా ఆపుతాయి. ఈ పేషంటుకు, కొద్దికాలం తర్వాత అల్ట్రాసోనోగ్రఫీ చేస్తే, ఆమె అండాశయం పై చిన్న చిన్న కోశాలు లేదా సిస్టులు (అసామాన్యమైన పెరుగుదలలు) ఉన్నాయి. వాటిని నివారించడానికి మళ్ళీ మరి కొన్ని మందులు రాశారు. పేషంటు ఈ తదుపరి పరిణామాలన్నీ నివారించేందుకు ఆయుర్వేదపు మందులు కూడా కొన్నాళ్ళు తీసుకుంది. కానీ లాభం లేకుండా పోయింది.

ఇక కేసుని హిమటాలజిస్ట్ (రక్తవైద్యనిపుణులు) వద్దకు పంపించారు. వీరు చేసిన సాధారణ పరీక్షల్లో శరీరంలో అంతర్గత రక్తస్రావం గాని, ముక్కునుండి రక్తస్రావం గాని పేషంటుకి ఉన్నట్లు తేలలేదు. కాకపోతే రక్తహీనత, శరీరం నీరు పట్టడం, బరువు పెరగడం తేలాయి. బ్లడ్ గ్రూపు AB+. ప్లీహము, ఉదరకోశము, లింఫ్ వ్యవస్థలు నార్మల్ గా ఉన్నాయి. లోతైన పరీక్షలుచేస్తే, సూదితో చర్మంపై గుచ్చిన తర్వాత రక్తం దానంతట అదే సహజంగా ఆగిపోవు వ్యవధి 2 నిముషాల 1 సెకను, నార్మల్ గా ఉంది (నార్మల్ రేంజ్ 1-9 నిముషాలు). అంటే రక్తపళ్ళెరాల పనితనంలో లోపం లేదు, హీమోస్టాసిస్ ప్రాధమిక చర్య నార్మల్ గా ఉంది. దానితో పాటుగా జరిగే ద్వితీయక చర్య ‘కోయాగ్యులేషన్ లో తేడా కనబడింది. అంటే రక్తస్రావం దానంతట అదే ఆగిపోవడానికి పట్టే వ్యవధి 11-13.5 సెకన్లు ఉండాలి. కాని ఈ పేషంటుకు 6 నిముషాల 4 సెకన్లు పడుతున్నది. మరికొన్ని పరీక్షలు చేయగా మరిన్ని వివరాలు బయటపడ్డాయి. Von Willibrand Factor లేదా VWF (వాన్-విల్లీ బ్రాండ్ ఫేక్టరు/ప్రోటీను) బ్లడ్ ప్లాస్మాలో తక్కువ మోతాదులో ఉంది. అవటుగ్రంధి ఉత్పత్తి చేసే హార్మోన్ల లెవెల్స్ కూడా తక్కువ గా ఉంది.  దీనిని హైపోథైరాయిడిజం (hypothyroidism) అంటారు. చివరికి పేషంటుకు హైపోథైరాయిడిజం వల్ల వచ్చిన వాన్-విల్లీ బ్రాండ్ వ్యాధి’ అని తేల్చారు.


VWF బ్లడ్ ప్లాస్మాలో ఉండే గ్లైకో ప్రోటీను. ఇది బోన్ మేర్రో (Bone marrow) లోని పెద్ద కణాలైన మెగా కార్యోసైట్స్ (megakaryocytes) లో ఉత్పత్తి అవుతుంది. కాలేయం (liver) లో ఉత్పత్తి అయ్యే కోయాగ్యులేషన్ ఫేక్టర్ VIII తో బైండ్ అయ్యి, కోయాగ్యులేషన్ లో పాల్గొనేటప్పుడు ఫేక్టర్ VIII కు స్థిరత్వాన్ని ఇస్తుంది. మరి ఆ VWF ఉత్పత్తి లేనప్పుడు, ఫేక్టర్ VIII కు స్థిరత్వం లోపించి కోయాగ్యులేషన్ లో పాల్గొనలేదు, ఫలితంగా కోయాగ్యులేషన్ పూర్తిగా జరుగదు, ఇటువంటి ఫాక్టర్లు మరి కొన్ని కోయాగ్యులేషన్ లో పాల్గొన్నప్పటికీ కూడా.  అంతేకాకుండా, ఈ VWF కు ప్రాధమిక హీమోస్టాసిస్ (రక్తం గడ్డకట్టుట) లో కూడా కీలక పాత్ర ఉంది. రక్తపళ్ళెరాలు ఒకదానితో ఒకటి మరియు అవన్నీ కలసి ధమని చిట్లిన చోట VWF సహాయంతో సమూహకరిస్తాయి. VWF  లోపిస్తే రెండు చర్యలూ దెబ్బతిని రక్తస్రావమాగదు.  ఈ పేషంటు విషయం లో సరిగ్గా ఇదే జరిగింది. ఈమె రక్తపరీక్షలలో VWF ఉత్పత్తి తక్కువ కనబడింది, రక్తస్రావమాగడానికి ఎక్కువ కాలం కూడా పట్టింది. తరువాతి పరీక్షల్లో బ్లడ్ లో ఫేక్టర్ VIII యొక్క అస్థిరత్వాన్ని కూడా సూచించారు.

అవటు గ్రంధి మెదడులోని పిట్యూటరీ గ్రంధి వలన పని చేస్తుంది. అవటుగ్రంధి నుండి  ఉత్పత్తి అయ్యే హార్మోనులు శరీరంలోని అన్ని జీవక్రియల్లోనూ పాల్గొని వాటిని క్రమపరుస్తాయి. అలానే బోన్ మార్రో లోని ఉత్పాదనలు- VWF తో సహా అవటు గ్రంధి పైనే ఆదారపడిఉంది. ఈ పేషంటుకు, అవటుగ్రంధి హార్మోన్ల ఉత్పత్తి కూడా తక్కువ గా ఉండడం వలన, ఈ VWF లెవెల్స్ తగ్గిపోయాయి. దీనివల్ల ఫేక్టర్ VIII యొక్క అస్థిరత్వము మరియు కోయాగ్యులేషన్ ప్రక్రీయలో లోపము పెరిగిపోయి, ప్రతినెలా వచ్చే ఋతుచక్రంలో రక్తస్రావమాగలేదు. గర్భసంచిలో ఏ లోపమూ లేకపోయినా గర్భాశయపు సమస్యను తెచ్చిపెట్టింది. వెంటనే వైద్య చికిత్స గా ఆమెకు రక్తహీనతను పోగొట్టడానికి, రక్తం ఎక్కించారు. హైపో థైరాయిడిసం పోవడానికి, ప్రతిరోజూ ఓరల్ గా థైరాయిడ్ మాత్రలు వేసుకోమని రాసిచ్చారు. ఆరు నెలల్లో పేషంటు యొక్క పరిస్థితి మెరుగయి, అధిక రక్త స్రావం తగ్గింది. ఆమె ఆరోగ్యవంతురాలయ్యింది. ఈ రోగనిర్దారణే సరిగ్గ జరగకపోయినట్లయితే, గర్భసంచిని తొలగింపవలసిన పరిస్థితి ఏర్పడేది. హైపో థైరాయిడిసం వలన రక్తవ్యవస్థకే కాదు ఇతర జీవ క్రియలకు కూడ సమస్యలు వచ్చి మనిషి ప్రాణానికి ముప్పు వచ్చేది.


రక్తప్రసరణ వ్యవస్థ: జన్యుసంబందిత లేదా ఇతరలోపాలు- Part 1

Part-1

రక్తము లేదా నెత్తురు ద్రవరూపం లో ఉన్న శరీరనిర్మాణ థాతువు లేదా ఒక కణజాలము. ఇది జీవి మనుగడ కి ఎంతో అవసరం. రక్తానికి సంబంధించిన ఈ అధ్యయనాన్ని 'హిమటాలజీ (hematology)’  అంటారు. రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎరుపు రంగు. రక్తానికి ఈ రంగునిచ్చేది ఒక ప్రోటీను. దానిని  హీమో గ్లోబిన్  (hemoglobin) అంటారు.  రక్తానికి మూలాధారం నీరు. రక్తం లో దాదాపు గా 80% నీరే. ద్రవ పదార్థా లన్నిటిలో నీటియొక్క విశిష్టతాపం (specific heat) ఎక్కువ. అందువల్ల నీరు నిలకడ మీద వేడెక్కుతుంది, నిలకడ మీద చల్లారుతుంది. అలాగే శరీరప్రక్రియలవల్ల పుట్టిన వేడిని రక్తంలోని నీరు పీల్చుకున్నపుడు, నీరు సలసలా మరగదు, చెమటపట్టి శరీరంచల్లబడినప్పుడు మంచుముక్కలా చల్లబడిపోదు. అందువల్ల రక్తం నిదానపుగుణం కలిగి ఉన్నది.

రక్తాన్ని ఒక పరీక్షనాళం లో పోసి కాసేపు అలాఉంచితె మూడు భాగాలు (లేయర్స్) గా విడుతుంది. ఫై భాగం  ఎండుగడ్డిరంగు లో, పారదర్శకంగా పైకి తేలుతూ కనిపిస్తుంది. దీనిని 'ప్లాస్మా (plasma)' అంటారు. దీని దిగువు న కొద్దిపాటి మందంలో తెల్లటి లేయరు ఒకటి కనిపిస్తుంది. దీనిని 'తెల్లరక్తకణాలు 'లేదా తెల్లకణాలు (white blood cells or white cell or leukocytes) అంటారు. ఇక నాళిక లో అట్టడుగునఉన్న ఎర్రటి లేయరును 'ఎర్రరక్త కణాలు ' లేదా ఎర్రకణాలు (red blood cells or red cells or erythrocytes)అంటారు.




ప్లాస్మా (Plasma): ప్లాస్మాలో ఆరు-ఏడు శాతం వరకు అనేకమైన ప్రోటీన్లు (ఆల్బుమిన్ (albumin), గ్లోబ్యులిన్ (globulin), ఫైబ్రినోజెన్ (fibrinogen), వాన్ విల్లీ బ్రాండ్ ఫేక్టర్, Von Willi Brand factor (VWF)), గ్లూకోజ్ (glucose), క్లాటింగు ఫేక్టర్స్ (clotting factors) మరియు ఎలెక్ట్రోలైట్స్, electrolytes(Na+, Ca+, Mg2+, HC03-, Cl- etc)  అలాగే హార్మోన్లు, కార్బన్ డయాక్సైడ్ (ఎందుకంటే ప్లాస్మా అనేది ఒక ఎక్స్ క్రీటరీ సిస్టం గా కూడా ఉపయోగ పడుతుంది.  కణాలనుండి విడుదలయ్యే వేస్ట్ అంతా కూడా ప్లాస్మా లోకే వచ్చేస్తుంది). 55% వరకూ రక్తం ప్లాస్మా ని కలిగివుంటుంది.

ప్లాస్మాలో వుండే క్లాటింగ్ ఫేక్టర్సు రక్తం గడ్డకట్టడం లో దోహద పడుతుంటాయి. రక్తనాళము చిట్లినప్పుడు రక్తస్రావాన్ని ఆపడానికి రక్తపళ్ళెరాలతోపాటు, ఆ క్లాటింగు ఫేక్టర్సు కూడా యాక్టివేట్ అయ్యి, గాయం పై గడ్డలా అతుక్కుని స్రావాన్ని ఆపుతాయి. ఈ గడ్డని ఇంకా బలం గా పట్టి వుంచడానికి ఫైబ్రిన్ నెట్ వర్క్ దానిపైన డిపాజిట్ అవుతుంది,   

తెల్లరక్తకణాలు (leukocytes): వీటిలో హీమోగ్లోబిన్ ఉండదు. అమీబా వంటి ఆకారాన్ని కలిగి ఉంటాయి. ఒక మి.ల్లీ. రక్తం లో 50 నుండి 90 లక్షల తెల్లరక్త కణాలు ఉంటాయి. లింఫ్ (Lymph)   కణాలలోను, ప్లీహం (Spleen) లోను ఉత్పత్తి అవుతాయి. వ్యాధులబారినుండి రక్షించడం వీటి విధి.

ఎర్రరక్తకణాలు (erythrocytes): హీమోగ్లోబిన్ అనే ప్రోటీనును కలిగి ఉండడంవల్ల ఈ కణాలు ఎర్రగా ఉంటాయి. ఇవి గుండ్రంగా, ద్విపుటాకారంలో ఉంటాయి. ఇవి బోన్ మేరో (bone marrow) లో ఉత్పత్తి అవుతాయి. ఈ విధ మైన ఉత్పత్తి ని ఎరిత్రోపొయిసిస్ (erythropoesis) అని అంటారు. ఇలా ఉత్పత్తి అయిన కణాలు సుమారు 120 రోజులు జీవిస్తాయి. ఒక మి.ల్లీ. రక్తం లో 450 నుండి 500 కోట్ల ఎర్రరక్త కణాలు ఉంటాయి. ఇవి ప్రాణ వాయువు (oxygen) ని శరీరమంతా రవాణా చేస్తుంది.


రక్తపళ్ళెరాలు (blood platelets): ఇవి రక్తకణాలతోనే కలసిఉన్నా, బోన్ మేరో లోని మెగాకార్యోసైట్స్ కణాల నుండి ఉత్పన్నమవుతాయి. ఇవి ఒక మి.ల్లీ. రక్తం లో 150 నుండి 400 మిలియన్ల వరకు ఉంటాయి. వీటి జీవితకాలం 10 రోజులు మాత్రమే. ఇవి అవసరమైనప్పుడు అంటే మనకి దెబ్బ తగిలి ధమని (artery)  గాని, సిర (vein) గాని చిట్లి రక్తం స్రవించినప్పుడు ఆభాగంపై, ఒక గడ్డ (clump) లా, ఒకదానితోఒకటి అల్లుకుని (aggregation) రక్తస్రావాన్ని ఆపుతుంది. ఈ ప్రక్రియను రుధిరప్రతిబంధము మరియు రక్తంగడ్డకట్టుట (normal haemostasis and thrombosis) అని అంటారు. దీంట్లో మరికొన్ని రసాయన చర్యలు కూడా అదే సమయంలో జరుగుతాయి.  అయితే కొన్ని జన్యు (genes) లోపాల వల్ల మనుష్యులలో ఈ ప్రక్రియ లోపించి రక్తస్రావం లేదా ఆలశ్యంగా  రక్తం గడ్డకట్టటం జరుగుతుంది. ఈ జన్యులోపాలు ఉన్నవారు పైన దెబ్బతగిలితేనే కాదు, శరీరం లోపల కూడా అసాధారణమైన రక్తస్రావానికి (internal bruising or bleeding) గురి అవుతారు. ఇది ప్రాణాంతకమైన వ్యాధి.

ఈ రక్తపళ్ళెరాల జన్యుసంబంధిత వ్యాధులలో ముఖ్యమైనవి పళ్ళెరాల సంఖ్యాలోపం (low platelet count), అధిక సంఖ్యలో తయారీ కావడం (thrombocytosis) లేదా సంఖ్య కరెక్ట్ గా ఉన్నా, విధినిర్వహణ లోపించడం (platelet dysfunction). సాధారణంగా కనబడే జన్యులోపం సంఖ్యాలోపం, తద్వారా వాటి విధినిర్వహణలో లోపం. దీనిని 'థ్రాంబోసైటోపీనియా (thrombocytopenia)’ అని అంటారు.  ఈ సంఖ్యాలోపం జన్యులోపాలవల్ల పళ్ళెరాల ఉత్పత్తి (platelet production) లో వఛ్చే తేడా. మరొక రకమైన లోపం, అసలు బోన్ మేరో లేదా బోన్ మేరో లో ఉన్న స్టెం సెల్ల్స్ (stem cells) కు హాని కలగడం. దీనివల్ల పైన వివరించబడిన రక్తవ్యవస్థలో మూడురకాల కణాల తయారీ కూడా దెబ్బతింటుంది. దీనిని  ‘ఏప్లాస్టిక్ ఎనీమియా (aplastic anemia)’ అని అంటారు. దీనివల్ల కూడా సంఖ్యా లోపం సంభవిస్తుంది. దీనికి తీసుకునే మందులుగాని, రేడియెషన్స్, ఇనఫెక్షన్స్ లేదా జన్యులోపాలు కారణం కావఛ్చు.

ఇతర లోపాల (జన్యుసంబంధంకానివి) వల్ల కూడా పళ్ళెరాల సంఖ్యాలోపం సంభవిస్తుంది. రక్తప్రవాహం లో స్వేచ్చగా తిరుగుతున్న పళ్ళెరాలకు, శరీరంలోని వ్యాధినిరోధకవ్యవస్థే (immune system) ప్రతిరక్షకాలను (antibodies) తయారు చేస్తుంది. ఇవి పళ్ళెరాల పైన ఉన్న వ్యధీకరణాలు (antigens) కు bind అయి పళ్ళెరాలని నాశనం చేస్తాయి. దీనివల్ల ప్రవాహంలో పళ్ళెరాల సంఖ్య తగ్గిపొతుంది. ఈ వ్యాధిని ఇడియోపతిక్ థ్రోంబోసైటోపీనిక్ పర్ప్యూరా (ideopathic thrombocytopenic purpura, ITP) అంటారు. అలానే రక్తం గడ్డ కట్టునప్పుడు జరిగే మిగితా రసాయనచర్యలు (coagulation) అధికంగా జరుగడం వల్లకూడా ఎక్కువ మోతాదులో పళ్ళెరాలు వినియోగింపబడి, ప్రవహం లో వాటి సంఖ్య తగ్గిపోతుంది. ప్లీహము (spleen) వ్యాధి గ్రస్తమైనప్పుడు లేదా పెరుగుదలకు లోనైప్పుడు, పళ్ళెరాలను ట్రాప్ (trap) చేస్తుంది. దీనివల్లకూడా ప్రవాహం లో పళ్ళెరాల సంఖ్యతగ్గుతుంది.


ఈ ప్రాణాంతక వ్యాధి లక్షణాలను వెంటనే కనిపెట్టిట్రీట్మెంటు జరుపవలెను. జన్యుసంబంధమైన మరియు వైరల్ ఇంఫెక్షన్స్ వల్ల వచ్చిన వ్యాధికి 'రక్తమార్పిడి (blood transfusion)' ద్వారా మార్పును తేవచ్చు. ITP కి కార్టికో స్టీరైడ్స్ ని ఇస్తూ ట్రీట్ చేయవచ్చు.  ప్లీహవ్యాధులకు ప్లీహాన్ని తీసివేయడం తప్ప మరొక దారి లేదు. ఈ వ్యాధి తో బాధపడువారు బలమైన ఎక్సర్ సైజ్ లు, ఫుట్ బాల్, బాక్సింగ్ లాంటివాటికి దూరంగా ఉండాలి. అది internal bruising కు దారి తీయవచ్చు. ఆల్కహాలుకు స్వస్తి చెప్పాలి, అది పళ్ళెరాల తయారీ పై ప్రభావం చూపవచ్చు. యాస్పిరిన్, ఇబూప్రొఫెను లాంటి మందులను డాక్టర్ల సలహాపై మాత్రమే తీసుకోవాలి, ఎందుకంటే అవి పళ్ళెరాల function పై ప్రభావం చూపుతాయి. ఇవి తీసుకోవలసిన జాగ్రత్తలు.