గౌతమి

గౌతమి

Monday, February 10, 2020

మధురవాణి-అమెరికా అంతర్జాల పత్రిక_జనవరి సంచికలో నా వ్యాసమధురిమ "సంక్రాంతి"

"మాలిక" అంతర్జాల మాస పత్రిక జనవరి-2020 సంచికలో నా వ్యాసం_ ||భక్తి మాలిక తిరుప్పావై||


ఆధ్యాత్మికం
.
|| భక్తి మాలిక తిరుప్పావై ||

.
BY EDITOR · JANUARY 1, 2020 maalika.org
.
రచన: శ్రీసత్య గౌతమి
.
కడలిలో మహానదులు కలిసిపోయేట్లు విష్ణుభక్తి అనే కడలిలో నిరంతరంగా సాగే అలే “గోదా”. విష్ణుభక్తిని చిత్తము నందు ధరించిన భట్టనాధుడికి ఆ భక్తే తులసీవనాన ఒక పాపగా దర్శనమయ్యింది. ఆ పాపే, విష్ణుచిత్తుడు బిడ్డగా పొందిన “కోదై (తులసి మాల)”. ఆమె యే ఈ “గోదా”. నిరంతర విష్ణుభక్తి కలబోసిన వాతావరణం లో పెరిగిన గోదా, కృష్ణతత్వాన్ని శోధిస్తూ ప్రణయతత్వం అనే నావలో ప్రయాణం మొదలుపెట్టి అచంచలమైన ఆరాధనా, భక్తి, విశ్వాసాలతో శ్రీరంగనాధుడిని వశపరుచుకున్నది. ఆ శ్రీరంగనాధుడినే పెండ్లాడి అతనిలో ఐక్యమయి మోక్ష్యానికి ప్రణయారాధన ఒక సాధనమని లోకానికి చాటి చెప్పినది గోదాదేవి. అంతేకాదు ధనుర్మాస వ్రతాన్ని ఒక నోములా తాను చేపట్టి తన చెలికాండ్రతో కూడా చేయించినది. ఆ విధానాన్నంతా ముప్ఫై పాశురాలుగా ప్రబంధ కావ్యాన్ని రచించి మనకు అందించినది. భోగి పండుగ రోజున రంగనాధుని పెండ్లాడినది. ఆమె కళ్యాణము అయ్యాకే మనుజుల కళ్యాణాలు మొదలవుతాయి, అందుకే భోగి పండుగ భోగి మంటలకే కాదు, గోదా కళ్యాణానికీ ప్రసిద్ధి. తిరుపతిలో సైతం ధనుర్మాసం మొదలైన నాటినుండీ గోదాదేవి రచించిన ప్రబంధం ‘తిరుప్పావై’ (పాశురాలు) నే పాడుతూ స్వామివారిని సేవిస్తుంటారు.
.
పరమాత్మను చూడాలనుకొనే ఆత్మను కలిగివున్న వారికి ఒక వరంగా లభ్యమయ్యేదే ధనుర్మాస వ్రతదీక్ష. అట్టి వ్రతదీక్షను బూనినవాళ్ళెప్పుడూ ఆ గోదాదేవి ఆశీస్సులను పొందివుంటారు. గోదాదేవెలాగ తన చిత్తాన మహావిష్ణువును ధరించినదో అలా ఆ మహావిష్ణువును చిత్తాన ధరించిన ప్రతి ఒక్కరికీ పరమాత్మను చూడడం సులభసాధ్యమే అని తాను గోపీ వేషధారియై వ్రతమాచరించి, తన స్నేహితురాండ్ర చేత కూడా వ్రతమాచరింప జేసెను. తద్వారా ఆ వ్రత విధానాన్ని, నియమాలను లోకానికి 30 పాశురాలుగా తిరుప్పావై అనే పేరిట రచించి, అందించినది. భూమి మీద మనుజులందరూ తరియించాలనే సాక్ష్యాత్తు భూదేవే కోదై (గోదాదేవి) గా దక్షిణ తమిళనాడులో శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తునకు పాపగా అవతరించినది.
.
శ్రీకృష్ణ తత్వాన్ని శోధించి సాధించుకున్న గోదాదేవి జ్ఞానము, భక్తి, వైరాగ్యములనే ఆభరణాలను ధరించి, స్నేహితురాండ్రకు కూడా బోధిస్తుంది. అంత:కరణ స్నానమాచరించమంటుంది. ఆ నారాయణుడు ఇహ లోక సంపదలను ఇచ్చువాడే కాకుండా, ఆధ్యాత్మిక సంపదలను కూడా ఇచ్చువాడు. భూమి మీద పుట్టినందులకు అవసరాల నిమిత్తమూ ఇహ లోక సంపదలు అవసరం. వాటి సముపార్జనలో నిరంతరము మునిగి ఆద్యాత్మిక సంపదను ఆర్జించడం విస్మరిస్తే మనుజుడు పరమాత్మను చూడలేడు. అందుకోసం మనుజుడు తన ఆత్మనే రేపల్లె జేసి, అందు శ్రీకృష్ణుని నిలిపినప్పుడు తాను తప్పకుండా పరమాత్ముని చూడగలడనీ, అందుకు అంత:కరణ శుద్ధి (అనగా ఇహ లోక సంపదలను వదలడం) అవసరమని బోధించినది గోదా. అంతేకాదు, “ఇది భగవంతుని పొందాలనే ఆర్తితో చెయ్యాలసిన వ్రతమే తప్పా…ఇది ఒక సాధన కాదు, తపమూ కాదు, నిరంతరం సాగే సముద్రం అనీ, దానిలో పుట్టే అలలవలే భగవంతుని అనుభూతులు కలుగుననీ” వ్రత ఫలితాన్ని కూడా ముందుగానే సూచించినది ఆ తల్లి.
.
చేస్తున్న ప్రతి పనిలోనూ శ్రీకృష్ణుని దర్శించమంటుంది గోదాదేవి, ఆ విధంగా మనుజుడు మంచి పనులకే పూనుకొంటాడు గానీ, చెడుకి పూనుకోడు. అలాగే దాన ధర్మాలు చేసేటప్పుడు కూడా శ్రీహరికి అర్పిస్తున్నట్లు భావించమంటుంది ఎందుకంటే సర్వం విష్ణుమయం, ఆ మహావిష్ణువు అందరికీ ఇచ్చువాడు, ఆయనదే పైచెయ్యి. అట్టి మహావిష్ణువుకు అర్పించు చోట “నేను, నా వల్ల, నేను గాబట్టి” వంటి అహంకార, మమకారాలు మనుజునిలో పుట్టకుండా వుంటాయని వివరించినది గోదాదేవి. అంతే కాకుండా బాహ్య అలంకరణలకు (అనగా కంటికి కాటుక, తలలో పువ్వులు మొదలైనవి) దూరమవ్వమన్నది, ఆ పువ్వులను భగవంతునికే అర్పించమన్నది. దాని వలన, మాకేదీ వద్దు, నీవు తప్పా అనేటువంటి జ్ఞానంతో కూడిన భావన అలవరుతుందని బోధించినది. పెద్దలు చెప్పిన ఆచరణలను పాటించమనీ, ఇతరులపై చాడీలు చెప్పకూడదనీ, ఎప్పుడూ సత్యములనే పలుక వలెననీ, శక్తికి మించినదైనా అవసరమైనప్పుడు ఎదుటి వారికి సహాయము చెయ్యగల ప్రయత్నం చెయ్యవలెననీ పాశురములో నియమావళిగా చెప్పినది. దీనివలన అంతా నాదే అన్న భావన మనుజునిలో తొలగి, అంతా ఆ పై వాడిదే, నాదేమీ లేదన్న విషయాన్ని మనుజుడు గ్రహించగలడన్నది. నా ద్వారానే ఆ సర్వాంతర్యామి ఈ పనిని చేయిస్తున్నాడనే భావన కలుగును అని తన నియమావళి యొక్క ఆంతర్యాన్ని బోధించినది.
.
గోదాదేవి చెప్పిన మూడవ పాశురం ఆశీర్వచన పాశురం. ఆవిడ చేసిన శుభసంకల్పం. నెలకు మూడువానలు పడాలనీ, వరి చేలలోని చేపలు నిండుగా ఎగిరెగిరి పడుతుండాలనీ మరియు గోశాలలో పాలు సమృద్ధిగా వుండాలని. అంతే కాకుండా ఆద్యాత్మికంగా తానిచ్చిన గొప్ప సందేశమేమిటంటే ఆచార్యులు గోవుల్లాంటివారు. గోవులు పాలతో సమృద్ధిగా వున్నటుల, ఆచార్యులు జ్ఞానముతో సమృద్ధిగా వుందురు కావున వారిని అనుసరించి జ్ఞానాన్ని పొందమన్నది. బలి చక్రవర్తి నుండి మూడు అడుగుల భూదానమడిగిన నెపముతో అతని నుండి అహంకారము, మమకారము, అవిద్య (అజ్ఞానము) ను తొలగించి పాతాళానికి నొక్కి, బలికి వాటినుండి మోక్షాన్ని ప్రసాదించాడు వామనుడు. అలాగే ఆ పరమాత్ముని సహాయంతో అహంకార, మమకార, అజ్ఞానాలను తొలగించు కోవడానికి ఆచార్యులను ఆశ్రయించమని మరొక నియమాన్ని బోధించినది.
.
ఈ వ్రతమాచరించుటకు మరొక ముఖ్యమైన నియమము “అనసూయ” గా వర్ధిల్లడం అనగా అసూయను రూపుమాపుకోవడం. ఇతరుల సౌఖ్యాలను చూసి ఓర్వ లేకపోవడమనే లక్షణాన్ని పూర్తిగా తొలగించుకోమంటుంది గోదాదేవి. అది ఈ వ్రతం ద్వారా ఎటుల అలవరుననిన, తాను వ్రతాన్ని అంత గొప్పగా చెయ్యలేక పోయినా తనతోటి వారెవరైనా ఈ వ్రతాన్ని సమృద్ధిగా చేయుచున్నప్పుడు అసూయ చెందకుండా, నిండు మనసుతో హర్షించడం గోదాదేవి నేర్వమంటుంది. అది ఎడారా, మెట్ట భూమా, నందనవనమా అనే తేడా లేకుండా ఆ మేఘుడు అంతటా ఎలా వర్షించునో మన మనస్సుకూడా తన, పర బేధాలు లేని… అంత నిశ్చలతను పొంది వుండాలనే నియమాన్ని పెట్టింది.
.
ఇలా స్నేహితురాండ్రకు మంచి విషయాలను బోధిస్తూ గోప వేషధారియైన గోదాదేవి మహావిష్ణువున్న దివ్యదేశాన పరమాత్మలో లీనమయ్యున్న పదిమంది ఆళ్వారులను గోపికలుగా భావిస్తూ వారందరినీ వ్రతము ఆచరించుటకు ప్రతిదినమూ పిలుచుచున్నది. స్నేహితురాలు “శుభ కర్మలను చేయు చున్నప్పుడు ఆటంకములు సహజము. అలా మనము వ్రతదీక్షలో చవి చూచెదమేమో” అనే ఆలోచనను వ్యక్తము చేసినది. అప్పుడు గోదాదేవి ఇటుల చెప్పదొడంగెను. “చేయు పనులలోనే కాదు, ఆలోచనలో కూడా కీడు శంకించ రాదు, అదే అవరోధము గా పనులకడ్డమగు”నన్నది. మొదటి గోప కిశోరము, కర్మలలో మూడు కర్మలుగా ఇమిడి వున్న సంచిత, ప్రస్తుత, ఆగామి కర్మలను వివరించి భగవంతుని అనుగ్రహం తో చెడు కర్మలు తొలుగునంటుంది అనగా చెడు ఖర్మలను తొలగించుకొనినా, ఆ భగవంతుని అనుగ్రహం కలుగుతుందని అర్ధము అని ఒక గోప కిశోరమంటే, పూర్వ జన్మలో ఏమి చేసినా, ఈ జన్మలో శుభకర్మలను చేయవలెనన్న జ్ఞానాన్ని తప్పకుండా కలిగి వుండాలి, అసత్యము లాడకుండా ధర్మాన్ని పాటించు తోడనే భగవంతుని అనుగ్రహము కలుగునని మరొక గోప కిశోరము చెప్పును. ఈ గోష్ఠి ద్వారా “మనసా, వాచా, కర్మేణా ఆ నారాయణునకు ఆత్మార్పణము గావించునప్పుడు, అన్ని చెడు ఖర్మలు తొలగుననీ, ఆ పరమాత్నుని వద్ద ఎల్లప్పుడూ చిన్మయానందమే వుండునని, ఇదియే శరణాగతి రహస్యమని” చెప్పినది గోదాదేవి.
.
జీవుడిని యోగ్యుడిని చేసి పరమాత్మునికి అందించే వాడు ఆచార్యుడు. అలా గోదాదేవి యే ఆచార్యునిగా కూడా వ్యవహరించి, గోపికలందరినీ లేపి తన గోష్ఠిలో కూర్చో బెట్టుకొని, వ్రతాన్ని ఆరంభిద్దామనుకొంటుంది. సూర్యోదయానికి ముందు పక్షుల కిల కిలా రావాలను వర్ణిస్తూ, ఆ సమయానే తెల్లటి విష్ణు శంఖము “విష్ణు సేవకు వేళయింది, రండి రండని ఆ పక్షులను పిలుచుచున్నది…అలానే మనలనూ పిలుచుచున్నది లెండు లెండని…” విష్ణుసేవకు గోపికలను పిలిచెడిది ఆ గోదాదేవి. “ప్రకృతి మనకిచ్చిన అహంకార, మమకారాలనే విష పదార్ధాలను, పూతన విషస్తన్యాలను పీల్చేసినట్లు ఆ శ్రీహరే హరించును. శకటాసురుని వంటిది మన దేహము, అది అహంకార, అజ్ఞానములనే చక్రములపై నడుచును. ఆ చక్రముల కీళ్ళను విరగ గొట్టగలవాడే ఆ మహావిష్ణువు, యోగ నిద్రలో వుండి ప్రపంచానంతా వీక్షించుచున్నాడు, అట్టి శ్రీహరిని, సేవింతము రండు రండనీ…” గోదాదేవి ఎలుగెత్తి గోపికలను పిలిచినది. శ్రీహరి గుణాలను శ్రవణము ద్వారా, కీర్తన ద్వారా వింటూ పాడుతుండేటప్పుడు లోపలి నుండి మార్పు సంభవిస్తుందనే సూత్రమును తెలిపినది గోదాదేవి. రేపల్లెలో గోపికలు నిరంతరమూ కృష్ణ తలంపుతో పట్టుదలగా చల్ల చిలుకుతూ అతని పై భక్తి విశ్వాసాలను సాధించి అమృతమైన వెన్న రూపములో శ్రీకృషునిని పొందారు, అటులనే మనమునూ శ్రవణముతో, ధ్యానముతో శ్రీకృష్ణుని పొందెదము రమ్మనెను గోపకిశోరాలను. మూడవ గోపిక, పిలిచిన వెంటనే రాదు. తన భక్తి విశ్వాసాలకు మెచ్చి ఆ కృష్ణుడే తన చెంతకు వచ్చుననే ఆత్మ విశ్వాసాన్ని కలిగి వుంటుంది. అట్టి గోపిక తప్పకా తమతో వుండాలని కాంక్షిస్తూ వుంటారు గోదా మరియు ఆమె స్నేహితులు. కోరికలను పూర్తిగా వదిలేసి, ఎవరు ఆత్మలో పరమాత్మను పొందుతారో వారిని “స్థితప్రజ్ఞులు” అని అంటారు. అట్టి స్థితప్రజ్ఞతను కలిగి వుండి, ధ్యానంలో మునిగి పోయిన నాల్గవ గోపికను లెమ్మంటారు గోదా అమ్మవారు. ఆమె చుట్టూ దీపాలు, అగరువత్తులు వెలుగుతూ వుంటాయి, ఆమె ధ్యానంలో వుంటుంది. దీపము జ్ఞానానికీ, అగరొత్తుల సువాసన ఆ జ్ఞానం యొక్క అనుష్ఠానానికి నిదర్శనం. శ్రీకృష్ణ ధ్యానంలో పొందే జ్ఞానంతో స్థితప్రజ్ఞతను కలిగి భగవదనుభవ ఆనందాన్ని పొందేటప్పుడు, ఆ జ్ఞానమే ఆ జీవికి కవచమవుతుందనీ, ఈ గోపిక ద్వారా ఆ తల్లి మనకు తెలియపరుస్తుంది. ఆ పై ఐదవ గోపిక వద్దకు పోయి “నోము నోచి భగవంతుని పొందిన ఆనందసాగరాన సుఖమును అనుభవిస్తున్న ఓ గోపికామణీ … తలుపును తెరువుము, తలుపు తెరవుకన్నా ఫర్వాలేదు, శ్రీసూక్తులను మాకు చెప్పుమ”ని ఆ ఆండాళ్ళు తల్లి కోరినది. “కుంభకర్ణుని వలె యోగ ధ్యానంలోనే వుండక, మా చెంతకొచ్చి నీ శ్రీసూక్తములతో మాకు జ్ఞానాన్ని ఒసగి వ్రతమును ఆచరింపజేయుమ”ని తల్లి కోరినది అనగా ధర్మశాస్త్రాలు తెలిసిన ఆచార్యుని వలెనే జ్ఞానము కలుగునని గోదాదేవి సూచించినది. శ్రీకృష్ణుని పై అనేక తిరునామములను పాడుతూ ధ్వని చేస్తూ లేపబోయినా, లేవకుండా కృష్ణ ధ్యానములో మునిగిపోయివున్న ఆరవ గోపిక మహా సౌందర్య లహరి. ఒక్క దోషమైననూ లేని గొప్ప వంశాన పుట్టి ఆ శ్రీకృష్ణ అనుభవ సౌందర్యాన్ని పుణికి పుచ్చుకొనుట వల్ల ఆమె మరింత సౌందర్యవంతురాలయినది. ఆ శ్రీకృష్ణ అనుభవ సౌందర్యాన్ని తమకు కూడా పంచి తమచే వ్రతాన్ని ఆచరింప జేయుమనీ, గోదా గోపికలు వేడుకున్నారు. అటు పిమ్మట ఏడవ గోపిక వద్దకు పోయి ఆమె మొద్దు నిద్దర (కృష్ణ ధ్యానము) చూచి, గోవుల పాల పొదుగుల నుండి ప్రవాహంలా స్రవిస్తున్న పాలలా సాగి పోతున్న ఆమె కృష్ణ మంత్ర ధ్యానమును స్నేహితురాండ్రకు జూపి, కృష్ణ మంత్రమును విరామం లేకుండా జపించమనీ, అదియే జన్మకు సార్ధకతని వివరిస్తూ, ఆ గోపీ భక్తురాలి వాకిట నిలబడి “నీ కృష్ణభక్తి క్షీర సాగరాన మేమునూ తడిచి ముద్దయితిమి, ఇప్పటికైననూ ధ్యానము నుండి లేచి మా గోష్ఠిలో చేరి వ్రతాన్ని పూర్తి చేయుటకు సాయపడమని” కోరుతూ, శ్రీరాముని సుగుణాలను కీర్తించినది గోదా. ఆ పై రావణుని పది తలలను మట్టు పెట్టిన శ్రీరామ శౌర్యమును, బకాసురుని నోటిని రెండుగా చీల్చిన చిన్ని కృష్ణుని లీలామృతాన్ని కొనియాడుతూ ఎనిమిదవ గోపికాలలామను లేపిరి. ఆమె కనులు తెరిచి అంతలోనే శ్రీకృష్ణుని యెడబాటునోపలేక కృష్ణుని వెతుకుతుండగా ఆమె కన్నులు తామర పూవులపై అలసి వాలిన తుమ్మెదలయినవి. అందులకు గోదా తమతో కలిసి జలకాలాడి కృష్ణగోష్ఠితో సేదతీర రమ్మని పదే పదే వేడుకొన్నది.
.
యోగులనూ, మునులనూ, ప్రకృతి కాంతను సైతము భగవదారాధన కొరకు నడిపించగల తొమ్మిదవ గోపిక ఉష:కాల సూచనలను పూర్తిగా మరిచి తన యింట దిగుడు బావిలో విచ్చుకున్న తామర్లలో, కమలాలలో ఆ కమలనాధుడిని దర్శించుకుంటూ మైమరిచింది. గోదాదేవి ఆమెను మేలుకొలిపి “ఆ కమలనాధుడిని మధురమైన స్వరాన మేమూ నీతో కలిసి కీర్తించెదము, మా ఈ వ్రతం ఫలించగలదు, రావమ్మా…రా..” అని కొసరి కొసరి పిలుచుకొన్నది గోదాదేవి. అచ్చటి నుండి ఈ పూబోణులందరూ శ్రీకృష్ణ మురళీనాదంలో రవమై పోయిన పదవ గోపికా రమణి వద్ద ఆగి, గొల్లుమని నవ్వారు. ఆ శబ్దాలకు తృళ్ళి పడి బాహ్య ప్రపంచాని కొచ్చిన గోపికామణి, తలుపులకు గట్టిగా గడియలు పెట్టినట్లు ధ్వని చెయ్యవద్దని వారిస్తూ మరలా గోదా మరియూ ఆమె స్నేహితురాండ్రతో కలిసి శ్రీకృష్ణుని కళ్యాణ గుణాలను వింటూ వారి వ్రతాన్ని శుభప్రదం గావించ జేరినదిట. ఇలా భగవదానుభవాన్ని ఏకాంతంగా ఒక్కరే అనుభవించకుండా పదుగురితో కలిసి పంచుకోవాలనే విషయాన్ని ఈ వ్రతంలో వివరిస్తూ, శ్రవణ, మనన, ధ్యానాల ద్వారా భక్తి యోగాన్ని ఎలా అనుసరించాలో గోపికలను తట్టి లేపుతూ మన కోసం పాశురాలను లిఖించినది ఆ తల్లి గోదాదేవి. ఈ వ్రతం ద్వారా సాక్ష్యాత్తు ఆ భగవంతుడినే పెండ్లాడి అతనిలో ఐక్యమయింది. గోదాదేవి అణువణువూ శ్రీకృష్ణుని భక్తి సాగరాన తేలియాడినది. అతని పై ఆరాధనా, భక్తి, విశ్వాసాలనే దారంతో పూల మాలలను అల్లి భగవంతుని మెడలో చేర్చినది. అతనిని చేరే మార్గాన్ని కూడా తిరుప్పావై కావ్య రూపాన రచించి తానే ఒక భక్తి మాలిక అయిన సుందర చైతన్య మూర్తి, మోక్ష ప్రదాయిని గోదాదేవి.

Saturday, November 2, 2019

ఆయన మనల్నాడించడంలేదు...మనమే ఆడుతున్నాం.

జీవులు శరీరమనే ఉపాధి ని భగవంతుని కృపతో పొంది, ఆ ఉపాధి ద్వారా కాలానికి అనుగుణంగా దానికి బద్ధులై ప్రారబ్దాలను పూర్తిచేసుకొని వెళ్ళిపోతారు. దీంట్లో కాలానికి వున్న ప్రాముఖ్య్తత అత్యంతం. ఎందుకంటే కాలాయాపన జరిగినా, కాలం దాటిపోయినా ఆ ప్రారబ్దాన్ని పూర్తిచేసుకోవడానికి అంతరాయం కలిగినట్లే. మళ్ళీ ఆ కాలం కలిసిరావడానికి ఎన్ని జన్మలు పట్టచ్చో...చెప్పలేం. మళ్ళీ ఆ కాలం వచ్చునో లేదో??? అది మళ్ళీ ఫిక్సుడు డిపాజిట్ లో పడుతుంది. అట్టి కాలాన్ని సాధన ద్వారా గుర్తించి ఈ శరీరమనే ఉపాధి సహాయంతో ప్రారబ్దాలను పూర్తిచేసుకోమనే శరీరాన్ని శివుడు మనకు ప్రసాదించాడు. ఈ సౌలభ్యం ఇతర జీవరాశులకు లేదు.
.
84 లక్షల కోట్ల జీవరాశులు ఈ భూమిమీద ఉన్నాయి. మట్టిలోపలే పుట్టి, మట్టినే తింటూ, మట్టిలోనే పెరిగి, మట్టిలోనే చచ్చిపోయే జీవికి కనీసం వెలుగుని చూసే అవకాశంవుండదు. మట్టిలోనే వుండే దానికి కళ్ళు అవసరం లేదు, కాబట్టి దానికి కళ్ళులేవు ఇహ దానికి వెలుగెందుకు? మట్టిలో వుండే ఈ జీవికి మెదడు ఇవ్వబడలేదు, అది దైవం గురించి ఆలోచించదు. మట్టిలోపల చీకట్లో వుండే ఆ జీవికి ఊర్ధ్వముఖంగా చూసే భాగ్యముండదు ఎందుకంటే కళ్ళులేవు. కాబట్టి ఈ జీవికి ప్రారబ్దాలను మొయ్యడమే తప్పా...వాటిని తొలగించుకొనే అవకాశం మట్టిలోవుంటుండగా లేనేలేదు. అది పొందాలంటే కొన్ని లక్షల సంవత్సరాలు మానవజన్మకు ఎదురుచూడాల్సిందే.
.
క్షీరదాలలో ఎలుకలువున్నాయి, మనిషివున్నాడు అంత మాత్రం చేత మనిషి, ఎలుక ఒకటి కాదు. ఎలుక అడ్డంగా పెరిగే జంతువు, మనిషి ఊర్ధ్వముఖంగా పెరుగుతాడు, తనకన్నా ఎంతో ఎత్తును చూస్తాడు, సాధన ద్వారా భగవంతుని చూడగలిగే, చేరుకోగలిగే భాగ్యము కేవలం మానవునికి మాత్రమే వుంది. ఎలుకకు లేదు. అలాగని ఏనుగు ఎత్తుగా పెరుగుతుందికదా, ఏనుగుకుందా అని ప్రశ్నవెయ్యొచ్చు. ఏనుగు సేవలను అందించే భాగ్యాన్ని పొందింది. ఎలుకకు ఆ భాగ్యమూ లేదు. ఇలా జంతువులకు లేని భాగ్యాలెన్నో మానవుడికిచ్హాడు ఆ పరమాత్ముడు, తనను గుర్తించమని. అయినాసరే మానవుడు ఆ పని చెయ్యకుండా కుడితిలో పడ్డ ఎలుకలా ఇహలోక సౌలభ్యాలలో కొట్టుమిట్టాడుతూ కాలాయాపన చేస్తే ఆ మానవుడికే నష్ఠం. కనీసం ఇతరులెవరైనా సత్యాన్ని గ్రహించి తమదారిలో తాము సాధన చేసుకుంటున్నప్పుడు నీచ ఎలుకల్లా, పనికిరాని బొద్ధింకలా, పట్టిపీడించే చెదపురుగుల్లా పాడుచెయ్యకూడదు. దీనివల్ల వారికి కాలాయాపన జరిగి నష్ఠపోతారు గనుక, ఆ నష్ఠానికి వీరు బాధ్యులయి మరుజన్మల్లో మానవరూపమున్నా నికృష్ఠులుగా, లోకకంఠకులుగా చెదపురుగు మరియు నీచంగా కలుగుల్లో పెరిగే ఎలుకల లక్షణాలతో పుట్టగలరు. ఇట్టివారు ఊర్ధ్వముఖంగా పెరిగినా, భగవంతుని చూడలేరు, క్రింద మట్టిపురుగువలెవుందురు. తమమలమూత్రాలతోనే ఒకదాన్నిమరొకటి గుర్తు పట్టుకొని బ్రతికే ఎలుక గుంపుల్లా జీవించెదరు, పుష్ఠికరమయిన చెట్లను తినేస్తూ బ్రతికే చెదలా జీవించెదరు. ఈ జీవరాశుల్లాగే మానవళికేమాత్రం ఉపయోగంలేని నిర్భాగ్యపు జీవితాలు జీవించెదరు. ఇలా ఎన్నో..ఎవరిలోనయినా ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయంటే శిక్ష అనుభవిస్తున్నారని అర్ధం.
                                                 
ఇదే కాలానికున్న మహిమ. నాడు నువ్వు ఒకరికి చేసేదానికి వెంటనే శిక్షపడకపోవచ్చు, కాలం ఎప్పుడోకమారు ఏదోకరూపంలో ప్రతీకారం తీర్చుకుంటుంది. కనీసం అప్పుడు నువ్వు తెలుసుకున్నాకూడా -సన్నని సాలెపురుగు ప్రోగులాంటి సహాయాన్ని నీకందించి క్రిందపడకుండా ఆ పారిజాతన్ని రక్షించినట్లు రక్షిస్తాడు ఆ దేవుడు. లేకపోతే ఇంతే సంగతి.
.
నరకం ఎక్కడో లేదు!
.
Gauthami Jalagadugula
.
Picture- Google courtesy. Not mine.

నా మరో రచన, వార్త వారి సౌజన్యంతో- "మనసులో చోటు"....

Thursday, April 5, 2018

మానవధర్మాలను విత్తనాలుగా నాటి ...బాబా దగ్గిర ఎప్పుడూ తోడూ-నీడగా ఒక ఇటుక తన వెంబడే వుండేది. అది ఒక భక్తునియొక్క చేతిలో విరిగిపోగా బాబా గారు నొచ్చుకుంటూ అనిన మాటలివి. "ఇది నా తోడూ నీడ ఈరోజువరకు. దీనివల్లే నేను నన్ను అన్ని ఆత్మలతోనూ అనుసంధానమయివున్నాను, ఇది ఇప్పుడు ముక్కలయిపోయింది". నాటి రోజునుండి ఆయన ఏదో ఒక సంధర్భంలో తన నిష్కృమణ (ఈ లోకం నుండి) గురించి చెబుతూనే వున్నారు భక్తులకు అర్ధం కాని రీతిలో. తన సన్నాహాలను చేసుకుంటూనే వున్నారు, భక్తులకు విధులను అప్పజెప్పుతూ, అభయాలను వొసంగుతూ వున్నారు. గబ గబా తాను అనుకున్న పనులను సూచనలిస్తూ చేయించారు. బాబాగారు ఒక అనుభవం నమ్మినవారికి.
.
తన ఆత్మను ప్రతి ఆత్మలోనూ అనుసంధానం చెయ్యగలగడం దైవాంశ సంభూతం. ఒక పుణ్యమానవాత్మమకు దైవాంశాలు లభ్యమవ్వడం యోగులకు, గురువులకు మాత్రమే జరిగే వ్యవహారం. బాబాగారు బాల బ్రహ్మచారి గా సన్యాసించారు. భిక్షాటన ద్వారా జీవించడం సన్యాస ధర్మం. కానీ ఈ సన్యాసి ఏ కొండాలోకో కోనల్లోకో లేక ఏ అద్భుతమైన దేవాలయాల్లోకో పోయి తపస్సు చేసుకుంటూ మహిమలు చూపలేదు. ప్రతి ఇంటితోనూ తాను సంబంధం పెట్టుకున్నాడు, మనుష్యుల అజ్ఞానాన్ని పారద్రోలి, వారి మనస్సులను పరమాత్మ వైపుకు తన ద్వారా మళ్ళించడం తన కర్త్వ్యం గా చేసుకున్నాడు. బీదా, బిక్కిని ఆదరించాడు. వారికి భోజనం పెడుతూ వారిలోని ఆత్మజ్యోతిని ప్రకాశింపజేశాడు. దానికి తానే ఒక సేవకుడయిపోయాడు. తన ఆత్మను ఎల్లప్పుడూ భగ్వన్నామ స్మరణలో ఉంచుతూ ఇంద్రియాలపై స్పష్ఠతను ఏర్పరచుకొని వాటిని అదుపులోవుంచుకున్నాడు. ఇది కేవలం బాహ్యానికి ఏమాత్రం ప్రాముఖ్యం ఇవ్వకుండా అంతర్ముఖులైన వాళ్ళకి మాత్రమే సాధ్యమయ్యే పని, కష్ఠమయిన పని. అది యోగ్యులయిన యోగులకే సాధ్యం. అది దైవ సంకల్పం. ఆ దేవుడు ఇచ్చేవరం.
.
ప్రతి ఆత్మతోనూ అనుసంధానం మయి ... వాటి అవసరాలను తెలుసుకొని అవి తీరుస్తూ ప్రజలకు కనిపించాడు తద్వారా ప్రతి ఆత్మ ఏకాత్మా అని అందులో పరమాత్మ గలడని చూపించాడు, అంతే కాకుండా ప్రతి ఆత్మ (అనగా మనిషి) మరో ఆత్మను (జంతువులతో సహా) ఎలా ఎందుకు భూతదయ కలిగివుండాలో తను పాటించి అందరికీ చూపించి, మానవధర్మాలను విత్తనాలుగా నాటి, దానికి నీళ్ళుపోసి చెట్లను చేసి ఆ కొమ్మల నీడలో బ్రతకమని తన సగుణ రూపాన్ని చాలించాడు. నిర్గుణ రూపంలో వుండి ఇంకా కాసుకుంటానని మాటిచ్చాడు. ఇవన్నీ పరమాత్మ లీలలు. తన లీలలను పండించుకోవడానికి ఆయన ఎన్నో అవతారాలను సృష్టిస్తాడు, మనకు కనువిప్పు చేస్తాడు. అటువంటి అద్భుతమైన దైవ సృష్ఠి సద్గురు షిరిడీ సాయిబాబా.Sunday, February 25, 2018

ఓ యజమాని...(కధ)

ఓ యజమానున్నాడు. వాడికో గాడిదుంది. ఆ గాడిదకి ఆడు కావాలి. గాడిద ఫ్లాష్ బ్యాక్ లో అందరి బట్టల మూటలూ మోసి, మోసి అలసిపోయింది, అలసిపోయినా ఎవరూ సరిగ్గా తిండి పెట్టేవారు కాదు, చాకలిరేవుదగ్గిర ఎదైనా దొరికితే తిన్నదీ,లేకుంటే యజమానులు పారేసే గంజినీళ్ళు తప్పా. ఆ గాడిద తప్పించుకొని అడవిలోకి పారిపోయింది. కట్టెలెకొట్టేవాడిని కలిసింది, వాడు కట్టెలమోపు దీని పై పెట్టి ఇంటికి మొయ్యమన్నాడు. మోసింది. వాడికిది సుఖమనిపించింది. సరే ఈ గాడిదని నేను ఉంచేసుకుంటే కట్టెలుమొయ్యడానికి పనికొస్తుందీ అని ఉంచేసుకున్నడు. గాడిదకి సంతోషమే. టైం కి వున్నచోటకే తిండీ, ఎక్కడా పనిచెయ్యక్కర్లా, అప్పుడప్పుడే కదా కట్టెలు మోసేదీ అని హ్యాపీగా సెటిల్ అయిపోయింది. ఇంటిపట్టునే వుండడంవల్ల గాడిదకు చిన్న చిన్న పనులు చెప్పేవాడు, అవి చేసేసి, తినేసి కూర్చొనేది.
.
ఇంతలో యజమానికి ఒక లాటరీ టికెట్టు తగిలింది. ధనికుడయ్యాడు, గాడిద వడ్డాణం చేయిస్తాడేమో అని అడిగింది. డబ్బుల్లేవు అన్నాడు. చినబుచ్చుకున్నది. ఇంతలో డబ్బులుపెట్టి ఒక పంచ కళ్యాణిని ఇంటికి తెచ్చాడు. పంచకళ్యాణి అందంగా, మిల మిలా మెరిసిపోతోంది. దానికొచ్చే పని రేసుల్లో గెలవడం. ఆ పంచకళ్యాణి ద్వారా తాను ఇంకా ధనికుడవాలని యజమానిగారి ఆశ. తన పెంపుడు గాడిదకున్న ఆశాపాశాలు యజమానిగారికీ ఉన్నవి.
.
పంచకళ్యాణికి పెట్టే పెట్టుబడి, ఫుడ్డు, చూసే విధానము, దానికోసమని ప్రత్యేకంగా కట్టించిన శాల అబ్బో ... అంతా ఒక రేంజు. గాడిదకు బాధేసింది. యజమానిని అడిగింది. నాకూ అలాగే ఎందుకు చూడవు? పైగా దానితో నన్ను సమానంగా చూడాలి కదా? ... అని అన్నది. అన్నగారు ఎప్పుడూ కలల్లో నోట్లకట్టల్లోనే విహరించడం వల్ల..."పంచ కళ్యాణి తీసుకొచ్చేడబ్బు నాకు పంచప్రాణాలు, నీవల్లేమొస్తుందీ నాకు బూడిద" అన్నాడు. దానితో కోపమొచ్చేసింది గాడిదకు. అలిగింది. పంచకళ్యాణంటే కోపం, అసూయను పెంచుకున్నది. యజమానంటాడు "అది తీసుక్కొచ్చే డబ్బుతో మనిద్దరం హాయిగావుంటున్నాము కదా, ఇప్పడయితే నువ్వు ఆ కట్టెల్ని కూడా మొయ్యడం లేదు. ఏంటి బాధ???"
"అయితే మాత్రం నాకు గుర్తింపురావడం లేదు. అందరూ పంచకళ్యాణినే ఆదరిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు, పేపర్లలో వేస్తున్నారు, నువ్వు కూడా దాన్ని బాగా చూస్తున్నావు. ఇప్పటినుండీ, నాకు పెట్టే తిండి దానికి పెట్టు. అవసరం లేకపోయినా కట్తెలు మోయించు, ఆ రేసులకు నేను వెళ్తాను, డబ్బు సంపాదిస్తాను, వడ్డాణం చేయించుకుంటాను".
.
"అలా కుదరదు, అది తిన్నే గుగ్గిళ్ళు నువ్వు తిని అరిగించుకోలేవు, నువ్వు తాగే కుడితి అది తాగదు. నీ జాతి వేరు". అయినా సరే గాడిద ఒప్పుకోదు. రేసులకు బయలుదేరింది గాడిద. కట్టెలు మోపు పైన పెట్టుకొని పంచకళ్యాణి హాయిగా డెక్కలు శబ్ధంచేసుకుంటూ ఒక వెకేషన్ లా అడవంతా తిరుగుతోంది. యజమాని గాడిదను రేసుల్లోకి దింపాడు. అందారూ దిగ్బ్రాంతికి లోనయ్యారు, కొంతమంది ఆ దృశ్యం చూసి, ముఖం తిరిగి అక్కడికక్కడే పడిపోయారు. మీడియా రిపోర్టర్లు వచ్చేశారు. గాడిదకు ఫొటోలు తియ్యడం, దాన్ని చూపిస్తూ రిపోర్టర్లు హిందీ, ఇంగ్లీషు, తెలుగు, తమిళం భాషల్లో ఊదరగొట్టేస్తున్నారు, టి.ఆర్.పి. లను పెంచుకుంటున్నారు. గాడిదకు ఆ భాషలు అర్ధం కాలేదు, ఏం చెప్తున్నారో తెలియలేదు. అంతా మెచ్చుకుంటున్నారనే అనుకున్నది, ఎందుకంటే పంచకళ్యాణి రేసులో గెలిచినాక ఇలాగే దానిగురించి టీ.వీ.ల్లో వచ్చేది. తనకూ అలానే జరుగుతున్నదని భావించి నిలబడీ, కూర్చొనీ మరిన్ని ఫొజులు ఇచ్చింది. కానీ వాళ్ళు గాడిదను తీసికొచ్చిన తన యజమాని గురించి తీవ్రం గా స్పందిస్తున్నారనీ, పంచకళ్యాణిని మాయం చేసినందుకు యానిమల్ ప్రొటెక్షన్ వాళ్ళు, వన్యమృగ సం రక్షకులు, కోట్ల రూపాయల రేసుల్లో పాల్గొనే గుర్రపు జాతి అతి విశిష్ఠతమైనదనీ, వాటిమాయం వెనుక రాజకీయ, తీవ్రవాద, విదేశీ కుట్ర
వుందనీ... వాటన్నిటికీ తన యజమాని ఒక ఏజెంటనీ అక్కడికక్కడే తీర్మానించింది మీడియా.
.
దానికి బెంబేలయిపోయి పోలీస్, అటవీ మొదలైన శాఖలన్నీ హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. ఏనాడూ ఇలాంటి ఆలోచనే రాని తీవ్రవాదుల్లో కలకలం రేగి, ఇదేదో రాజకీయ కుట్ర..వెంటనే ఈ గాడిద గాడి ఏజెంటెవరో మనముందు హాజరు కావలె అని గన్స్ లోడ్ చేశారు. వీడియోలు రిలీజ్ చెయ్యడం మొరలెట్టారు, దానితో ఇండియన్ ఆర్మీ, సెంట్రల్ బ్యూరో అంతా అప్రమత్తమయ్యింది. శెలవుల మీదవున్న ఆఫీస్ర్లందరినీ డ్యూటీలో జాయినవ్వమని orders ను పంపారు. గాడిదలో ఏ బాంబో కూడా పెట్టి వుంటారని అనుమానించి గాడిదను అదుపులోకి తీసుకున్నారు. దాన్ని స్కాన్ చేసి, ఏది తేలినా, తేలక్పోయినా గాడిదను చంపేయమన్నారు. అప్పుడర్ధమయ్యింది గాడిదకు! తీవ్రవాదపు బెదిరింపులను అదుపులోకి తేవడానికి, ప్రజల్లోని భయభ్రాంతులను తొలగించడానికి మీడియావాళ్ళ టీ.ఆర్.పీ. రేట్లను అదుపులోకి తేవడానికి శాంతిభద్రతలకోసం విచారణకూడా పెద్దగా జరపకుండా ఏజెంట్ (గాడిద ఓనర్) పై షూట్  ఎట్  సైట్ ఆర్డర్స్ ని ఝారీ చేసింది.
.
నీతి: తనకు గాడిద ఎంత ముఖ్యమైనా గాడిద అడిగేవన్నీ చెయ్యరాదు.

Sunday, February 18, 2018

"ఎందుకిలా చేస్తున్నావ్?" - నా కవిత

పంచభూతాల అనురాగ సం'యోగం'తో ప్రకృతి ఎంత రమణీయంగా వుంటుంది? రాగధ్వేషాలకు అతీతమైనది. నిజానికి ఏ ప్రేమకూ అంతుచిక్కనిది. నిర్వికార, నిరహంకార, నిర్గుణం. అందుకే అందం. ఈ అందం జనన మరణాలకు అతీతం, నిశ్చలం. మహా పర్వతాలయినా, మహా సముద్రాలయినా కాల గర్భంలో కలిసిపోతాయి కానీ వాటి తేజస్సుని విడిచి. మహా జలపాతాలయినా కాలంతో పాటు అంతరిస్తాయి కాని వాటి సెలయేళ్ళకు దారులు వేసి. ఎంత మహా ఎడారులయినా ఒయాసిస్సులను సృష్టిస్తాయి మనిషి మనుగడకేసి. ఏ ఫలితాన్ని ఆశించి చేస్తున్నాయి ఇవన్నీ? 
.
ఈ అనంతమైన ప్రకృతి తన మనుగడను సాధించుకోవడమే తనను తానుగా మళ్ళీ మళ్ళీ సృష్ఠించుకోవడం. పునర్జన్మనిచ్చుకోవడం. ప్రకృతికి రాగధ్వేషాలు లేవు, కాబట్టి నిర్వికారం, సమానవ్యాప్తి పట్టణాలకయినా, అడవులకయినా కాబట్టి నిరహంకారం, దేనికీ లొంగదు, నిర్గుణం. అయినా దీనికీ పునర్జన్ముంది. ఇట్టి పంచభూతాలకు మానవ శరీరకుహరమూ ఆలవాలమే. మరి అంతటి రమణీయత మనిషిలోనూ వుండాల్సిందే కదా? వుంటే ఏ రూపంలో వుండాలి? మరి మనిషి ప్రకృతిలా నిర్వికార, నిరహంకార, నిర్గుణుడు కాడు కదా? వెలుగుతున్న సూర్యుడ్ని అమాంతం కబళించే చీకటిని పారద్రోలే చంద్రుని కాంతిలా, మనిషిలోని అంధకారాన్ని చీల్చుకొంటూ నడక ప్రయాణం ఆగకుండా ఎక్కడో దూరాన వున్న దివిటీని వెలిగిస్తే వచ్చే కాంతి రూపంలో వుంటుంది. ఆ కాంతి పేరే "ప్రేమ". వీడికి ఈ పేరు అర్ధమవుతుంది, కానీ దాన్ని చేరడానికే వీడికి దారి తెలియదు.
.Saturday, February 10, 2018

శివతత్వం-ప్రేమమయం


శివరాత్రి ఉపవాస, జాగరణా దీక్షాపరులకు-12 తేదీన న రాత్రి 10 తర్వాత త్రయోదశి విచ్చేసి, 13 న రాత్రి 12 వరకు. ఆపై చతుర్దశి-14 వ తేదీ అంతా వుండును రాత్రి 2.16 వరకు- దీక్ష విరమించుటకు. 
.
కొంతమంది చతుర్దశి దాటకుండా దీక్ష విరమించాలంటారు, మరి కొంతమంది చతుర్ధశి కూడా పూర్తయ్యాకే దీక్ష విరమించాలంటారు. ఎవరికి నచ్చిన విధంగా వారు 13.14 తేదీలు లేదా 13 వ తేదీ చేసుకొని తరించండి. శివపార్వతుల కళ్యాణ మహోత్సవాలలో పాల్గొనండి.
.
అది అక్కడికి కట్ చేస్తే... ఆనాటి (కాలేజ్ డేస్) నా జాగరణ రహస్యం- ప్రత్యేకంగా జాగరణకు మన సమరసింహం బాలకృష్ణ సినిమాలను ఎంచుకొనేవాళ్ళము. ఎందుకంటే ఆయన డాన్సులు, డైలాగులు బ్రెయిన్ సిగ్నల్స్ ని బ్లాక్ చేసి కంటిరెప్పల్ని ఆపేసి కంటిచూపుని నిలబెట్టేవి. దానితో జాగరణ అత్యద్భుతంగా పూర్తయ్యేది. ఈ సంవత్సరం ఏం చేస్తానో చూడాలి.
.
సరే ... దాన్నక్కడికి కట్ చేస్తే- శివుని ఆజ్ఞలేనిదే చీమయినా కుట్టదు. ఆ సదాశివుని కృపవుండడంవల్ల మాత్రమే నేను వ్రాయగలిగిన ఒక ఆర్టికల్ "శివతత్వం-ప్రేమమయం" _2018 శివరాత్రి సంధర్భంగా-
.
తప్పక చదువగలరు. తప్పులుంటే మన్నించగలరు. మీ అందరకూ శివరాత్రి శుభాకాంక్షలు.