గౌతమి

గౌతమి

Thursday, January 15, 2015

ఎప్పటికప్పుడు, ఏ జన్మకాజన్మ లో కర్మవిముక్తులు కావాలంటే చెయ్యవలసినది ఒకటే !!!!

పూర్వపు జన్మమే, భవిష్యత్తు ఎలా కాగలదు?

బాబా గారు చెప్పినది: మరణసమయం లో ఉన్న కోరిక గాని, ఆలోచన గాని ఆ వ్యక్తి భవిష్యత్తును మరు జన్మ లో నిర్ణయిస్తుంది.

భగవద్గీత (8వ అధ్యాయం) లో  శ్రీకృష్ణుడు చెప్పినదీ ఇదే. ఎవరైతే వారి అంత్యదశలో తనను జ్ఞాపకం ఉంచుకుంటారో, వారు తనను చేరుతారు. ఎవరైతే ఏదో మరోదానిని ధ్యానిస్తారో, వారు మరు జన్మలో దాన్ని పొందుతారు.

బాబా గారి మార్గాన్ని అనుసరించి యోగులైన వారి బోధనామృతం:

ఒక వ్యక్తి, ఒక స్త్రీ ని వివాహమాడి నానా ఇబ్బందులకు గురి అవుతుంటాడు. ఆ స్త్రీ వ్యసన పరురాలు మరియు నోటి దురుసు గలది.  స్వార్ధబుద్దితో, అహంకారం తో భర్తను తూలనాడుతూ బానిసను చేసుకుని బ్రతుకుచుండెను. ఏనాడూ ఆతనిని అనురాగముతో చూచెడిది కాదు. ఆతని కుటుంబీకుల మధ్య చూచుచున్నటుల నటించెడిది. తన ప్రవర్తనను ఎవ్వరికినీ చెప్పకూడదని భర్తను బెదిరించెడిది. తన పైననే ఆధారపడి ఆతను బ్రతుకునటుల చేసినది. తాను విటులతో చరిస్తూ, సుఖవ్యాధులపాలయి కొన్నాళ్ళకి మంచం పట్టి మరణించినది. ఆమె మరణానికి ముందు పిచ్చిది కూడా అయిపోయి భర్తని తిడుతూ, కొడుతూ అతని చేత అష్ఠాధి చాకిరీలు చేయించుకున్నది. చివరికి అతని కుటుంబీకులకు, స్నేహితులకు తెలిసి, అతని పరిస్థితులకు విస్తుపోయి, సహాయ సహకారాలందించ ప్రయత్నించిరి. అతనికి ఒక ఉద్యోగమును చూసి పెట్టిరి. ఇంతలో మరొక స్త్రీతో పరిచయమయి, అది ప్రణయం గా మారి వివాహానికి దారి తీసినది. ఈ రెండవ స్త్రీ ఎంతో అనురాగము తో చూసుకొనేది. అతని పూర్వపు జీవితానికి పూర్తి భిన్నం గా ఉన్నది ఈ రెండవ స్త్రీ తో. ఆమె అతని మనసుని నొప్పించకుండా గౌరవిస్తూ, దైవ భక్తి కూడా కలిగినది అయి... సంతోషముగా జీవించినది.

ఈ కధలో అతని మొదటి జీవితం.. అతని పూర్వ జన్మల కర్మల ఫలితము, ఒక వ్యసనపరురాలి క్రింద బానిస సంకెళ్ళు. కర్మానుసారె బుద్ది, కావున అ స్త్రీ ని ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు, బానిస బ్రతుకూ అనుభవించాడు..ఆ కర్మలు పూర్తయి సంకెళ్ళు విడిపోయినవి.  ఆ స్త్రీ యొక్క నీచ ప్రవర్తనకు దేవుడు వేసిన శిక్ష వ్యాధిగ్రస్తురాలయి, అందరిచేత చీ.. అనిపించుకుని, పిచ్చిది అయి, కుక్క చావు చనిపోయినది.

ఇక లభ్యమయిన రెండవ జీవితం.. బహుశా అదే అసలు జీవితం. ఏ జన్మలోనో చేసుకున్న సుకృతం కావచ్చు లేదా పూర్వపు జన్మలో ని అతని సహచరిణి యే మళ్ళీ ఈ జన్మలో లభ్యమయి ఉండవచ్చు. మళ్ళీ సుఖ సంతోషాలతో, అనురాగం తో ఈ జన్మలోనూ జీవించి ఉండవచ్చు.

భక్తుని ప్రశ్న: పూర్వపు జన్మమే, భవిష్యత్తు ఎలా కాగలదు?

అవే పాప పుణ్యాల ఫలితాలు. మంచి చేసుకుంటే మంచి, చెడు చేసుకుంటే చెడు. అలానే మరణ సమయము లో ఎవరిపైన ధ్యాసతో, వేదనతో ప్రాణం విడుస్తారో..ఆ అలోచనే, ఆ ధ్యాసే మరు జన్మలో భవిష్యత్తు అవుతుంది.

ఇక్కడ అతనికి లభ్యమయిన మొదటి స్త్రీ.. అతడు ఏఏ జన్మల్లోనో చేసుకున్న కర్మ ఫలం. రెండవ స్త్రీ అతని పూర్వ జన్మము నుండి తెచ్చుకున్న భవిష్యత్తు!  ఈ రెండు విషయాలు ఆ వ్యక్తి జీవితంలో కనిపించిన విషయాలే. ఇందులో తప్పేదేముంది..అంటే ఏదీ లేదు. ఒక ఆత్మయొక్క గతమైనా, వర్తమానమైనా ఆ ఆత్మనే అంటిపెట్టుకునివుంటుంది. అది శరీరాన్ని త్యజించి మరో క్రొత్త శరీరం లోకి ప్రవేశించినా కూడా దాని గతాలు మళ్ళీ భవిష్యరూపంలో తటస్థిస్తుంది. మరణ సమయంలో ఏ వ్యక్తిపైననో, ఏ కోరికతోనో, ఏ ఆలోచనతోనో శరీరాన్ని త్యజించినా కూడా అది మరుజన్మలో పొందడం జరుగుతుంది. ఇదే మానవులకు అర్ధం కాని దేవుని లీలలు!!!!

భక్తుని ప్రశ్న: మరి ప్రతి జన్మలోని గతం తాలూకు నీలినీడలు.. క్రొత్త జన్మలలో ఏదో బ్యాంకు బాలెన్సు లాగ..సంప్రాప్తించి కర్మలకు గురి అవుతుంటే..భవిష్యత్తుని ఎప్పుడు సంపూర్ణం గా అనుభవించగలము?

అప్పుడు బాబా గారి దగ్గిరనుండి తరచూ వచ్చే ఒక క్లిష్టమైన సమాధానం చర్చించక తప్పదు.

బాబాగారు ఎప్పుడూ కష్టాలను ప్రేమించమంటారు. ఇదెక్కడి చోద్యం? ధు:ఖాన్ని కలిగిస్తున్నా కష్టాలని ప్రేమించగలమా? ఆయన అర్ధం ఏమిటంటే.. ప్రేమలో ఉండాల్సిన సర్వసాధారణ లక్షణాలు శ్రద్ద, ఓర్పు రెంటినీ కష్టం యందు పెంచుకోమంటారు. ఆరెండే.. ఆ కష్టం యందు అవగాహనని పెంచి ఎదుర్కోవడానికి దైర్యాన్ని, స్థైర్యాన్నిఇస్తుందంటారు. ఇక్కడ ప్రేమకున్న విలక్షణమైన గుణాలను వివరిస్తూ.. అటువంటి ప్రేమను, పడుతున్న కష్టం యందు వెచ్చించమంటారు. అప్పుడే ఆ కష్టం యందు అవగాహన కలిగి, దానిని సృష్టించిన వారియందుకూడా విచారణ శక్తి పెరిగి, శ్రద్ధ ఓర్పుతో సమస్యలను విడదీసి.. దైర్యం, స్థైర్యం తో ఎదుర్కొని కర్మలను పూర్తిచెయ్యగలరని చెప్తారు. ఇదంతా కేవలం ప్రేమతోనే సాధ్యం అంటారాయన. అందుకే బాబా గారికి "ప్రేమ సాయి" అని పేరు. ఆయన తన భక్తులని ప్రేమిస్తూనే వుంటారు, అంటే కేవలం వరాలివ్వడమేకాదు. కష్టాలతో కొట్టుమిట్టాడు తున్నవాళ్ళలో ప్రేమని నింపి, దానికున్న విలక్షణమైన గుణాలన్నీ సదరు బాధితుడికి అందిస్తూ..కర్మలను పూర్తిచేయిస్తూ విముక్తిడిని చెయ్యడమే గురు లక్షణం.

ఎప్పటికప్పుడు, ఏ జన్మకాజన్మ లో కర్మవిముక్తులు కావాలంటే చెయ్యవలసినది ఒకటే- ఆ కర్మలను పూర్తిచేసుకోవడం. అది ఏ కారణం చేతనైనా కుదరకపోయినా, ఏ బలవన్మరణాలవల్లనో మధ్యలో ఆగిపోయినా.. మళ్ళీ జన్మలో అవే సమస్యలు పున: ప్రారంభమై, గత జన్మలోని శత్రు శేషంచేతనే బాధింపబడవలసివుంటుందట. అందుకే.. ఏ కష్టమున్నా కూడా పంటి బిగువున పట్టి పూర్తిచెయ్యమంటారు. అందుకు తాను పూర్తి సహాయకారిగా ఉంటానంటారు. దానికి ప్రతిఫలం గా బాబాగారు మననుండి కోరుకునేది ఒక్కటే.. తన మీద శ్రద్ద, సబూరి. చూశారా? ఇంతకన్నా బరోసా ఈ ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందా? ఎవరైనా ఇవ్వగలరా ? ఒక్క బాబాగారు తప్ప !!!!!


2 comments:

 1. ఈ సందర్భంలో ఒక చిన్న విషయం , గురువే నిత్యం ,సత్యం గురువుని ఆశ్రయించినవాడికి సుఖసంతోషాలకి కరువురాదు,మరి అటువంటప్పుడు భక్తులకి కష్టాలు కూడా ఎందుకు కలుగుతున్నాయి అని కొందరు మిత్రులు ఆలోచిస్తూ ,అదే సద్గురువు మనని కరుణించటం లేదు అని కొంచం కినుక వహించడం పరిపాటి . ఇప్పటి భాషలో చెప్పాలంటే గురువు మన ఫండ్ మేనేజర్ లాంటివాడు మన పూర్వజన్మ పాప,పుణ్యఫలాల గురించి మనకు తెలియదు, పాప ప్రక్షాలణ పూర్తికావలంటే గురువు తప్పని సరిగా ఉండితీరాలి, అలాగే ఆగురువు సద్గురువై ఉండాలి. గురువుయొక్క లక్షణాలు తెలిపి గురువును ఆశ్రయించ మని చెప్పిన బాబాగారు కూడా తన గురువృత్తాంతం , గురువుని సేవించిన విధం , ఆ గురువు పెట్టిన పరీక్షలు మున్నునవి తెలియచెప్పారు. అలాగే సర్వవ్యాపకుడిని ఈ సర్వజగత్తుకి కారణభూతుడనని తెలిపిన శ్రీకృష్ణ పరమాత్ముడుకూడా తానూ గురు సేవ వలనే తరించానని తెలియజేసాడు. అందువలన పాపకర్మలను అనుభవింప జేసి ముక్తిని కలిగించువాడు గురువు, అలాగే మనకెంత అవసరమో అంతే ప్రసాదించి యొగ్యతమనయందు మేలుకొలిపేది ఆయనే.
  జై సాయిరాం

  ReplyDelete
  Replies
  1. true. భూమి పైకి రావడమే కర్మలననుభవించడానికి. అందుకే దీనిని కర్మ భూమి అంటారు. పాపాలు చేసినా, పుణ్యాలు సంపాదించుకున్నా కూడా ఈ భూమి మీదనే సాధ్యం. ఆ పుణ్య సంపాదన కోసం ఈ కలియుగం లో ఎంతో ప్రాకులాడాల్సివస్తుంది, కాల మహిమ వల్ల..ఏదోఒక అవాంతరం వచ్చిపడుతుంది. ఈ అవాంతరాలను పోగొట్టుకోవడానికి కేవలం దేవునియందు నమ్మకం వుంటే చాలదు. ఆ దేవుని మెప్పుపొందాలి. పొందాలి అంటే ఆతని దృష్టిలో మనం పడాలి. అతనికి దగ్గిరవ్వాలి. దానికి పెద్ద అవాంతరమే ఈ గత జన్మలనుండి, లేదా ఆ జన్మలోనైనా వస్తున్న ప్రారబ్దాలు. అవే మనల్ని దేవునికి దగ్గరవ్వకుండా ఆపేస్తుంటాయి, ఇంకా ఇంకా కష్ట, నష్టాల్లోకి తొక్కేస్తుంటాయి, వాటి లక్షణం కదా. ఆ ప్రారబ్దాలనుండి దూరమయి, ప్రక్షాళన గావించుకోడానికి కావలసిన సాధనమే గురుసాధన. ఆ గురువుకి కూడా దగ్గిరవ్వడం అంత సులభతరమేమీ కాదు. అది సులభతరం కావడానికి.. వాడవలసిన ఇంధనమే శ్రద్ద మరియు సబూరి!

   Delete