గౌతమి

గౌతమి

Sunday, January 11, 2015

మధుమేహం లేదా చక్కెర వ్యాధి (Insights of Diabetes)

మధుమేహం లేదా చక్కెర వ్యాధి (Insights of Diabetes)
Part-1
మధుమేహం లేదా చక్కెర వ్యాదిని వైద్య పరిభాషలో డయాబిటిస్ మెల్లీటస్ అంటారు. ఈ చక్కెర వ్యాధి ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్ గా,  ఒక మెటబాలిక్ డిసార్డర్ గా వివిధ టైపుల్లో మనిషికి సంక్రమించడమే కాకుండా ఒబీసిటీ (ఊబకాయం),  మానసిక ఒత్తిళ్ళు మరియు ఆందోళనలు,  ఆల్జీమియర్ లాంటి మెదడు సమస్యలలో కూడా సంబంధం కలిగివుంటూ వ్యాధులను మరింత సంక్లిష్టం చేస్తోంది.  క్లోమ గ్రంధి (Pancreas) లోని బీటా ( Islets of Langerhans) కణాలనుండి ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోను హెచ్చు, తగ్గుల వల్ల అలాగే కార్బోహైడ్రేట్ గ్లూకోజ్ మెటబాలిజం ప్రక్రియలో లోపం వచ్చినపుడు తిన్న ఆహారం సరిగ్గా విచ్చిన్నం కాక రక్తంలో చక్కెర (గ్లూకోజ్) శాతం ఎక్కువ అయిపోవడం వల్ల మనిషికి మధుమేహం సంక్రమిస్తుంది.  మధుమేహం మూడు రకాలు..
  1. గెస్టేషనల్ డయాబిటిస్ (గర్భిణీ స్త్రీలలో వచ్చేది)
  2. టైప్ 1 డయాబిటిస్
  3. టైప్ 2 డయాబిటిస్
గెస్టేషనల్ డయాబిటిస్ గర్భధారణ సమయంలో వచ్చే చక్కెర వ్యాధి. ఈ సమయం లో శరీర కణాలు ఏవిధంగా గ్లూకోజ్ ని ఉపయోగించుకుంటుందో చెప్పడం కష్టం, కావున స్త్రీలు ఈ వ్యాధికి గురవుతారు. ఆ సమయంలో తగుజాగ్రత్తలు తీసుకుంటే పర్వాలేదు, లేకపోతే అది గర్భంలోఉన్న శిశువుపై ప్రభావం చూపిస్తుంది. తగు జాగ్రత్తలు తీసుకున్న మూలంగా ప్రసవం తర్వాత ఈ వ్యాధి పోతుంది.
టైప్ 1 డయాబిటిస్ ఒక ఆటో ఇమ్యూన్ రెస్పాన్స్.  ఇది సాధారణం గా బీటా కణాలలో ఒక వంశపారంపర్యలోపంగా జనించి, ఏదైనా ఒక పర్యావరణ మూలకంగా ట్రిగ్గర్ అవుతుంది. దానితో బీటా కణాలు అపసవ్యంగా పనిచేయడం మొదలెడతాయి దాని పర్యవసానం గా ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడాలు కనిపిస్తాయి.  దానిమూలంగా ఇమ్యూన్ సిస్టం కూడా ట్రిగ్గర్ అవుతుంది.  బీటా కణాల చుట్టూ ఇమ్యూన్ కణాలు (ముఖ్యం గా తెల్ల రక్త కణాలు, వాటికి సంబంధించిన ఇతర ఉపకణాలు ఉదాహరణకి మాక్రోఫేజెస్) చుట్టుముట్టి.. వాటిని నాశనం చెయ్యడం మొదలెడతాయి. దానితో ఇంకా ఇన్సులిన్ ఉత్పత్తి పై ప్రభావం పడి గ్లూకోజ్ ని విచ్చిన్నం చేయడం కుంటుపడుతుంది. కాని ఇన్సులిన్ పూర్తిగా లోపించదు.
టైప్ 2 డయాబిటిస్ కూడా ఇన్సులిన్ లోపము లేదా ఇన్సులిన్ నిరోధము వల్లనే రక్తంలోని అధికమయిన గ్లూకోజు ని నివారించలేని ఒక అపసవ్యవ్యవస్థ. దీనికి టైప్ 1 డయాబిటిస్ వున్న తేడా ఏవిటంటే.. బీటా కణాల నాశనం వల్ల పూర్తి ఇన్సులిన్ లోపం వుంటుంది.
ఈ మధుమేహ లక్షణాలు మితిమీరిన దాహం, తరచూ మూత్ర విసర్జన మరియు నిరంతర ఆకలి. మధుమేహ వ్యాధుల్లో 90% టైప్ 2 ఉంటే కేవలం 10% మాత్రమే టైప్ 1 మరియు గెస్టేషనల్ రకాలు పేర్కొనబడ్డాయి.
 ఒబీసిటీ
జన్యుపరమైన స్థూలకాయం  (ఒబీసిటీ) ప్రాధమికంగా టైప్ 2 డయాబిటిస్ కు కారణమవుతుంది.  ఒబీసిటీ వున్నవాళ్ళు చాలా లావుగా వుంటారు, వాళ్ళకి స్థూలకాయం ఎక్స్ ట్రా మజిల్ వల్ల రావచ్చు, బోన్ వల్ల రావచ్చు, వళ్ళు నీరు పట్టేయడం వల్ల రావచ్చు లేదా క్రొవ్వు వల్ల రావచ్చు. కానీ వైద్య పరిభాష లో క్రొవ్వు బాగా పెరిగిపోవడం వల్ల ఒబీసిటి వస్తుందని చెప్తారు.
ఒబీసిటీ తో బాధపడుచున్న వాళ్ళలో ఇన్సులిన్ నిరోదించబడుతుంది. క్రొవ్వు కణాల్లో ఇమ్యూన్ కణాలయినటువంటి మేక్రోఫేజెస్ అధిక సంఖ్యలో పేరుకుపోతాయి, అక్కడి అనారోగ్యాన్ని గ్రహించి.  దానితో ఇమ్యూన్ రెస్పాన్స్ ఎక్కువయినప్పుడు వాపులు, కీళ్ళ నొప్పులు, రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం జరుగుతాయి. అధిక గ్లూకోజ్ ని విచ్చిన్నం చెయ్యడానికి క్లోమ గ్రంధి నుండి ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా క్లోమగ్రంధి ఐలెట్-బీటా కణాలు కూడా బాగా పెద్దవి గా పెరిగిపోతాయి, ఇది ఒక పేథోలాజికల్ కండిషన్. ఈ కండిషన్ లో ఇ న్సులిన్ అధికం గా విడుదల అవుతుంది. ఒక ప్రక్క గ్లూకోజ్ రక్తంలో ఎక్కువ అవ్వడం, మరో ప్రక్క ఇన్సులిన్ కూడా అధికంగా ఉత్పత్తి అవ్వడం కూడా శరీరానికి మంచిది కాదు. ఇది ఇలా జరుగుతూ జరుగుతూ ఒక స్టేజ్ లో బీటా కణాలు ఇన్సులిన్ ని ఉత్పత్తి చేయడం పూర్తిగా మానేస్తుంది. కణాలు కూడా సైజ్ లో చిన్నవి అయిపోతాయి, తరువాత చచ్చిపోతాయి కూడా.  అప్పుడిక ఇన్సులిన్ ఉండనే ఉండదు. ఇదే టైప్ 2 డయాబిటిస్ కి “కీ” ఫీచరు.  అప్పుడు  ప్రతిరోజూ భోజనానికి ముందు ఇన్సులిన్ ఇంజక్షన్ తీసుకోవలసి వస్తుంది.  పూర్తిగా ఇన్సులిన్ ని కోల్పోయి టైప్ 2 డయాబిటిస్ గా రూపాంతరం చెందే లోపు తగు జాగ్రత్తలు తీసుకుంటే టైప్ 2 ని నివారించవచ్చు.
Diabetes
ఒబీసిటీ వల్ల టైప్ 2 డయాబిటిస్ వస్తుందంటే మరి దాని కారకాలని తగ్గిస్తే టైప్ 2 డయాబిటిస్ ని రివెర్సు చేయవచ్చా అని ఎలుకల మీద పరిశోధనలు చేసి కొన్ని ముఖ్యాంశాలని కనుక్కున్నారు. నార్మల్ ఎలుకలను ఒబీస్ గా మార్చిన తర్వాత ఇన్సులిన్ లోని వైవిద్యాలు, ఐలెట్ కణాలు సరిగ్గా పనిచెయ్యకపోవడం, వాపులు మరియు గ్లూకొజ్ లెవెల్స్ పెరగడం డిటెక్ట్ చేసారు. ఈ లక్షణాలన్నీ ఎలుకలు ఒకసారి డియాబిటిక్ కండిషన్ లోకి మారాక కూడా ఉంటాయి. మరి ఒబీసిటీ నుండి డియాబిటిసు కు ఎందుకు మారుతుంది అని ఖచ్చితంగా చెప్పగలగాలంటే.. ఒకసారి డయాబిటిక్ కండిషన్ లోకి మారాక.. ఆ కండిషన్ ని స్ట్రిక్ట్ గా మెయింటెయిన్ చెయ్యాలంటే.. ఆ ఎలుకలకున్న ఒబీస్ లక్షణమైన అధిక క్రొవ్వు పేరుకోవడాన్ని నిరోధించాలి. అందుకు కారణ భూతమైన “లెప్టిన్” అనే హార్మోనల్ రిసెప్టార్ ని పరివర్తన చేశారు, దానితో క్రొవ్వుని పేర్చే లక్షణాన్ని కోల్పోయి.. కేవలం డయాబిటిక్ గా మాత్రమే ఆ ఎలుకలు మిగిలాయి. ఈ కండిషన్ లోకూడా పైన చెప్పిన లక్షణాలు ఉన్నాయి పైగా వాపులకు కారణాలయిన ఇమ్యూన్ కణాలు అధికం గా బీటా కణాలని అటాక్ చేస్తున్నాయి. దానివల్ల బీటా కణాలు నాశనమయి ఇన్సులిన్ పూర్తిగా లోపించింది మరియు బీటా కణాలు కూడా రాను రాను తగ్గిపోయి జీవం కోల్పోయాయి. దీనిని బట్టి అర్ధమయినదేమిటంటే ఒబీసిటి ఉంటే టైప్ 2 డయబిటిస్ కి దారి తీయడం సహజమే. ఒకవేళ ఒబీసిటీ లేకపోయినా కూడా టైప్ 2 డయాబిటిస్, ఇన్సులిన్ వైవిధ్యాలు, ఇమ్యూన్ కణాల వల్ల ఐలెట్ కణాల నాశనం మూలాన తప్పక సంక్రమిస్తుంది అని తెలుసుకున్నారు.  ఈ టైపు ఇన్సులిన్ లాస్ (Insulin loss) ని అరికట్టాలంటే ఇమ్యూన్ కణాలని, వాటి రెస్పాన్సస్ ని అరికట్టాలి, అందుచేత ఇమ్యూన్ బేస్డు థెరపీస్ (Immune based therapies) ని అభివృద్ది చేసి ఐలెట్ కణాల నాశనాన్ని ఆపితే ఈ రకపు టైప్ 2 డయాబిటిస్ ని అరికట్టవచ్చని పరిశోధకులు తెలియపరిచారు. ఈ థెరపీస్ గురించి తరువాయి భాగాల్లో తెలుసుకుందాం….
ఈ పరిశోధనా వివరాలను Cucak H et al (2014) J Leukocyte Biology Vol 95: Page 149 మరియు పైన చూపబడిన చిత్రం http://www.jdrf.ca/our-research/cure/ నుండి తీసుకొనబడినది.

No comments:

Post a Comment