గౌతమి

గౌతమి

Friday, July 31, 2015

గురుపౌర్ణమి విశిష్టత

ఆషాఢమాసం దక్షిణాయణ వర్షరుతువు తిధి పౌర్ణమి ని "గురు పౌర్ణమి" గా వ్యవహరిస్తారు,  ఆ రోజున అందరూ వారి వారి ఆధ్యాత్మిక గురువులను గౌరవించి పూజించడం ఒక ఆనవాయితీ. సాధారణం గా ఆధ్యాత్మిక గురువులను గౌరవించే రోజు ఈ “గురుసౌర్ణమి”.  స్కూల్ కి వెళ్ళి గురువు దగ్గిర నేర్చుకున్న విద్య మంచి, చెడుల విచక్షణని నేర్పి బ్రతుకు సాధనకు ఉపయోగపడుతుంది. కాని ఆధ్యాత్మిక గురువులు సంస్కారాన్ని, విజ్ఞతని, నేర్వబడిన విద్యా పరమార్ధాన్ని, జగతినంతా విస్తరించుకొని వున్న ఆ పరమాత్ముని లీలల ద్వారా బోధించే తత్వవేత్తలు. అందువల్ల బ్రతుకు బండిని నడిపించుకోడానికి అవసరమైన విద్యను నేర్పే గురువు ఎంత అవసరమో, విజ్ఞానాన్ని వికసింప జేయడానికి ఆధ్యాత్మిక గురువు కూడా అంతే అవసరం. ఇది కేవలం మానుస్య గణానికే కాదు, దేవ మరియు రాక్షస గణాలలో కూడా గురువు యొక్క ప్రాముఖ్యత కనిపిస్తున్నట్లు మన పురాణాలు, భాగవతాలు చెప్తున్నాయి. దీనికి ఒక ముచ్చటైన ఉదాహరణ- వినాయకుడు ప్రమధగణాధిపత్యాన్ని పొందేటప్పుడు తన తమ్ముడు కుమారస్వామి తో పోటీకి దిగుతాడు. పోటీ ప్రకారం కుమారస్వామి తన వాహనమైన నెమలిని ఎక్కి అతివేగం గా వెళ్ళి అన్ని పుణ్య నధుల్లో మునిగి వచ్చేస్తుంటాడు కాని మూషిక వాహనుడైన వినాయకుడు మాత్రం మెల్లగా నదీ స్నానాలు పూర్తి చేస్తూ, కుమార స్వామి వేగాన్ని అందుకోలేని పరిస్థితి లోవుంటాడు. అప్పుడు దారి చూపమని తల్లిదండ్రులని వేడుకొంటే తండ్రి శివుడు అధ్యాత్మిక గురువై జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు...తమలోనే అన్ని పుణ్యనదులు, బ్రహ్మాండ కోటి జీవరాశులు నిండి ఉన్నప్పుడు మరెక్కడికో ఎందుకు వెళ్ళడం? తమ చుట్టూ ప్రదక్షిణలు చేసి పోటీ గెలవమని. వినాయకుడు నివ్వెరపోయి వారి చుట్టూనే ప్రదక్షిణలు గావించడం మొదలుపెట్టాడు. కుమారస్వామి కన్నా ముందు పుణ్య నదీ స్నానాలు ఆచరించేసి వినాయకుడు గణాధిపత్యాన్ని పొందాడు. ఇలా పురాణాలు తిరగేస్తూబోతే ఎన్నో కధలు కనబడతాయి అధ్యాత్మిక గురువు అంటే ఏమిటో తెలుసుకోవడానికి.ఈ గురు పౌర్ణమినే వ్యాస పౌర్ణమి అనీ అలాగే వేదవ్యాసుని పుట్టిన రోజు గా కూడా పరిగణిస్తారు. హిందువుల నమ్మకం ప్రకారం వరాహ పురాణం లో చెప్పినట్లు గా విష్ణే “వ్యాసుడు” రూపం లో ప్రతి యుగం లో అవతరించి ధర్మ సూత్రాలను వెల్లడిస్తూ ధర్మం అదుపుతప్పకుండా నడిపిస్తూ వుంటాడు. అలాగే ద్వాపరం లో సాక్షాత్తు ఆ విష్ణే శ్రీ కృష్ణ అవతారం లో గీతా ధర్మాల్ని బోధించాడు. ద్వాపరాంతానికే ధర్మం కుంటడం మొదలుపెట్టింది. రాబోయే కలియుగం లో మరింత ధర్మ, జ్ఞాన, ఆచార భ్రష్టత్వాలకు లోనై ప్రజలు బ్రతుకుతారని గీతా ధర్మాలతో కృష్ణుడు, అలాగే వేద వ్యాసుడు కూడా జ్ఞాన బోధకుపక్రమించాడు. అందుకే వేదవ్యాసుడు ఆది గురువయ్యాడు. వేద వ్యాసుణ్ణి కూడా విష్ణవతారం గానే భావిస్తారు. వేద వ్యాసుడు మహా భారతాన్ని రచించిందే కాకుండా, అందులో తన పాత్రని కూడా చూపించుకుంటాడు. మహాభారతం  క్రీ.పూ. 3139 లో జరిగినది. దీనిని బట్టి వేద వ్యాసుడు ఈ కాలానికి చెందిన వాడని తెలుస్తున్నది.  కాని అంతకు మునుపెన్నడో వేదాలనేవి పుట్టినప్పుడు ఈయన ఏ విధం గా వేద వ్యాసుడయ్యాడు అనే ప్రశ్న రాక మానదు.

మహాభారత కాలానికి ముందునుండీ సరస్వతీ నది అనే మహా నది ఉత్తర భారతమంతా ప్రవహించేదట. ఆ నదీ సమీపాన ఎంతో మంది ఋషులు నివాసముంటూ వారు సముపార్జించిన విజ్ఞానాన్ని, సాధనలతో తెలుసుకున్న విశ్వ విజ్ఞాన్నీ, దైవరహస్యాలను శిష్యులకు పంచుతుండేవారు. మహాభారత సమయానికి కరువుకాటకాలొచ్చి సరస్వతీ నది 14 సంవత్సరాల పాటు ఎండిపోయినదిట. దానితో అక్కడినుండి నివాసాలను ఖాళీ చేసి వెళ్ళిపోయారు. వాళ్ళందించిన  అపార విజ్ఞానము అక్కడితోనే మాయమవుతూ వచ్చింది. ఆ సమయం లో 14 ఏళ్ళ తర్వాత వేద వ్వాసుడు ఆ ప్రాంతానికి వచ్చి ఆ మహా ఋషులు చెప్పి అక్కడే వదిలేసిన దైవ రహస్యాల్ని, జగత్తులో విస్తరించివున్నప్రాకృతిక రహస్యాల్ని,  దేవుని ఉనికిని తెలియపరిచే తత్వ బోధనలని పరిశోధించి, వాటిని సేకరించి ఆ సమాచారాన్ని వేదాల రూపం లో విభజించి జాబితా చేశాడు. ఆ వేదాలే ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణవేదాలు. సేకరించాక వీటి విభజన చేసిన రోజే ఈ గురు పౌర్ణమి రోజు అని కూడా చెప్పుకుంటారు. అందుకే ఈయనకు వేద వ్యాసుడని పేరు. నిజానికి అది అతని బిరుదు. ఈతని అసలు పేరు కృష్ణదైపాయనుడు.
ఈ విశ్వమంతా ఒక పెద్ద పరిశోధనాలయం గా భావిస్తే ఈ వేదాలని వ్యసించిన (విభజించిన) వేద వ్యాసుడే కాదు సాధనల ద్వారా విశ్వాన్ని, ప్రకృతిని పరిశోధించి రహస్యాల్ని తెలుసుకొని అపారమైన విజ్ఞానాన్ని అందించిన ఆనాటి ఋషులు కూడా పరిశోధకులే. అలాగే మెటీరియల్ సైన్స్ ని శోధించి లాస్ ఆఫ్ ఫిజిక్స్ ని కనుగొన్న ఐనిస్టీన్, ప్లేంక్ మొదలైన వారు, అలాగే ఇతర సైన్సులలోని వారు కూడా అందరూ పరిశోధకులే. వీరందరూ జగతిలోని ఏదో ఒక రహస్యాన్ని చేధించిన వారే. మరి వీరు చేధించిన వాటినన్నిటినీ సృష్టించినది ఎవరూ అంటే ఆ "దేవుడు" - కనిపించని మరోశక్తి, ఒక సెంట్రల్ పవర్ అని తీర్మానించక తప్పదు. ఈ సెంట్రల్ పవర్ హౌస్ ని అర్ధం చేసుకొని దేవునికి దగ్గిరవ్వడానికే ఆధ్యాత్మిక గురువు అవసరం. 

Thursday, July 30, 2015

డేంగూ వైరస్ కు దోమ వెన్నుపోటు. రాజమౌళి "ఈగ" లే కాదు- దోమలూ యోధులే!!


మొదటిసారిగా సైంటిస్టులు అడవి దోమల్ని మానవ జబ్బుల్ని అరికట్టడానికి వాడారు. ఇందులో మందుల వాడకం లేకపోవడం వల్ల, దీనిని నేచురల్ ప్రొటెక్షన్ గా పరిగణించవచ్చు.

గత మూడు సంవత్సరాల నుండి, సైంటిస్టుల బృందం దోమల మీద పరిశోధనలు చేస్తూ.. మంచి ఫలితాలను ప్రపంచానికి అందించారు. డేంగూ విష జ్వరాలు డేంగూ వైరస్ వల్ల మనుష్యులకి సోకుతుంది. ఇది దోమ కాట్ల ద్వారా సోకుతుంది. ఆస్ట్రేలియాలో వేలకి వేల మందిని ఈ వైరస్ పొట్టనపెట్టుకుంటుంది, అలాగే ఇతర దేశాలలో కూడా తన తడాఖా ని చూపిస్తున్నది. వాటిల్లో భారత దేశం కూడా లేకపోలేదు. ఈ వైరస్ సోకడానికి కారణాలు రెండు పేరసైట్లు ఒకటి డేంగూ వైరస్ మరియు దానిని వ్యాపింపజేసే దోమ.ఈ పార్ట్నర్ షిప్ ని ని బ్రేక్ చేయ్యడానికి యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్ ల్యాండ్ నుండి స్కాట్ ఓనీల్ అనే శాస్త్రవేత్త వీటి మధ్యకి మరో పేరసైట్ ని ప్రవేశింపజేశారు. అది వాల్బెచియా (Wolbachia) అనే బాక్టీరియం. ఈ బాక్టీరియం దోమల్నే కాకుండా ఆర్థోపాడ్ ఫైలం కి చెందిన మరెన్నో కీటకాలకు కూడా ఇన్ ఫెక్ట్ కాగలదు. ఈ బాక్టీరియం చాలా త్వరితం గా కీటకాల్లో వ్యాపిస్తుంది. అంతేకాకుండా ఇది ఆడ దోమల గ్రుడ్లలో ఈజీగా దాగి, ఎన్నో రీతులద్వారా క్రొత్త హోస్ట్స్ ని చేరి దాని మనుగడని వ్యాపింపజేసుకోవడానికి ప్రయత్నిస్తుందిట. సైటోప్లాస్మిక్ ఇన్ కంపేటబిలిటీ (cytoplasmic incompatibility) ద్వారా మగ కీటకాలను ఈ బాక్టీరియా సోకని ఆడదోమలకు దూరం గా వుంచుతుంది. ఈ బాక్టీరియా సోకిన ఆడదోమలను మాత్రమే మగ కీటకా లకు దగ్గిర చేస్తుంది. దానివల్ల ఈ ఆడదోమలు బాక్టీరియా దాగిన గ్రుడ్లను పెడతాయి. ఒక్కసారి ఈ బాక్టీరియం అడుగు పెట్టిందంటే దాని పాప్యులేషన్ ని చాలా త్వరితం గా పెంచుకుంటూ పోతుంది. శాస్త్రవేత్తలు ఈ బాక్టీరియా లక్షణాన్ని ఉపయోగించి హ్యూమన్ డిసీజెస్ ని అరికట్టడానికి గత 20 యేళ్ళు గా కృషి చేస్తున్నారు.

అసలు ఈ విష జ్వరాలని ఎదుర్కోవడానికి ఒక బాక్టీరియాన్ని వుపయోంచడమేంటి? 

దీనిక్కారణం దీనిని ఎదుర్కోవడానికి వాక్సిన్ లేదు. డేంగూ ప్రాణాంతకమైనది. ఇదిసోకిన మనుష్యులు కొన్ని వారాల పాటు జబ్బుపడిపోతారు. డేంగూ సోకిన వారు అధిక జ్వరం, వొళ్ళు నొప్పులు మరియు అలసటలతో బాధ పడుతుంటారు. గత 50 ఏళ్ళ నుండి ఈ జ్వరాలు మరో 30% ఇంకా ఎక్కువయ్యాయి. WHO ప్రకారం ప్రపంచ వ్యాప్తం గా, ప్రతి ఏటా 50-100 మిలియన్ల ప్రజలు ఈ విషజ్వరాల పాల్నపడుతు న్నారుట. ఇది దోమల వల్ల వచ్చే వైరల్ డిసీజ్. ట్రాపికల్, సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ లో ఎండమిక్ స్టేటస్ గా అమెరికా, సౌత్ ఏషియా, వెస్ట్రన్ పసిఫిక్, ఆఫ్రికా మరియు ఈస్ట్రన్ మెడిటెరనేయన్ ప్రాంతాల్లో ముఖ్యం గా అర్బన్, సెమీ అర్బన్ ఏరియాల్లో ఈ వైరస్ సోకుతున్నది. అలాగే ఇండియా లో కూడా ప్రతి ఏటా 20,000 మంది ఈ డేంగూ వల్ల చనిపోతున్నారు. ఈ వైరస్ సోకడానికి ముఖ్య కారణం ఈ దోమలు.  దోమలు. ప్రతిఏటా సమ్మర్ మాన్ సూన్ చివరిరోజుల్లో ఇంకా రోడ్ల మీద, కాలవల్లోనో వర్షపు నీళ్ళు నిలిచిపోతుంటుంది, అవే ఈ దోమలకు బ్రీడింగ్ కి అనువైన కాలము, స్థలము.
భెర్నార్డ్ యూనివర్సిటీ నుండి డోనాల్డ్ షెపార్డ్ అనే శాస్త్రవేత్త ఆధ్వర్యం లో అమెరికా, ఇండియా కలిసి చేసిన పరిశోధనల మూలం గా తెలిసిన విషయమేమిటంటే డేంగూ సమస్య అమెరికాలో కన్నా ఇండియా లో ఎక్కువ ఉందిట. ప్రతి ఏటా 5.8 మిలియన్ల ఇండియన్లు దీని పాల్న పడుతున్నారుట. 282 టైంస్ ఎక్కువ కేసులు ఇండియా నుండి నమోదవుతున్నాయిట. ఇండియా లో పబ్లిక్ హెల్త్ చాలెంజెస్ రోజు రోజు కీ పెరిగి పోతున్నాయ్. ఇండియా పోలొయోని పూర్తిగా అరికట్టగలిగింది. ఇండియాలో వాక్సిన్స్ ని కనుక్కోవడానికి తగు పరిశోధనలు జరుగుతున్నాయి, కానీ ఇంకా ఆశించిన ఫలితాలు కనబడలేదు.

ఈ లోపుల పరిశోధనల్లో తేలినదేమిటంటే Wolbachia బాక్టీరియం సోకిన కీటకాలు.. హ్యూమన్ డిసీజెస్ ని వ్యాపింప జేసే లక్షణాన్ని కోల్పోయాయిట. అందువల్ల శాస్త్రవేత్తలు ఈ లక్షణాన్ని ఆధారం గా చేసుకొని... ఆ బాక్టీరియాన్ని జన్యుపరం గా ఇంజినీరింగ్ చేసి ఈ కీటకాల్లో శాశ్వతం గా వుండిపోయేలాగ చెయ్యడానికి చూస్తున్నారు. దోమలో సోకిన వైరస్సు యొక్క విరులెన్స్ (విషపూరిత వ్యాధిని కలిగించే లక్షణం) కోల్పోయేలా ఈ బాక్టీరియా చేయడం తో దోమకాట్లద్వారా వైరస్సు మనిషికి సోకినా ఇక హాని వుండదు.

మొదటిప్రయత్నం గా డేంగూ వైరస్ కి యాంటీ బాడీ ని బాక్టీరియం లో ప్రవేశ పెట్టారు. ఈ వైరస్సు దోమలకు సోకినప్పుడు దానిని బైండ్ అయ్యే యాంటీబాడీ వుంది కాబట్టి వైరస్ అరికట్టబడుతుందనుకున్నారు. కానీ ఈ స్ట్రాటజీ పని చెయ్యలేదు. ఈ వైరస్సు రకరకాల స్ట్రెయిన్లను ఆల్ రెడీ డెవెలప్ చేసింది, ఒక స్ట్రెయిన్ ఒకసారి కీటకాలకి ఇన్ ఫెక్ట్ అయితే, వాటి లైఫ్ టైం సగానికి తగ్గిపోతున్నదిట. పైగా ఏజెడ్ కీటకాలు మాత్రమే ఈ వైరస్ ని పెంపొందిస్తున్నాయిట.  ఈ ఏజెడ్ దోమల్లో ఈ పర్టిక్యులర్ వైరస్సు డెవెలప్ అవ్వడానికి చాలా వారాలు పడుతుంది కాబట్టి ... ఈ ఏజెడ్ దోమల్ని గనుక నాశనం జేస్తే ఆ పర్టిక్లులర్ స్ట్రెయిన్ వల్ల వ్యాప్తి చెందే వ్యాధి ని అరికట్టవచ్చు అనే విషయాన్ని తెలుసుకున్నారు.

ఓనీల్ శాస్త్రవేత్తల టీం, ఏరీ హాఫ్మాన్ టీం శాస్త్రవేత్తల ( యూనివర్సిటీ ఆఫ్ మెల్బార్న్ నుండి) తో కలిసి Aedes aegypti  దోమల్లో ఒక స్ట్రెయిన్ wMel ని ప్రవేశపెట్టారు. ఈ స్ట్రెయిన్ ఈగలని ఇన్ ఫెక్ట్ చేస్తుంది. మిగితా స్ట్రెయిన్లతో పోలిస్తే ఈ స్ట్రెయిన్ ఇంకా బలమైనది మరియు చాలా త్వరితం గా తనని తాను హోస్ట్ లోపల వ్యాప్తిని చేసుకుంటుందిట.  అంత కన్నా ముఖ్యం గా డేంగూ వైరస్ యొక్క మనుగడలో ఇంటర్ ఫియర్ అయ్యి అంతర్గతం గా వైరస్ తో తలపడి, అది వ్యాప్తి కాకుండా అరికడుతుందిట. అది ఇంటర్ ఫియర్ అయ్యే విధానం ఏమిటంటే బాక్టీరియం ఈ వైరస్ హోస్ట్ లోపల ఉత్పత్తి అవ్వడానికి కావలసిన ఫేటీ యాసిడ్లు (fatty acids) మొదలైన మాలుక్యూల్స్ ని వాడేసుకుంటుంది. వైరస్ యొక్క వ్యాప్తికి కావల్సిన మాల్క్యూల్స్ వైరస్ కి అందనివ్వకుండా తన వ్యాప్తికి వాడుకుంటుంది ఈ బాక్టీరియం. ఈ బాక్టీరియం తాను ఇన్ ఫెక్ట్ అయిన ఏ కీటకాలకు ఎటువంటి హాని చెయ్యదు. అలాగే ఒక దోమ నుండి, మరో దోమకు కూడా సునా యాసం గా సోకదు. వాటి మధ్య క్రాస్ జరగాలి.. ప్రాజెనీ ద్వారా బాక్టీరియా ఒక జెనెరేషన్ నుండి మరో జెనెరేషన్ కి సంక్రమిస్తుంది.అందువల్ల ఈ శాస్త్రవేత్తల బృందం దోమల్ని బాక్టీరియల్ స్ట్రెయిన్ తో లోడ్ చేసి...రెసిడెన్సెస్ ఉన్నచోట పొదల్లోకి వాటిని వదిలారు. ఈ యెనాలిసిస్ అంతా ఆ చుట్టు పక్కల నివసించేవారి సహాయ సహకారాలతోనే సాగింది.

ఈ దేశంలో డేంగూ జ్వరాలు చాలా పెద్ద సమస్య అవ్వడం వల్ల... వాటి అంతు చూడాలనే వ్యవస్థ నిర్ణయించుకొని, వీరి పరిశోధనలకు పూర్తి సహయ సహకారాలను అందించారు. ఈ సంవత్సరం (2015) లో జనవరి, ఫిబ్రవరి ల మధ్య ఓనీల్ శాస్రవేత్తల టీం 3,00,000 దోమల్ని వదిలారుట. ప్రతి రెండు వారాలకొకసారి ట్రాప్స్ ద్వారా వాటిని పట్టి ఎగ్స్ ని పరీక్షిస్తున్నారు వాటిలో బాక్టీరియం వున్నదా లేదా అని. అద్భుతమైన విషయమేమిటంటే…. మే నెల కల్లా ఈ బాక్టీరియా ఇన్ ఫెక్ట్ అయిన దోమలు 80-90% పెరిగాయి.  కేవలం 5 నెలల కాలం లో ఈ బాక్టీరియా దోమల పాప్యులేషన్ ద్వారా పూర్తి గా వ్యాప్తిని చెందినది.

ఈ పరిశోధనలు హోస్ట్-పేరసైట్ ఎవల్యూషన్ (host-parasite evolution) కే పరాకాష్ట. ఈ విధం గా చూస్తే కేవలం డేంగూ వైరస్సే కాకుండా దోమల ద్వారా వ్యాప్తి చెందే వెస్ట్ నీల్ వైరస్ అలాగే మలేరియా వ్యాధిని కలిగించే ప్లాస్మోడియం ని కూడా అరికట్టవచ్చని అభిప్రాయపడుతున్నారు. అయితే ఎవొల్యూషన్ రీత్యా ఒక సమస్య ఎదురవ్వక పోదు. వైరస్సులకు త్వరితం గా పరివర్తన చెందే లక్షణం వుంది. ఒక వైరల్ స్ట్రెయిన్ ని అరికడితే మరో వైరల్ స్ట్రెయిన్ గా జన్యు పరివర్తనలు చెంది మారుతుంది. మరి వెంట వెంటనే అరికట్టే మార్గాలను కనిపెట్టడం చాలా కష్టం. ఈ విషయాన్ని ఓనీల్ గ్రహించక పోలేదు. ఇదంతా ప్రకృతి సహజం. ప్రకృతికి వ్యతిరేకం గా ఎవరూ పని చెయ్యలేరు. అయినా కూడా ఓనీల్ గ్రూప్ గుండె నిబ్బరాన్ని పోగొట్టుకోకుండా... డేంగూ కేసులని కంట్రోల్ చెయ్యడ మే ధ్యేయం గా పెట్టుకొని ఇప్పుడు వియత్నాం దేశం లో దీనిని అరికట్టే ప్రయత్నాన్ని లార్జర్ ట్రయల్  మొదలు పెట్టారు.
అమెరికాలో ఉన్న జాన్ హాప్కిన్స్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారు కూడా దీనిని చాలా ముఖ్యమైన మరియు గ్రౌండ్ బ్రేకింగ్ స్టడీస్ గా వర్ణించారు. ఈ రిపొర్ట్ "నేచర్" అనే సైన్స్ మాగజీను లో మొదటి సారిగా 2011 లో పడింది (Reference:  Walker et al (2011) The wMel wolbachia strain blocks dengue and invades caged Aedes aegypti populations. Nature).


సీరియస్లీ ఇది ఒక డిస్కవరీ. ఇన్ వెన్షన్ కాదు. చూస్తుంటే ఇటువంటి జెనిటిక్ సైన్స్ మానవాళి కి వుపయోగపడే క్రొత్త యానిమల్ స్పీషీస్ సృష్టించగలదనే నమ్మకం ఏర్పడుతున్నది.   

Wednesday, July 29, 2015

HTLV మరియు HIV పరస్పర లైంగిక అంటువ్యాధులు

ఒక దెయ్యం నెలవు వంద దెయ్యాలకు కొలువు అనే నానుడి వుంది. అలాగే వైరస్ కూడా. ఒక వైరస్ వ్యాధి అనేక రుగ్మతలకే కాక మరిన్ని వైరస్ ఇన్ ఫెక్షన్లకు పునాదులు వేస్తాయి ముఖ్యం గా అవి సెక్సువల్ కాంటక్ట్ వల్ల ఇన్ ఫెక్ట్ అయినవి అయితే. అలాంటి జోడు వైరస్సుల గురించి ప్రస్తావించి ప్రజలకు తెలియ పరచడమే ఈ ఆర్టికల్ యొక్క లక్ష్యం.

హెచ్.ఐ.వి (HIV or Human immunodeficiency virus) మరియు హెచ్.టి.ఎల్.వి (HTLV or Human T-lymphotropic viruses) సెక్సువల్ కాంటాక్ట్స్ ద్వారాసంప్రాప్తించే  ఏకకాలిక దీర్గ రోగాలు. మరలా ఒక్కొక్క దానికి టైప్ 1, టైప్ 2 అనే వెరైటీ స్త్రైన్స్ కూడా ఉన్నవి, ఏ స్ట్రైన్ అయినా కూడా క్షణాలలో అంటుకునేదే. రెట్రో వైరల్ గ్రూపుకు చెందిన ఈ రెండు వైరస్సులు ప్రపంచ వ్యాప్తం గా మానవాళిని పట్టి పీడిస్తున్నాయి.

హెచ్.ఐ.వి-1 మరియు హెచ్.ఐ.వి-2 సబ్ టైప్స్ ఎక్కడో అడవుల్లో చింపాంజీల, సూటీమాంగా బే ల మధ్య సంపర్కం జరిగినప్పుడు ఈ వైరస్సులు ఒకదాని నుండి మరొక దానికి ప్రసారమయ్యిందిట.  టైప్-1 చింపాంజీలల నుండి, టైప్-2 మాంగా ల నుండి ప్రసార మయినవి. ఈ రెండు హెచ్.ఐ.వీ లు ప్రపంచం మీదకి విజృంభించే 100 ఏళ్ళకు పైబడింది. కాకపోతే గత 30 ఏళ్ళ నుండే ఎయిడ్స్ రూపం లో హెచ్.ఐ.వి. గురించి, అలాగే మరొక వైరస్సు హెచ్. టి. ఎల్. వి. గురించి కూడా మానవునికి తెలిసినది. ఈ హెచ్.టి.ఎల్.వి. ఇంకా పాతది, వేల సంవత్సరాల క్రితమే ఆఫ్రికా అడవుల్లో ఉద్భవించిది. పిగ్మీ జాతుల వారి ద్వారా ప్రాకింది.

హెచ్.ఐ.వి వైరస్సులు చాలా త్వరితం గా విభజన చెంది, తాము ఇన్ ఫెక్ట్ అయ్యిన హోస్టు కణాలలో విస్తరించి, వాటినే ధ్వంసం చేసేస్తాయి.ఈ వైరస్సు యొక్క ప్రతి డెవలప్మెంటల్ స్టేజ్ కూడా విషపూరితమైనదే, ఇన్ ఫెక్ట్ కాగల సామర్ధ్యం గలిగినదే. ఇది కేవలం లైంగిక పరంగా మరియు రక్త మార్పిడుల వల్ల అంటుకొనేది..

హెచ్.టి.ఎల్.వి కూడా రెండు టైపులు 1 మరియు 2. ఈ రెండూ జెనిటిక్ గా చాలా దగ్గిర పోలికలను కలిగిఉన్నవి. ఒక 60-70 శాతం వరకూ.. వాటి జీన్ సీక్వెన్స్ కూడా మ్యాచ్ అవుతున్నదిట. ఈ వైరస్సులు బొవైన్ లుకేమియా (bovine leukemia) నుండి బయటపడినవి. అందుకే వీటిని బొవైన్ లుకేమియా వైరస్ గ్రూప్ క్రిందా మరియు  ఆన్ కోవిరినే (oncovirinae)  అనే సబ్ ఫ్యామిలీ గా విభజన చేశారు. ఈ వైరస్సు హెచ్.ఐ.వి లాగ కణాల్ని ధ్వంసం చెయ్యవు. కాని ఇన్ ఫెక్టెడ్ కణాల సంఖ్యను పెంచి శరీరం లో విస్తరిస్తుంది. అందుకే దీన్ని లుకేమియా వైరస్ అని అంటారు. పైగా ఇది బొవైన్ లుకేమియా నుండే బయటపడింది కూడా. ప్రిఫరబుల్ గా ఈ వైరస్సు శరీరంలో ని టి-లింఫోసైట్ల (T-lymphocytes) ని అటాక్ చేస్తాయి. అక్కడి నుండి మిగితా కణాలు మోనోసైట్లు (monocytes), బి-లింఫోసైట్లు (B-lymphocytes) కి కూడా ప్రాకుతుంది. ఈ వైరస్ కూడా లైంగిక పరమైనది. అలాగే రక్త మార్పిళ్ళ వల్ల, ఈ రోగం తో వున్న వా ళ్ళు పిల్లలకి పాలిచ్చినా కూడా ఇతరులకు సంక్రమించేస్తుంది. దీని ఇన్ ఫెక్షన్ దీర్ఘ కాలికము, రాకుండానే వుండాలి గాని, వైద్యం తీసుకున్నా కూడా కణాలలో అప్పటికి గుప్తం గా వుండి, అనుకూల పరిస్థితులు రాగానే మళ్ళీ విజృంభిస్తాయి.   అందుకే వీటిని గుప్తరోగాలు అని చెప్పడం జరిగింది.

హెచ్.టి.ఎల్.వి లుకేమియా వైరస్ జపాన్, కరేబియన్, ఆఫ్రికా, అమెరికా మరియు మెలనీసియా దేశాలలో ప్రబలమై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తమయిపోయింది.

హెచ్.ఐ.వి వైరస్ వంద యేళ్ళ క్రితం నుండే ఉద్భవిస్తే హెచ్.టి.ఎల్.వి. వేల సంవత్సరాల నాటిది. ఇప్పటి వరకూ ఈ ఇన్ ఫెక్షన్స్ అరికట్టబడలేదు. ఇవి ఇంకా ఇలాగే వుంటూ సబ్ టైప్స్ గా, సబ్ సబ్ టైప్స్ గా పురోగమిస్తున్నాయే తప్ప వీటికి తిరోగమనం మాత్రం లేవు. హెచ్.టి.ఎల్.వి టైప్ 2 మళ్ళీ టైప్ 2ఎ, 2బి మరియు 2సి లు గా రూపాంతరం చెందాయి. ఈ రకాలను వాటి జీన్ సీక్వెన్సెస్ లోని తేడాల వల్ల మాత్రమే విభజించగలిగారు. జీన్ సీక్వెన్సెస్ లలో తేడాలున్నప్పటికీ వాటి విరులెన్స్ లో ఏమైనా తేడా వుందా అని పరిశోధించి చూస్తే ఏమత్రం తేడా కనబడలేదుట. అంటురోగాలని వ్యాప్తి చెయ్యడం లో అన్ని సబ్ టైప్స్ సమానము. హెచ్.టి.ఎల్.వి -2 ఆఫ్రికాలో పుట్టింది ముఖ్యం గా పిగ్మీ జాతి వారిలో. అక్కడినుండి మెల్లగా అమెరికా, బ్రెజిల్ మరియు ఇతరదేశాలలో కూడా వేల సంవత్సరాల క్రితమే ప్రవేశించింది. దీని సబ్ టైప్స్ కూడా అమెరికా, యూరప్ మరియు బ్రెజిల్ దేశాలలో ఎక్కువగా ఆవరించి వున్నాయి. హెచ్.టీ.ఎల్.వి-1 వైరస్ పరిస్థితి కూడా ఇంతే.

హెచ్.టి.ఎల్.వి వైరస్ సోకాక మనిషికి ఎన్నో రకాల జబ్బులు, రుగ్మతలు వంట్లో పుట్టేస్తాయిట ముఖ్యం గా జాయింట్ల వాపులు, కీళ్ళవాతాలు. అవే కాక లింఫోప్రొలిఫిరేటివ్ మాలిగ్నెన్సీస్ (lympho proliferative malignancies) తో కూడా బాధపడుతుంటారు. శరీరమంతా చీడ పట్టేసినట్లే, ఎందుకంటే వైరస్సు ఇమ్య్యూన్ సిస్టం ని అటాక్ చేస్తుంది, మెల్ల మెల్ల గా శరీరం లోని అన్ని సిస్టములని తన చేతిలోకి తీసుకుంటుంది. ఇది స్లో పాయిజన్ జబ్బు కాబట్టి.. ఎటువంటి రోగ లక్షణాలని బయటపెట్టదు తన పనులు పూర్తయ్యేవరకు. రోగ లక్షణాలు తెలియకపోవడం వల్ల రోగం ఉందని కూడా రోగికి తెలియదు. దీనికి అనుకూల పరిస్థితులు పూర్తిగా ఏర్పడి, జబ్బు ముదిరి అడ్వాన్సుడు స్టేజ్ లో బయట పడేసరికి ఎంతో కాలం పడుతుంది. అంతవరకూ రోగులు క్యారియర్స్ గా వుంటూ వాళ్ళతో సంభోగించిన వాళ్ళకి వైరస్సును అంటిస్తుంటారు. ఈ రోగులకు టి-సెల్ లుకేమియా/లింఫోమా (T-cell leukemia/lymphoma) కూడా వస్తుంది. ఈ వ్యాధి వల్ల ఎముకలపై లీషన్స్ (lesions) వచ్చేస్తాయి. కాలేయము, స్ప్లీను ఎన్ లార్జ్ అయిపోతాయి. గ్యాస్ట్రిక్, కిడ్నీ ట్రబుల్స్ మరియు చర్మ వ్యాధులు కూడా ప్రాప్తిస్తాయి.

ఇలా ఇమ్యూన్ సిస్టం పూర్తిగా దెబ్బతిన్నాక హెచ్. ఐ.వి వైరస్సు ని ఆటోమేటిక్ గా ఈ హెచ్.టి.ఎల్.వి యే ఆహ్వానిస్తుంది. అదెలాగో చూద్దాం.

ఈ రెండింటిదీ ఒక బ్యూటిఫుల్ అసోసియేషన్, ప్రకృతి రహస్యం. హెచ్.టీ.ఎల్.వి ఇమ్యూన్ కణాలను (CD4+ లాంటి టి -సెల్స్) ఇన్ ఫెక్ట్ చేసి ఆపై ఇన్ ఫెక్టెడ్ కణాలను ప్రొలిఫరేట్ చేసి అధిక సంఖ్యలో పెంచి కణాల యాక్టివ్ కాంపౌండ్స్ (ప్రొటీన్స్, సైటోకైన్స్, కీమోకైన్స్) ని నార్మల్ నుండి అబ్నార్మల్ స్థితికి తెచ్చిపెడుతుంది. ఈ ఇన్ ఫెక్షన్ వల్ల టి-కణాల లోని యాక్టివ్ కాంపౌండ్స్ ఇతర వైరస్సులని నిరోధించే లక్షణాలను కోల్పోయి వాటిని ఆహ్వానించే స్థితిలోకి మారిపోతాయి. అబ్ నార్మల్ టి-సెల్స్ పై చిత్రం లో చూపబడిన విధం గా... వాటి పై వున్న స్పెసిఫిక్ రిసెప్టర్ ప్రొటీన్స్ ద్వారా హెచ్.ఐ.వి. ని ఆకట్టుకొని లేదా ఫ్యూజ్ అయ్యి, శరీరం లోకి ఆహ్వానిస్తుంది. అంటే హెచ్.ఐ.వి. ని ఫ్యూజ్ చేసే స్పెసిఫిక్ ప్రొటీన్స్ ని నిరోధించే సిగ్నల్స్ ని ఇన్ ఫెక్టెడ్ కణాలు పూర్తి గా కోల్పోతాయన్న మాట. ఈ లోపుల హైచ్.ఐ. వి కి వున్న ముఖ్య లక్షణం తాను ఇంఫెక్ట్ చేసిన హోస్ట్ కణాలని ధ్వంసం చేసేయడం. హెచ్.టి.ఎల్.వి ఇన్ ఫెక్షన్ ని ఎక్కువచేసి కణాలని అబ్నార్మల్ గా మార్చి హైహ్.ఐ.వి.కి ప్లాట్ ఫారం ను ఏర్పాటు చేస్తే హెచ్.ఐ.వి. ఒక్కసారి కణం లోకి చొచ్చుకొని పోయిన వెంటనే.. విభజన చెందుతూ ఆ కణాన్ని ధ్వంసం చేసి..పక్క కణాలను అటాక్ చేసుకుంటూ దాని మనుగడను సాధించుకుంటుంది. అసలు హోస్ట్ కణాన్నే ధ్వంసం చేసేస్తే.. తనకు ఏ చిన్న నిరోధకత కూడా హోస్ట్ కణం నుండి వుండదు కదా, అదీ హెచ్.ఐ.వి. తెలివి!! 

గత 30 ఏళ్ళనుండి మాత్రమే ఈ వైరస్సుల వునికి ని తెలుసుకొని పరిశోధనలు జరిపితే ఇప్పటికి వీటి మధ్య అసోసియేషన్ గురించి బయటపడింది. కాని డ్రగ్స్ మాత్రం లేవు ఆపడానికి. నిరంతర పరిశోధనలను జరుపుతూనే వున్నారు. ఇదిలా వుంటుండగా, ఈ ఇన్ ఫెక్షన్లతోనే కుదేలయిపోయిన శరీరాలకి హెపటైటిస్ సి (Hepatitis C) కూడా అటాక్ అవుతున్నదని కేసులు బయటకొచ్చాయి. ఈ కేసులను డయగ్నాసిస్ చాలా కేర్ ఫుల్ గా చెయ్యాలి. ఒకటి కన్నా ఎక్కువ వైరస్సులు అటాక్ అయివుండడం వల్ల వచ్చే టైటర్ వాల్యూస్ కూడా చాలా కన్ ఫ్యూజింగ్ గా  వుంటాయి.