గౌతమి

గౌతమి

Wednesday, February 24, 2016

// నువ్వు మరణమే లేని ప్రేమవు.... // 24.02.16_"విహంగ" మహిళా వెబ్ పత్రికా సౌజన్యంతో నా క్రొత్త కవిత ప్రేమికులకోసం.

http://vihanga.com/?p=16570#sthash.A3QRV1sW.dpbs

నిను వీడివెళుతున్నా కానీ                                                  
నా మనసు నీ చెంత వదిలెళుతున్నా అన్నావని
నీతో గడిపిన క్షణాలని తలుచుకొని
గడుపుతున్నా నువు లేని ప్రతి క్షణాన్ని...
.
నినువీడి వెళుతున్నా కానీ
నా గుర్తులు నీకై వదిలి వెళుతున్నా అన్నావనీ
కనీసం బ్రతికున్నా!...తలుచుకుంటూ నీ తీపి గుర్తులని
అవే నా ప్రేమకి ఉచ్చ్వాస నిశ్వాసాలని
.
నా వెంట నువ్వుంటున్నావని
బయటికెళ్ళి లోపలికొస్తే నువ్వు ఎదురయ్యావని
పదిమందిలో ఉన్నా నువ్వు పిలుస్తున్నావనీ
ఎంత తలచి రోజులు గడిపినా
.
నిన్ను స్పర్శించలేని చూడలేని నా జన్మ వ్యర్ధమని
చెప్తుంది నా కన్నీరు నిన్ను చేరమని.....
.
దేవుడు ఆడించే నాలుగు స్థంభాలాటలో నువ్వుతప్పుకున్నావ్
నా హృదయం పగులగొట్టావ్ ఆ దేవునితో చేతులు కలిపి
వంటరిగా ఆట పూర్తిచెయ్యమని మళ్ళీ భుజం తడుతున్నావ్
.
నీ నమ్మకం దేవునిమీద నా నమ్మకం నీ మీద
శాపమో వరమో అర్ధం కాని నా జీవిత పయనానికి
మళ్ళీ నీవే ప్రాణవాయువయ్యావ్
.
ప్రాణం తీయనూగలవు మళ్ళీ పోయనూ గలవు
ఇదే నీ నైజం కాబోలు అందుకే నువ్వు మరణమే లేని ప్రేమవు…..
.
(ప్రేమించిన తన మనిషి అస్తమయంతో బ్రతికున్నా తానూ ఇకలేనని పరితపించిన అమ్మాయి, అతని ఊహలు, జ్ఞాపకాలు తిరిగి తనకు ప్రాణవాయువయి తనలో శక్తిగా మారిందనీ అది ప్రేమనైజం అనీ, దానికి మరణమే లేదనీ తనలోనే బ్రతికుందని అర్ధం చేసుకొని నమ్మిన కోణం నుండి వ్రాసిన కవిత)

-డా.శ్రీసత్యగౌతమి, ఫిలడెల్ఫియా, అమెరికా