గౌతమి

గౌతమి

Saturday, August 22, 2015

కర్మ ఎవరిది????


ప్రతి మనిషి లో మంచి, చెడు వుంటుందంటారు. అంటే ఆ చెడు ఎటువంటి చెడు అయి వుండాలి? లోక కళ్యాణార్ధమయినదా? లోక కంఠకమైనదా?
.
అవసరాన్ని బట్టి మంచివాళ్ళే చెడ్డవాళ్ళుగా మారతారని చెప్తారు. అది ఎటువంటి చెడ్డతనమై వుండాలి? అది ధర్మ సంస్థాపనార్ధమై వుండాలా? లేక అధర్మ సంస్థాపన జరిగినప్పటికీ అది ఆపద్ధర్మం గానే భావించేసి, చెడు కి చెయ్యెత్తి జై కొట్టేయాలా?
.
కొంతమంది చెడు లో మంచిని వెతకాలంటారు. అది చెడు లేదా ఆ మనిషి చెడ్డ మనిషి అని ముందుగానే నిర్ణయం జరిగినప్పుడు, అందులో/వాళ్ళలో మంచి ఎలా కనబడుతుంది? అది కేవలం వాళ్ళలో దేన్నో ఆశిస్తూ చుట్టూ తిరిగే స్వార్ధ చింతన కాదూ??? ఆ స్వార్ధాన్ని, ఆ చెడు కూడా గుర్తించేసి కిసుక్కున నవ్వదు? ఆ చెడు, ఈ స్వార్ధాన్ని కాలి కింద చెప్పుచేసేసుకొని కోటలు కట్టుకొని బ్రతికెయ్యదు?????
.
స్వార్ధం తో అధర్మాన్ని పెట్టి పోషిస్తే చివరికి ఆ అధర్మమే భక్షిస్తుంది. 
.
లోకకళ్యాణర్ధమయినది నిస్వార్ధం, లోక కంఠకమైనదాంట్లో స్వార్ధ చింతన దాగివుంటుంది. స్వార్ధ చింతనతో రగిలిపోతూ వుండేవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళమనుకొని వీళ్ళకి పాలు పోసి పెంచే తెలివైన పామరులు... తప్పక లోక కంఠకానికే దారి తీస్తారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వల్ల, వాళ్ళు పాలు పోసి పెంచే దుష్టపాముల వల్ల చెడు ని విస్తరిస్తారు. 
.
మరి ఒక మంచి వాడి వల్ల అనుకోకుండా చెడు జరిగి, అవసరాన్ని బట్టి ఒక మంచివాడు చెడ్డవాడిగా మారి వాడూ చెడు చేసి, చెడులో మంచిని వెతుకుతున్నానని చెప్పి మసి పూసి మారేడు కాయ చేసే స్వార్ధపరుడి వల్లా చెడు జరిగి... మరి ఈ మూడు రకాల చెడు పోషకుల పోషణలో పెరిగి వట వృక్షాలయిపోయిన అసలు సిసలైన నిఖార్సయిన చెడ్డవాళ్ళు (పుట్టుకతో) రాజ్యాలేలుతుంటే మరి మంచికి తలదాచుకోవడానికైనా చోటు దొరుకుతుందా???
.
మంచిని రక్షించేదెలా? ఎవరైనా వున్నారా? లేక అధర్మానికి తనకు తానుగా స్వభక్షణ జరిగినప్పుడే మంచి రక్షించ బడినట్లు అని అనుకోవాలా?? 
.
ఎంత విచిత్రం? దీన్నే కర్మ అంటారా? ఎవరికర్మ? పాపి చేత బాధింప బడే మంచిదా? పాపిగా పుట్టి పాపిగానే బ్రతికి చివరివరకూ కనీసం మారడానికి కూడా ప్రయత్నించకుండా ఒకవేళ మారాలన్నా ఏ స్వార్ధపు హస్తాలలోనే బంధీ అయిపోయి అలాగే బ్రతికే పాపిదా?
.
కర్మ ముగ్గురిది. 
.

* స్వార్ధ చింతనతో పాపి పంచన చేరిన స్వార్ధిది.
.
*చివరి వరకూ పాపి గానే ముగిసిపోయే పాపిది.
.
*మంచిని బాధిస్తూ, వేధిస్తూ పాపం మూటగట్టుకొనే పాపిది.

.
కాని, పాపి చేత బాధింపబడే మంచిది మాత్రం కర్మ కాదు. ఎందుకంటే మంచి పుట్టిందే పాపుల కర్మలు కాల్పించడానికి !!!
.
ముక్కుపచ్చలారని రామలక్ష్మణుల్ని యజ్ఞయాగాలను ఆపుతూ, ఎప్పుడూ దైవ ధ్యానం లో వుండే మునులను పట్టి పీడించే రాక్షస, భూత, ప్రేత, పిశాచాల్ని తుదముట్టించడానికి విశ్వామిత్రుడు అడవులకు తీసుకు వెళ్తాడు. 

.

మరి, ఎప్పుడు దైవధ్యానం లో వుండే మునులకు రాక్షస, భూతాల వల్ల నీచనికృష్టమైన చావులు రావడం ఏమిటీ? మునులు అనుకొనివుండచ్చు, ఎప్పుడూ యాగాలు చేసుకొనే మాకు ఈ "కర్మ" ఏమిటీ అని!

.
రాక్షస, భూత ప్రేతాల కర్మ కాలింది కాబట్టే మునుల జోలికొచ్చేరు. పాపాల కోటా పెంచుకున్నారు. ఒక్కసారి పాపాల పంట పండ గానే... రాముడొచ్చేశాడు, లయం చేశేశాడు!! ఈ లయం కార్యం లో మంచివాళ్ళు సమిధలు కాక తప్పదు.

Sunday, August 2, 2015

My first poetry in manatelugutimes on father's day June 21st, 2015- అమ్మఅనిర్వచనీయం – నాన్నఅసాధ్యం.


http://www.manatelugutimes.com/archives/1535



అమ్మ నవమాసాలూ మోసి జీవం పోస్తే
తన ప్రాణాన్నిపంచ ప్రాణాలుగా చేసి
ఆ జీవానికి ఒక రూపు నిచ్చేది నాన్న..

జోలపాడి గోరు ముద్దలు తినిపించేది అమ్మైతే
నడక రాక ముందే తనవ్రేళ్ళని ఊతగా ఇచ్చి
పాదాలను పరుగులెత్తించే శక్తి నాన్న…

నల్లబొట్టుపెట్టి అందరి దిష్టి తీసేసి అమ్మ మురిస్తే
భుజాల పైకెత్తుకొని ప్రపంచాన్నంతా పరిచయంచేసేది నాన్న..
ఏ రాత్రికైనా నిద్రలేచి ఆటలాడుతుంటే తాను నిద్రమాని
వెంటనుండి తనప్రాణాన్నిపంచప్రాణాలు చేసి కాపాడేది నాన్న..

బడికెళ్ళక ముందు అమ్మచేతి పాఠాలు
పలకచేతబట్టి బళ్ళోకి నాన్నతోటిఉరుకులు
ఓనమాలుదిద్దించడానికే...మంచిబడికావాలని
ఊరంతాగాలించి ఆలోచించి అడుగులేయించే మార్గదర్శి నాన్న..

పనివత్తిడి ఎంతవున్నాఆపదలోవున్నానంటే
ఒక్క నిముషం ఆరామించని కంటిపాపతోకనిపెట్టుకుండేది నాన్న…
తన ఆరవ ప్రాణం ఆటపాటల్లో గెలిచి మెడలో పతకాలు వేసుకునే తరుణానికి
అలుపెరగని ఆశతో ఎదురు చూసే దేవుడిచ్చిన బంగారుపతకం నాన్న…

జీవితమనే పూలబాటను వేసి నడుమనొచ్చే ముళ్ళకు
వెరయకుండా ఎలాబ్రతకాలో చూపించే ఆదర్శమూర్తి నాన్న..
కొడుకు తనంతటివాడు కావాలనీ కూతురు తలతన్నేవాడు కాదు
తాడిని తన్నేవాడి ఇంటమెట్టాలని శ్రమించే పరిశ్రమ నాన్న..

జీవిత నౌకాయానం ఎన్ని ఈదురుగాలులకు గురవుతున్నా
అలల మధ్య చిక్కుకొనికొట్టుమిట్టాడినా దైర్యంగా ఒడ్డుజేర్చే దిక్సూచి నాన్న..
కన్నవాళ్ళకోసం తనుకన్నవాళ్ళకోసం తనని నమ్మినవాళ్ళకోసం
క్రొవ్వొత్తిలా కరుగుతూ వెలుగులుచిందే మహనీయుడు నాన్న..
అందుకే అమ్మఅనిర్వచనీయం…. నాన్నఅసాధ్యం !!!

First article in "manatelugutimes" on August 2nd 2015 _ హ్యాపీ ఫ్రెండ్ షిప్ డే !!!


http://www.manatelugutimes.com/archives/1597


స్నేహితుడు లేదా స్నేహితురాలు అంటే మానవులకు సహాయంచేసేవారు అని అర్ధం. ఈ స్నేహితులు అనే పదానికి చాలా పెద్ద విశ్లేషణలున్నాయి.
.
ఆపదలో ఆదుకునేవాళ్ళు స్నేహితులు,
మొదటినుండి జీవితంలో అంటిపెట్టుకుని వుండేవాళ్ళు స్నేహితులు,
మంచి సలహాలతో ముందుకి నడిపించేవాళ్ళు స్నేహితులు.
జీవితమనే ఉద్యానవనంలో అందమైన పుష్పాలు స్నేహితులు.
.
స్నేహానికి మరికొన్ని లక్షణాలున్నాయి- విశ్వాసం, నిస్వార్ధం, జ్ఞాపకం, నిరహంకారం. 
.
శత్రువు ఒక్కడైనా ఎక్కువే, మిత్రులు వందయినా తక్కువే అనేది వివేకానందులవారి ఉవాచ. 
.
కష్టకాలంలోనే మిత్రులెవరో తెలుస్తుంది అనేది గాంధీగారి మంత్రం. 
.
నీ తప్పులను, నీ తెలివితక్కువ పనులను మనస్సు దాచుకోకుండా నీ ముందుంచువారే నిజమైన స్నేహితులు అని బెంజిమన్ ఫ్రాంక్లిన్ ప్రస్తావించారు.
. 
మాటలకు మాత్రమే పరిమితమయ్యే మిత్రులు మిత్రులేకారు. చెడ్డ మిత్రులకన్నా అసలు మిత్రులు లేకపోవడమే మంచిదన్నారు మార్టిన్ లూథెర్ కింగ్. 
.
అంతే కాదండోయ్ మిత్రులని బట్టి మనిషిని అంచనా వేయొచ్చు అని కూడా అంటారు. ఈ సృష్టిలో నా అనేవారు, బంధువులేనా లేనివారుంటారేమో కాని స్నేహితులు లేని వారుండరు. స్నేహం సరియైనదైతే భావం సరియైందవుతుంది, భావం సరిగ్గావుంటే ప్రేరణ సరిగ్గా వుంటుంది, ప్రేరణ సరియైనదయితే కార్యాచరణ సరిగ్గావుంటుంది. కార్యాచరణ సరిగ్గావుంటే విజయం మనదవుతుంది - ఇది నా మాట !
.
 కొంతమంది స్త్రీ, పురుషులు స్నేహం ముసుగు లో సెక్స్ ని ప్రపోజ్ చేస్తారు, ఆ స్నేహాన్ని కలుషితం చేస్తారు. స్నేహం పేరు మీద కలిసి తిరిగేస్తుంటారు, ఏవో కొన్ని బలహీన క్షణాల్లో ఆకర్షితులవుతారు. ఇద్దరిలో ఏ ఒక్కరు ఆకర్షణకు లోనైనా మరికరికి సమస్య అయి కూర్చుంటారు. ఇటువంటి ధోరణులను మార్చుకోవాలి. ఎదుటివారి మనసెరిగి సున్నితం గా ప్రవర్తించగలిగితే ఎదుటివారికి మంచిది, సదరు వ్యక్తులకు మంచిది అంతకన్నా ముఖ్యం గా అప్పటివరకూ సాగిన మంచి స్నేహం కొనసాగుతుంది.  కొంతమంది స్నేహాన్ని ప్రేమ గా మార్చుకుంటారు, పెళ్ళి వరకూ వెళ్తారు అది అనుకోకుండా జరిగితే దానికున్న ప్రత్యేకత వేరు. ఒక భర్తో లేదా భార్యో మంచి స్నేహితులు కాలేకపోవచ్చు, కానీ మంచి స్నేహితులు మాత్రం మంచి భర్త లేదా మంచి భార్య అయ్యే అవకాశాలు తప్పక వున్నాయి. మనసుని అదుపులో పెట్టుకొని స్నేహం చేసే వాళ్ళ విషయం లో ఈ సంఘటనలు కూడా జరిగే అవకాశాలు తక్కువ. అదుపు తప్పి ప్రవర్తించేవాళ్ళకి సెక్స్ ఒక చానల్ వాళ్ళ స్నేహానికి. ఎదుటివారు తిరస్కరించినప్పటికీ కూడా వదలరు. ఎలాగోలా వాళ్ళ మంచితనాన్ని, మొగమాటాల్ని లొంగదీసుకొని సెక్స్ వాంచలను తీర్చుకోవడానికి ముందంజ వేస్తారు. ఇటువంటి వారి చేతిలో స్నేహం సెక్స్ వాంచలు తీర్చే ఆట వస్తువయిపోతుంది.
.
స్నేహితుల పట్ల బుర్రల్లో వచ్చే ప్రమాదకరమైన ఆలోచనలకు, ప్రణాళికలకు వెంటనే స్వస్తి చెప్పాలి. పరిగెడుతున్న కోరికలకు కళ్ళేలు వెయ్యాలి అది ఇరువురి పైనా ఆధారపడి వుంది. ఒకరు బలవంతం చేస్తున్నారుకదా అని మరొకరు లొంగనవసరం లేదు, గట్టిగా నిలబడి బుద్ది చెప్పాలి అది జరగలేని పక్షం లో అటువంటి కాలుష్యం నుండి తప్పుకోవాలి.
.
మంచి పుస్తకాలని చదవడం, మంచిని గ్రహించడం, సామాజికహితమైన కార్యక్రమాల్లో పాల్గొనడం లాంటి పనులు చేస్తూ మానసికం గా మంచి అలోచనలను చేస్తూ ఆ మంచిని స్నేహం పేరుతో నలుగురికీ పంచుతూ ఆ స్నేహమనే మొక్కని పెంచుతూ నలుగురికీ నీడ నిచ్చే వృక్షాన్ని చెయ్యాలి.
.
స్నేహాన్ని మీరు రక్షిస్తే స్నేహం మిమ్మల్ని రక్షిస్తుంది !!!

నా ఆర్టికల్ "అమ్మో! స్వైన్ ఫ్లూ వాక్సిన్.."-ఆదివారం విశాలాంధ్ర ఆగష్టు 2, 2015.