గౌతమి

గౌతమి

Saturday, August 22, 2015

కర్మ ఎవరిది????


ప్రతి మనిషి లో మంచి, చెడు వుంటుందంటారు. అంటే ఆ చెడు ఎటువంటి చెడు అయి వుండాలి? లోక కళ్యాణార్ధమయినదా? లోక కంఠకమైనదా?
.
అవసరాన్ని బట్టి మంచివాళ్ళే చెడ్డవాళ్ళుగా మారతారని చెప్తారు. అది ఎటువంటి చెడ్డతనమై వుండాలి? అది ధర్మ సంస్థాపనార్ధమై వుండాలా? లేక అధర్మ సంస్థాపన జరిగినప్పటికీ అది ఆపద్ధర్మం గానే భావించేసి, చెడు కి చెయ్యెత్తి జై కొట్టేయాలా?
.
కొంతమంది చెడు లో మంచిని వెతకాలంటారు. అది చెడు లేదా ఆ మనిషి చెడ్డ మనిషి అని ముందుగానే నిర్ణయం జరిగినప్పుడు, అందులో/వాళ్ళలో మంచి ఎలా కనబడుతుంది? అది కేవలం వాళ్ళలో దేన్నో ఆశిస్తూ చుట్టూ తిరిగే స్వార్ధ చింతన కాదూ??? ఆ స్వార్ధాన్ని, ఆ చెడు కూడా గుర్తించేసి కిసుక్కున నవ్వదు? ఆ చెడు, ఈ స్వార్ధాన్ని కాలి కింద చెప్పుచేసేసుకొని కోటలు కట్టుకొని బ్రతికెయ్యదు?????
.
స్వార్ధం తో అధర్మాన్ని పెట్టి పోషిస్తే చివరికి ఆ అధర్మమే భక్షిస్తుంది. 
.
లోకకళ్యాణర్ధమయినది నిస్వార్ధం, లోక కంఠకమైనదాంట్లో స్వార్ధ చింతన దాగివుంటుంది. స్వార్ధ చింతనతో రగిలిపోతూ వుండేవాళ్ళు, చాలా తెలివైన వాళ్ళమనుకొని వీళ్ళకి పాలు పోసి పెంచే తెలివైన పామరులు... తప్పక లోక కంఠకానికే దారి తీస్తారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ వల్ల, వాళ్ళు పాలు పోసి పెంచే దుష్టపాముల వల్ల చెడు ని విస్తరిస్తారు. 
.
మరి ఒక మంచి వాడి వల్ల అనుకోకుండా చెడు జరిగి, అవసరాన్ని బట్టి ఒక మంచివాడు చెడ్డవాడిగా మారి వాడూ చెడు చేసి, చెడులో మంచిని వెతుకుతున్నానని చెప్పి మసి పూసి మారేడు కాయ చేసే స్వార్ధపరుడి వల్లా చెడు జరిగి... మరి ఈ మూడు రకాల చెడు పోషకుల పోషణలో పెరిగి వట వృక్షాలయిపోయిన అసలు సిసలైన నిఖార్సయిన చెడ్డవాళ్ళు (పుట్టుకతో) రాజ్యాలేలుతుంటే మరి మంచికి తలదాచుకోవడానికైనా చోటు దొరుకుతుందా???
.
మంచిని రక్షించేదెలా? ఎవరైనా వున్నారా? లేక అధర్మానికి తనకు తానుగా స్వభక్షణ జరిగినప్పుడే మంచి రక్షించ బడినట్లు అని అనుకోవాలా?? 
.
ఎంత విచిత్రం? దీన్నే కర్మ అంటారా? ఎవరికర్మ? పాపి చేత బాధింప బడే మంచిదా? పాపిగా పుట్టి పాపిగానే బ్రతికి చివరివరకూ కనీసం మారడానికి కూడా ప్రయత్నించకుండా ఒకవేళ మారాలన్నా ఏ స్వార్ధపు హస్తాలలోనే బంధీ అయిపోయి అలాగే బ్రతికే పాపిదా?
.
కర్మ ముగ్గురిది. 
.

* స్వార్ధ చింతనతో పాపి పంచన చేరిన స్వార్ధిది.
.
*చివరి వరకూ పాపి గానే ముగిసిపోయే పాపిది.
.
*మంచిని బాధిస్తూ, వేధిస్తూ పాపం మూటగట్టుకొనే పాపిది.

.
కాని, పాపి చేత బాధింపబడే మంచిది మాత్రం కర్మ కాదు. ఎందుకంటే మంచి పుట్టిందే పాపుల కర్మలు కాల్పించడానికి !!!
.
ముక్కుపచ్చలారని రామలక్ష్మణుల్ని యజ్ఞయాగాలను ఆపుతూ, ఎప్పుడూ దైవ ధ్యానం లో వుండే మునులను పట్టి పీడించే రాక్షస, భూత, ప్రేత, పిశాచాల్ని తుదముట్టించడానికి విశ్వామిత్రుడు అడవులకు తీసుకు వెళ్తాడు. 

.

మరి, ఎప్పుడు దైవధ్యానం లో వుండే మునులకు రాక్షస, భూతాల వల్ల నీచనికృష్టమైన చావులు రావడం ఏమిటీ? మునులు అనుకొనివుండచ్చు, ఎప్పుడూ యాగాలు చేసుకొనే మాకు ఈ "కర్మ" ఏమిటీ అని!

.
రాక్షస, భూత ప్రేతాల కర్మ కాలింది కాబట్టే మునుల జోలికొచ్చేరు. పాపాల కోటా పెంచుకున్నారు. ఒక్కసారి పాపాల పంట పండ గానే... రాముడొచ్చేశాడు, లయం చేశేశాడు!! ఈ లయం కార్యం లో మంచివాళ్ళు సమిధలు కాక తప్పదు.

No comments:

Post a Comment