గౌతమి

గౌతమి

Sunday, January 11, 2015

ప్రతివారం గుడికెళ్తాను, కొబ్బరికాయ కొడతాను.. అయినా ఏ దేవుడూ దయ తలచడు, మరి గురువు మాత్రం ఏమి చేస్తున్నాడని?



మనిషికి, దేవునికి మధ్య వారధి గురువు. తన భారాన్ని తానే మోసుకుంటూ ఒకసారి వారధి వరకూ జాగ్రత్తగా వచ్చేస్తే అక్కడినుండి ఆ భారాన్ని గురువు మీద వేసేయవచ్చు. అప్పటికి గానీ గురువు కి మనమెవరమో తెలియదు అని “కాదు”. అలాగే తాను ఎన్ని అష్ట కష్టాలు పడుతూ, కోరుకున్న కోరికలు తీరక, అనుకున్నంత డబ్బురాక, కొందరిలా అన్నీ నాకెందుకు దొరకడం లేదు.. ప్రతివారం గుడికెళ్తాను, కొబ్బరికాయ కొడతాను.. అయినా ఏ దేవుడూ దయ తలచడు, మరి గురువు మాత్రం ఏమి చేస్తున్నాడని? ఎప్పుడూ ఆందోళనే ఎప్పుడూ అసంతృప్తే… ఇలా మానవుని ఆలోచనలు పరిపరి విధాల పరిగెడుతూనే వుంటుంది. నిలబడి తన అలోచ నా సరళి సరళంగా గానీ లేదా న్యాయసమ్మతం గా గానీ లేదా చట్టబద్దం గా గానీ వుందా అని ఎప్పుడైనా ప్రశ్నలు వేసుకుంటే సమాధానాలు దొరక్కపోవు కదా?
బాబాగారికి భక్తులవ్వడానికి ముందు వారు ప్రత్యేక తరహాలో వివిధ అనుభవాలకు లోనవుతారు. విచిత్రం ఏమిటంటే కొంతమందిని బాబాయే వెతుక్కుని వెళతారు, పరిచయమూ చేసుకుంటారు. అది వారి పూర్వ జన్మ సుకృతం అనుకుంటా…..మరికొంతమంది విషయం లో వాళ్ళకి తెలియకుండానే వాళ్ళయందు బాధ్యత పడుతూ, వారికి తోడ్పడడానికి మరోక భక్తుని సహాయం తీసుకుంటారు. కానీ, అవసరానికి బాబా సహాయం పొందుతున్న వ్యక్తికి మాత్రం తెలియదు తాను ఎవరివల్ల సుఖపడుతున్నాడో. బాబాగారిని ఇంకా గుర్తించలేకపోవడము, బాబాకు దగ్గిర కాలేకపోవడము ఆ వ్యక్తి యొక్క దురదృష్ఠము, వెంటాడుతున్న ఖర్మము. మరి కొంతమంది విషయములో పరీక్షలు. ఆ పరీక్షల మూలం గా పాఠం నేర్చుకోవడం, బాబాను గుర్తించడము- అంటే అప్పటికి వారి ఖర్మము అలా నివృత్తి అయ్యి ఉంటుంది, బాబాని గుర్తించడం జరిగివుంటుంది. మరికొంత మంది బాబా యందు మూర్ఖత్వాన్ని చూపి.. పూర్తిగా నమ్మక… బాబాకు పరీక్షలు పెట్టి (భౌతికంగా లేకపోయినా) అంటే బాబా దగ్గిర చేసుకోవాలని చూస్తుంటారు.. వీళ్ళు మూర్ఖత్వంతో ఎడ్డె మంటే తెడ్డం అని మా అంతటివారు లేరు, అంతా మేమే అని పారిపోతుంటారు. అప్పుడది బాబా గారికి కష్టమిచ్చినట్లే. గురువుకి కూడా పరీక్షలే! ఆ మూర్ఖత్వం కూడా శాపకర్మమే. గురువు ఆ మూర్ఖత్వం మీద వర్క్ అవుట్ చేస్తే గాని ఆ సదరు వ్యక్తికి శాపవిమోచనమూ కాదు, గురువుకు దగ్గరనూ కాడు.
సోమదేవస్వామి అనే వ్యక్తి బాబాగారి మీద అనుమానపు దృష్ఠి తో (అంటే ఆయన నిజం గా యోగి యేనా అనేటటువంటి మీమాంస) షిర్డీ వచ్చాడుట . అతను షిరిడీ రాగానే ఇంకా బాబాను కలవడానికి ముందరే అంటే శిష్య వర్గాన్ని కలసిన తోడనే అతని మొదటి అనుభూతి- మన:శ్శాంతి, మానసిక ఉల్లాసము. ఇది బాబా గారి లక్షణము, ఆయన్ని నిరంతరం కొలిచేవారికి కూడా అదే లక్షణాన్ని బాబా ప్రసాదిస్తారు. అందుకే సోమదేవస్వామి కి అట్టి అనుభూతి. అనుమానం తో వచ్చిన వ్యక్తికి ఎన్నడూ అనుభూతి చెందని శాంతి, నిశ్చలత, ఉల్లాసము ఏల కలిగెను? అంటే ఆపాటివరకూ ఆయనకున్న కర్మం తొలగింది, తనను తాను గుర్తించడం మొదలు పెట్టాడు. క్రొత్తగా తనని తాను గుర్తించడం అనేది జరగడమే గురువు సంకల్పం. ఆ సంకల్పమే సోమదేవస్వామిని షిరిడీ రప్పించింది, అతని జీవితాన్ని మార్చింది.
ఈ లోపున సోమదేవస్వామికి తన మొదటి గురువు చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి- “ఎచ్చట మనసు శాంతించి ఆనందం పొంది ఆకర్షింపబడునో అదే మనము విశ్రాంతి పొందవలసిన స్థలము” అని. బాబాయందు తన మూర్ఖపు ఆలోచనలు వీడి వెంటనే సోమదేవస్వామి బాబాను తప్పక కలసి వెళ్ళాలనే గట్టి నిర్ణయం తీసుకున్నాడు. మూర్ఖత్వం నుండి జ్ఞానోదయం కలగడం అంటే ఇదేనెమో? దీనికా దైవసంకల్పమూ, గురు బలమూ రెండూ లేకపోతే జరగనే జరగదు. తనను తాను తెలుసుకోకుండా, తన చుట్టు ప్రక్కల పరిస్థితులను అర్ధంచేసుకోకుండా, అర్ధం లేకుండా బ్రతికేయడం కూడా ఒక శాపం!

No comments:

Post a Comment