గౌతమి

గౌతమి

Sunday, November 6, 2016

తుది నిర్ణయం తనదే!!!


మన సహాయం ఎవరైనా అర్ధిస్తే, తప్పక చేయడంగానీ, లేక చేయించడం గానీ మన ధర్మమని షిరిడీ సాయినాధులవారు చెప్తుండేవారు. వారుగూడా యీ ధర్మం పాటించారు. ఒకప్పుడొక రైతు తన పొలంలో బావికై అర్జీ పెట్టుకుంటే జిల్లా కలెక్టరు త్రోసిపుచ్చాడు. అతడు బాబాతో చెప్పుకుంటే ఆయన, "నీవు నానా చందోర్కర్ తో కలసి కణీత్కర్ తో మాట్లాడు, నేను నానాతో చెబుతాను అన్నారు. తర్వాత నానా సహకారం వలన కలెక్టరు అది మంజూరు చేశాడు. అతడుబావి త్రవ్వించుకొని, పంటలొచ్చాక తన అప్పులన్నీ తీర్చుకున్నాడు.
                                                                   -శీ సాయిలీలామృతము
                                                                     అధ్యాయము-9_ఉపదేశాలు విభాగము
                                                                     రచన: ఆచార్య శ్రీ యక్కిరాల భరద్వాజ

"ఈ ధర్మం వారు కూడా పాటించారూ" అంటే గుర్తొచ్చింది. అది నిజమే. నా స్వానుభవం కూడా. 2013 లో అమెరికాలో పున:ప్రవేశం చేసినప్పుడు ఒక తెలుగు కుటుంబం (ఇంతకు మునుపు కాస్త తెలిసినవారు) తో ఇంకాస్త పరిచయం పెరిగింది. వాళ్ళు సాయి భక్తులని అప్పుడే తెలిసింది ఇంకాస్త పరిచయంలో. ఇంతలోనే వాళ్ళు ఇల్లు కొనుక్కొని వెళ్ళిపోయారు. నేనుండే అపార్ట్మెంట్స్ నుండి వాళ్ళ ఇల్లు చాలాదూరం కూడా, కాకపోతే పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ ఉంది వాళ్ళ ఇంటికి దగ్గిరగానే. దగ్గిరలో దిగి, ఇంటికి నడుచుకొని వెళ్ళాలి. అప్పుడే పున:ప్రవేశం చెయ్యడంవల్ల నేనింకా కారు కొనలేదు అప్పటికి. అందువల్ల ఎక్కడ తిరగాలన్నా దగ్గిర ప్రాంతాలకే పరిమితమయ్యాను. కాని ఏం విచిత్రమో ... అంతదూరంలోవున్న వీళ్ళ ఇంటి గృహప్రవేశానికి మాత్రం దీక్షబూనినట్లు కష్టమయినా పబ్లిక్ ట్రాన్స్ పోర్టేషన్ తీసుకొని ... లోకల్ టైన్స్ మిస్ అయినా కూడా ... గంటల సేపు నిరీక్షించి మరీ వెళ్ళి వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నాను. భార్యా భర్తలిద్దరూ ఆయా కార్యక్రమాల్లో కూర్చొనివున్నారు, పిల్లలు చూస్తే చిన్నవాళ్ళు. ముఖ్యంగా ... వారికి ఇతర అతిధులు వచ్చి వున్నా అందరిలోకి నన్నే పూజారి కూడా పిక్ అప్ చేసి వాళ్ళ ఇంట్లో మనుష్యులకి చెప్పి చేయించేటట్లుగా కొన్ని విధివిధానాలను నా చేతులమీదుగా చేయించారు. నేను కూడా ఏమాత్రం కూడా తడబడకుండా చక చకా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చేసేసాను. అయితే జస్ట్ అంతకు మునుపే నా స్వంత ఇంటి శంకుస్థాపన కార్యక్రమాలు నా చేతులమీదుగా చేసివున్నానుకోండి. అయితే అది వీళ్ళకు తెలియదు కదా, అందులోనూ పూజారిని అదే మొదటిసారి కలవడం, కాబట్టి చాన్సే లేదు నాకున్న ప్రాక్టీస్ గురించి. దీని వెంటనే అలా వాళ్ళు సాయిబాబా పూజ చేసుకొంటే దానికీ ఒక ముఖ్య అతిధిగా వెళ్ళడం జరిగింది. ఇదంతా అయ్యాక, నాకే చాలా ఆశ్చర్యం వేసింది... ఈ ప్రయాణ ప్రయాసలకోర్చి నేనేనా అంత దూరం వెళ్ళినది అని? తర్వాత అప్పుడే అనుకున్నాను బాబాగారి లీలమృతంలో ఎన్నో కధలున్నాయి. 

                                          (పైన చూపబడిన చిత్రం గూగుల్ నుండి)
ఉదాహరణకు ఎక్కడో తన భక్తుల ఇంట వారి బిడ్డ ప్రసవవేదన పడుతుంటే అక్కడ వారా బాధలో తనని తలచినంతనే తన వద్ద కూర్చొన్న మరో భక్తుడికి విభూతినిచ్చి ఆమెకిమ్మని చెప్పి పంపుతారు. అలా తన భక్తుల ఇంట్లో అవసరానికో, ఆపదల్లో ఉన్నప్పుడో ... సర్వజ్ఞుడిగా అన్నీ ముందుగా తెలుసుకొని సమయానికి తన మరో భక్తులని పంపి వారి అవసరం తీరుస్తారని. ఎవరి అవసరాలు ఎలా తీరాలో తానే నిర్ణయించి ఆదేశిస్తారని. ఆ రెండు కార్యక్రమాల తర్వాత ఆశ్చర్యంగా మేము మళ్ళీ ముఖాముఖి కలుసుకునే అవకాశం ఏర్పడలేదు. కాని ఆ సమయం లో మాత్రం చెయ్యి పట్టుకొని లాక్కెళ్ళినట్లే వెళ్ళాను. తన భక్తులని ఎప్పుడు, ఎలా కనెక్ట్ చెయ్యాలో తెలిసిన ఏకైన జ్ఞాని ఆ సద్గురువే. బాబాగారు అనేవారుట ... నా భక్తుల పూర్వజన్మ సుకృతం మేరకు వారు నన్ను కనుక్కునే తీరుతారు, వాళ్ళ వద్దకు నేనే వెళతాను లేదా ఏదైనా కోరికల (మానవ జన్మకు అది సహజవిధానము) మేరకు వారే నన్ను సమీపించి అక్కడినుండి నాతో అడుగులు వేస్తారని.

ఈ వేళ లీలామృతాన్ని పారాయణం చేస్తుంటే కరెక్ట్ గా ఎక్కిరాలవారు రచించిన ఆ పాయింట్ల దగ్గిరకి వచ్చేటప్పుడు 2013 లోని ఈ సంఘటన గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా సద్గురువు యొక్క సందేశమే ఈ లీలామృత పారాయణం. హటాత్తుగా కూర్చొబెట్టి చదివిస్తున్నారు ఒక ముఖ్య విషయార్ధమై.
.

శ్రీ సద్గురు సాయినాధ మహరాజ్ కీ జై!

No comments:

Post a Comment